సమస్యల పరిష్కారానికి అధిక ప్రాధాన్యం
● గ్రీవెన్స్ నిర్వహించిన కలెక్టర్
తమీమ్ అన్సారియా
ఒంగోలు అర్బన్: ప్రజా సమస్యలు పరిష్కరించేందుకు గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి అధికారులంతా అధిక ప్రాధాన్యం ఇచ్చి పనిచేయాలని కలెక్టర్ తమీమ్ అన్సారియా ఆదేశించారు. గ్రీవెన్స్ హాలులో మీకోసం గ్రీవెన్స్ కార్యక్రమం సోమవారం నిర్వహించి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రీవెన్స్‌లో అందిన అర్జీలను నిర్ణీత గడువులో నాణ్యమైన పరిష్కారం చేయాలన్నారు. ఏ సమస్యలు పునరావృతం కాకుండా క్షేత్రస్థాయిలో పరిష్కరించాలన్నారు. ఎంతో నమ్మకంతో అధికారుల వద్దకు వచ్చే ప్రజల సమస్యలను శాశ్వతమైన పరిష్కారం చూపి వారి సంతృప్తి స్థాయిని పెంచాలన్నారు. వచ్చిన అర్జీలను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని సూచించారు. గ్రీవెన్స్‌లో మొత్తం 266 అర్జీలు ప్రజలు అందజేశారు. గ్రీవెన్స్‌లో జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ, డీఆర్‌ఓ ఓబులేసు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్‌లు వరకుమార్, లోకేశ్వరరావు, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు.
● మదర్ థెరిస్సా దివ్యాంగుల సేవా సమితి సభ్యులు గ్రీవెన్స్‌లో కలెక్టర్‌ను కలిసి దివ్యాంగులు అర్జీలు ఇచ్చేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వారి కోసం ప్రతినెలా ఒక రోజు ప్రత్యేకంగా కేటాయించి గ్రీవెన్స్ నిర్వహించాలని కోరుతూ అర్జీ అందజేశారు.
● నగరానికి చెందిన కుంచాల రాంబాబు గ్రీవెన్స్‌లో అధికారులను కలిసి కలెక్టర్ క్యాంపు కార్యాలయం ముందు ఉన్న డివైడర్ పెయింటింగ్ పనులు చట్ట ప్రకారం తమకు వచ్చాయని, అయితే మున్సిపల్ కమిషనర్ ఇంజినీరింగ్ అధికారులు ఈ టెండర్ ద్వారా తమ పనులకు సంబంధించి విరుద్ధమైన నిర్ణయాలు తీసుకున్నారని, తమకు ఇచ్చిన అగ్రిమెంట్ మేరకు తనకు పనులు కేటాయించాలని దీనిపై విచారణ చేసి న్యాయం చేయాలని కోరుతూ అర్జీ అందజేశాడు.
● మర్రిపూడి మండలానికి చెందిన పులిచర్ల వెంకటేశ్వర్లు గ్రీవెన్స్‌లో అధికారులను కలిసి తనకు 75 శాతం కన్ను కనిపించక ఇబ్బంది పడుతున్నానని, ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారని కంటి సమస్యలతో ఏ పనిచేయలేక ఇబ్బంది పడుతున్న తనకు ఏదైనా ప్రభుత్వ కార్యాలయంలో చిన్న ఉద్యోగం ఇప్పించాలని కోరుతూ అర్జీ అందచేశాడు.
Comments
Please login to add a commentAdd a comment