ఎన్నికల ప్రత్యేక అధికారుల నియామకం | Sakshi
Sakshi News home page

ఎన్నికల ప్రత్యేక అధికారుల నియామకం

Published Sun, May 26 2024 7:50 AM

-

ఒంగోలు టౌన్‌: ఎన్నికలకు సంబంధించిన విధుల నిర్వహణలో భాగంగా ముగ్గురు అధికారులను ప్రత్యేకంగా నియమిస్తూ డీజీపీ ఆదేశాలు జారీ చేశారు. సీఐడీ అడిషనల్‌ ఎస్పీ పీవీఆర్‌ఎస్‌ఎస్‌ఎంవీఆర్‌ వర్మ, ఎస్పీ (ఎన్‌సీ) విజిలెన్స్‌ అండ్‌ ఎన్ఫోర్స్‌మెంట్‌ డీ హైమావతి, సెబ్‌ అడిషనల్‌ ఎస్పీ కాకినాడ కె.శ్రీలక్ష్మిని ప్రకాశం జిల్లాకు కేటాయించారు. వెంటనే యూనిట్‌ ఆఫీసర్‌కు రిపోర్టు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

నేటి నుంచి

డిగ్రీ మూల్యాంకనం

ఒంగోలు: ఆంధ్రకేసరి విశ్వవిద్యాలయం పరిధిలోని డిగ్రీ మొదటి సంవత్సరం రెండో సెమిస్టర్‌ జవాబు పత్రాల మూల్యాంకనం ఆదివారం నుంచి తమ కాలేజీ ఆవరణలో నిర్వహిస్తున్నట్లు స్థానిక డీఎస్‌ ప్రభుత్వ మహిళా డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్‌, క్యాంపు నోడల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ డి.కళ్యాణి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు క్యాంపు జరుగుతుందన్నారు. ఇంగ్లిషు, తెలుగు, సంస్కృతం, హిందీ, ఎకనామిక్స్‌, కామర్స్‌, గణితం, జువాలజీ, కెమిస్ట్రీ, కంప్యూటర్‌ సబ్జక్టుల జవాబు పత్రాలకు మూల్యాంకనం మొదలవుతుందన్నారు. పొదిలి, దర్శి, అద్దంకి, ఒంగోలు ప్రాంతాల్లో ప్రభుత్వ ఎయిడెడ్‌, ప్రైవేటు కళాశాలల అధ్యాపకులంతా తప్పనిసరిగా తాము పనిచేసే కాలేజీలో రిలీవింగ్‌ తీసుకుని క్యాంపునకు హాజరుకావాలన్నారు. రిలీవింగ్‌ ఆధారంగా యూనివర్శిటీ వారు పంపిన జాబితా ప్రకారం పేపర్లు ఇస్తారని, ముందుగా వచ్చిన వాళ్లకు ప్రాధాన్యత ఉంటుందన్నారు.

జిల్లాకు చేరిన

1473 సర్వీసు ఓట్లు

ఒంగోలు అర్బన్‌: సాధారణ ఎన్నికల నేపథ్యంలో సర్వీసు ఓట్లకు సంబంధించి ఇప్పటి వరకు జిల్లాకు సర్వీసు ఓట్లు రిజిస్టర్‌ పోస్టు ద్వారా 1473 ఓట్లు చేరాయి. శనివారం 40 సర్వీసు ఓట్లు పోస్టు ద్వారా చేరాయి. వచ్చిన ఓట్లను ఎన్నికల విభాగం అధికారులు రాజకీయ పార్టీల ప్రతినిధులకు చూపి ఎన్ని ఓట్లు వచ్చాయో లెక్కించి పోస్టల్‌ బ్యాలెట్‌ బాక్స్‌ల్లో వేసి భద్రపరిచారు. మొత్తం 6693 సర్వీసు ఓట్లు ఉండగా ఇప్పటికి 1473 ఓట్లు జిల్లాకు చేరాయి. సర్వీసు ఓట్లను జూన్‌ 4వ తేదీ ఉదయం 8 గంటల వరకు భద్రపరుస్తారని అధికారులు తెలిపారు. దీనిలో వైఎస్‌ఆర్‌ సీపీ ప్రతినిధి దామరాజు క్రాంతికుమార్‌, ఇతర పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.

పొగాకు గరిష్ట ధర

రూ.322

కొండపి (సింగరాయకొండ): కొండపి పొగాకు వేలం కేంద్రంలో శనివారం ఈ సీజన్‌లోని అత్యధికంగా గరిష్ట ధర కేజీ రూ.322 పలికింది. కనిష్ట ధర రూ.205, సరాసరి రూ.258.84 వచ్చింది. వేలంలో కట్టవారిపాలెం, నర్సింగోలు గ్రామాలకు చెందిన రైతులు 902 బేళ్లను వేలానికి తీసుకురాగా 845 బేళ్లు కొనుగోలు చేశారు. వ్యాపారులు వివిధ కారణాలతో 57 బేళ్లను తిరస్కరించారు. గరిష్ట ధర వేలంలో 24 మంది వ్యాపారులు పాల్గొన్నారు. పొగాకు వేలానికి నాణ్యమైన బేళ్లను తీసుకురావాలని, అలాంటి బేళ్లకు వేలంలో అధిక ధరలు పొందవచ్చని వేలం నిర్వహణాధికారి జి.సునీల్‌ కుమార్‌ తెలిపారు. పొగాకు రైతులకు ఆయన సూచనలిచ్చారు.

Advertisement
 
Advertisement
 
Advertisement