108 ఉద్యోగుల సమ్మె బాట
టంగుటూరు: ఆపద సమయంలో ఫోన్ చేయగానే కుయ్..కుయ్‌మంటూ వచ్చి అత్యవసర వైద్య సహాయం అందించే 108 అంబులెన్స్ ఉద్యోగులు ఉద్యోగ భద్రత లేక సమస్యలతో సతమతమవుతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక 108 సిబ్బందిపై నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తోంది. దీంతో తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వారు పలు నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. ఈనెల 25వ తేదీలోగా ప్రభుత్వం స్పందించకపోతే సేవలు నిలిపేస్తామని స్పష్టం చేశారు. ఇప్పటికే ముందస్తు నోటీసులు ఉన్నతాధికారులకు అందజేశారు. అయినా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో నేటి నుంచి 108 అంబులెన్స్ సేవలు నిలిపేస్తూ సిబ్బంది సమ్మె చేయనున్నారు. జిల్లాలో 40 అంబులెన్స్ లు ఉండగా అందులో 5 మరమ్మతులకి గురి కాగా ఇప్పటి వరకు ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదు. మొత్తం 40 అంబులెన్స్ లకి 200 మంది సిబ్బంది ఉండాల్సి ఉండగా 183 మంది మాత్రమే ఉన్నారు. వారిలో పైలెట్ లు 91 మంది, ఈఏంటీలు 92 మంది పనిచేస్తున్నారు.
రోగులకు అవస్థలే...
24 గంటలు అత్యవసర సేవలు అందిస్తున్న 108 ఉద్యోగులు సమ్మె బాట పడితే రోగులకు పాట్లు తప్పవు. ఇప్పటికే పలు మండలాల్లో 108 వాహనాల మరమ్మతుల పేరుతో సేవలు నిలిచాయి. ఇప్పుడు సిబ్బంది సమ్మెబాట పట్టడంతో డయాలసిస్ రోగులు, రోడ్డు ప్రమాదాల బారిన పడిన వాళ్లు, గర్భిణులను తరలించేందుకు ఇబ్బందులు తప్పవు.
108 ఉద్యోగుల డిమాండ్లు ఇవీ..
è 108 సర్వీస్‌లోని ఉద్యోగులను వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగులుగా గుర్తించి నేరుగా ప్రభుత్వమే నిర్వహించాలి.
è జీవో నంబర్ 49ను పునరుద్ధరించాలి. ఫోలేట్ గ్రాట్యూటీ, ఆర్జిత సెలవు మొత్తం, వార్షిక ఇంక్రిమెంట్లు చెల్లించాలి.
è ప్రతి నెలా జీతాలు 5వ తేదీలోపు ఇవ్వాలి. 108 వాహనంలో షిఫ్ట్ లు పద్ధతి అమలు చేయాలి.
è వైద్య ఆరోగ్య శాఖలో చేపట్టే నియామకాల్లో సర్వీసుకనుగుణంగా వెయిటేజ్ మార్కులు అందించాలి.
è విధులు నిర్వహిస్తున్న ఉద్యోగి మరణించిన తర్వాత బాధిత కుటుంబానికి ఎక్స్‌గ్రేషియా రూ.20 లక్షలు ఇవ్వాలి.
è 108 సర్వీసులో ఈఏంటీలుగా పనిచేస్తున్న వారి సర్వీసును పరిగణలోకి తీసుకొని వైద్య ఆరోగ్య శాఖలో డీఏంఈ ద్వారా మెడికల్ కాలేజీలో చేపట్టనున్న ఈఏంటీ పోస్టులకు నియమించాలి.
è షిఫ్టుకు 12 గంటలు చొప్పున రెండు షిఫ్టుల్లో తీవ్ర ఒత్తిడితో పనిచేస్తున్న తమకు మూడు షిఫ్టుల్లో రోజుకి 8 గంటల పని దినాన్ని అమలు చేయాలి.
è వాహనాలను సరైన కండిషన్‌లో ఉంచాలి. వాహనం మరమ్మత్తుల బిల్లులు ఉద్యోగులకు వెంటనే చెల్లించాలి.
è 108 వాహనానికి, అందులో పని చేస్తున్న సిబ్బందికి కనీస అవసరాలతో భవనం నిర్మించాలి.
15 డిమాండ్లు నెరవేర్చాలని కోరుతున్న ఉద్యోగులు నేటి నుంచి సమ్మెలోకి నిలిచిపోనున్న 108 సేవలు
జిల్లాలో ఇలా ...
అంబులెన్స్‌లు 40
మరమ్మతులకు గురైనవి 5
మొత్తం ఉండాల్సిన సిబ్బంది 200
ప్రస్తుతం పనిచేస్తున్న సిబ్బంది 183
పైలెట్లు 91
ఈఏంటీలు 92
సమస్యలు పరిష్కరించాలి
108 అంబులెన్స్ లో పని చేస్తున్న సిబ్బంది సమస్యలను పరిష్కరించి న్యాయం చేయాలని కోరుతున్నాం. ఎన్నో ఏళ్ల నుంచి 108 వాహనంలో పనిచేస్తున్నాం. మా సమస్యల పరిష్కారం దిశగా ప్రభుత్వం అడుగులు వేసి న్యాయం చేయాలి.
– దర్గా మస్తాన్ వలి, జిల్లా 108 ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు
Comments
Please login to add a commentAdd a comment