కొండపిలో టీడీపీ అరాచకం..
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: వృద్ధుడైన వైఎస్సార్ సీపీ మద్దతు సర్పంచ్ పై ఇద్దరు టీడీపీకి చెందిన రౌడీషీటర్లు, ఒక యువకుడు దాడి చేసి సర్పంచే మాపై దాడి చేశాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేయడం సంచలనాన్ని రేకెత్తిస్తోంది. పోలీసులు జీహుజూర్ అంటూ సర్పంచ్‌ను అదుపులోనికి తీసుకుని పోలీస్‌స్టేషన్‌లో ఉంచారు. ఈ ఘటన సోమవారం కొండపి మండల కేంద్రంలో జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత పెద్దకళ్లగుంట వైఎస్సార్ సీపీ మద్దతు సర్పంచ్ భువనగిరి సత్యనారాయణపై దాడి చేయటంతో పాటు అతని స్థలంలో నిర్మించిన గోడను నామరూపాల్లేకుండా జేసీబీతో టీడీపీ సానుభూతిపరులు కూలగొట్టారు. ఆ స్థలాన్ని స్వాధీనం చేసుకోవాలని మంత్రి స్వామి రెవెన్యూ అధికారులను ఆదేశించారని అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. గొడవలకు దూరంగా ఉండాలన్న లక్ష్యంతో సత్యనారాయణ ఒంగోలులో నివాసం ఉంటున్నారు. కార్తీక సోమవారం సందర్భంగా గ్రామంలోని రామలింగేశ్వరస్వామి ఆలయంలో భారీ ఎత్తున స్పర్శ దర్శనం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆలయానికి వచ్చే వేలాది మందికి భక్తులకు అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేశారు. గ్రామానికి వచ్చే క్రమంలో సత్యనారాయణ కొండపి బ్యాంకులో పనిచూసుకుని తరువాత ఎంపీడీఓ కార్యాలయానికి వెళ్లి అక్కడి నుంచి పంచాయతీరాజ్ ఆఫీసుకు వెళ్లారు. పంచాయతీరాజ్ కార్యాలయం గేటు దగ్గర టీడీపీకి చెందిన ఇద్దరు రౌడీషీటర్లు బోయపాటి నరశింహ, కొల్లాప్రసాద్‌లతో పాటు తానికొండ శ్రీనివాసులు సర్పంచ్ ఎప్పుడు బయటకు వస్తారా అని ఎదురుచూస్తూ ఉన్నారు. సర్పంచ్ బయటకు రావడంతో ఈ ముగ్గురూ ముందస్తు పథకం ప్రకారం వాదులాటకు దిగారు. ముగ్గురు కలబడి సత్యనారాయణపై దాడిచేశారు. దీంతో అతను నన్ను కొట్టడం కాదు చంపండని అనడంతో వారు వెనక్కి తగ్గి చేతులతో కాకుండా నోటికి పనిచెప్పారు. అక్కడ నుంచి సత్యనారాయణ గ్రామంలోని రామలింగేశ్వరస్వామి ఆలయానికి వెళ్లాడు. ఈ సమయంలో ఎస్సై ప్రేమ్‌కుమార్ ఫోన్ చేసి మీపై ఫిర్యాదు వచ్చింది వెంటనే స్టేషన్‌కు రావాలని సర్పంచ్‌ను ఆదేశించారు. తాను ఉపవాసదీక్షలో ఉన్నానని, ప్రస్తుతం ఆలయంలో పూజలో ఉన్నానని భోజనం చేసిన తరువాత తానే స్వయంగా స్టేషన్‌కు వస్తానని సమాధానం ఇచ్చారు. దీంతో సంతృప్తి చెందని ఎస్సై ప్రేమ్ కుమార్ తన సిబ్బందిని పంపి సర్పంచ్‌ను పోలీస్‌స్టేషన్‌కు తరలించే ప్రయత్నం చేశారు. గ్రామస్తులు పోలీసుల అరాచకాన్ని అడ్డుకునే ప్రయత్నం చేయగా సర్పంచ్ వారిని వారించి పోలీస్ వాహనంలో స్టేషన్‌కు వెళ్లారు. పోలీసులు అతనిని స్టేషన్‌లో కూర్చోబెట్టారు. అసలు నాపై ఫిర్యాదు చేసింది ఎవరు? ఏమని ఫిర్యాదు చేశారు? అని అడిగితే వారి నుంచి సమాధానం లేదు. ఎస్సై వస్తారు సమాధానం చెప్తారు అన్న మాటలే పోలీసుల నోటి నుంచి వస్తున్నాయని సర్పంచ్ ఆరోపిస్తున్నారు. వృద్ధుడైన తనపై రౌడీషీటర్లు దాడి చేస్తే వారిని శిక్షించకుండా ఫిర్యాదు వచ్చిందని తనను స్టేషన్‌లో కూర్చోబెట్టడం ఏంటి? ఇదేనా రెడ్‌బుక్ రాజ్యాంగం అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా సర్పంచ్ సత్యనారాయణకు 70 సంవత్సరాలు ఉండగా, అతనిపై దాడిచేసిన వారు ముగ్గురు 45 సంవత్సరాల లోపు వారే. వారిపై ఈయన దాడిచేశాడంటే ఎవరైనా నమ్ముతారా అంటూ గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. ఈ విషయంపై సీఐ సోమశేఖర్‌ను వివరాలు అడగగా తాను అందుబాటులో లేనని, సర్పంచ్‌ను అదుపులోకి తీసుకున్న విషయం తనకు తెలియదని చెబుతున్నారు. ఎస్‌ఐ ప్రేమ్‌కుమార్ మాట్లాడుతూ తాను కోర్టు పనిమీద వెళ్లి వస్తున్నానని, ఏదైనా గొడవలు జరుగుతాయని సర్పంచ్‌ను అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. అర్ధరాత్రి పోలీసులు సర్పంచ్‌ను వదిలిపెట్టారు.
పెద్దకళ్లగుంట సర్పంచ్ సత్యనారాయణపై టీడీపీ సానుభూతిపరుల దాడి
దాడి చేసిన ముగ్గురిలో ఇద్దరు రౌడీషీటర్లు
మాపై దాడిచేశారంటూ ఆ ముగ్గురు సర్పంచ్ పైనే ఫిర్యాదు
ఆలయంలో ఉన్న సర్పంచ్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు
యువకులపై వృద్ధుడు ఎలా దాడి చేస్తాడు?
టీడీపీ తొత్తులుగా వ్యవహరిస్తున్న పోలీసులు
Comments
Please login to add a commentAdd a comment