ఐదు నెలలుగా వేతనాలివ్వకుంటే బతికేదెలా..
● నగరపాలక సంస్థ కార్మికుల ధర్నా
ఒంగోలు టౌన్: నగర పాలక సంస్థలోని వివిధ విభాగాల్లో పనిచేస్తున్న కార్మికులకు ఐదు నెలలుగా వేతనాలు ఇవ్వకపోతే ఎలా బతకాలని, కుటుంబాలను ఎలా పోషించాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు చీకటి శ్రీనివాసరావు ప్రశ్నించారు. పెండింగ్‌లో ఉన్న మున్సిపల్ కార్మికుల వేతనాలను చెల్లించాలని కోరుతూ సోమవారం మున్సిపల్ కార్యాలయం వద్ద మున్సిపల్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్పొరేషన్లో ఔట్‌సోర్సింగ్, ఆప్కాస్ పారిశుద్ధ్య, ఇంజినీరింగ్, క్లబ్, విద్యుత్ తదితర విభాగాల్లో పని చేస్తున్న కార్మికులకు 2 నెలల నుంచి 5 నెలల వరకు వేతనాలు బకాయి ఉన్నారని తెలిపారు. నెలల తరబడి వేతనాలు అందకపోవడంతో కుటుంబ పోషణ భారమై కార్మికులు అల్లాడిపోతున్నారని చెప్పారు. కోవిడ్ పారిశుధ్య కార్మికులకు 5 నెలలవుతున్నా వేతనాలు అందలేదన్నారు. 2024 ఏప్రిల్ నెల మెడికల్ అలవెన్సు కూడా ఇవ్వలేదన్నారు. కార్మికుల సమస్యలను పరిష్కరించకుండా ప్రజా ప్రతినిధులు, అధికారులు అలసత్వం ప్రదర్శిస్తున్నారని విమర్శించారు. కార్మికుల సమస్యలను పరిష్కరించకుంటే మెరుపు సమ్మెలోకి దిగాల్సి వస్తుందని హెచ్చరించారు. యూనియన్ నగర గౌరవాధ్యక్షుడు మహేష్ మాట్లాడుతూ పీఎఫ్ రికార్డులు, ఈఎస్‌ఐ గుర్తింపు కార్డుల గురించి పదే పదే ప్రస్తావిస్తున్నా అధికారులకు చీమకుట్టినట్టయినా లేదని మండిపడ్డారు. చనిపోయిన కార్మికుల కుటుంబ సభ్యులకు ఉపాధి కల్పించాలని, ప్రభుత్వం ప్రకటించిన నష్టపరిహారాన్ని చెల్లించాలని కోరుతున్నా అధికారులు లెక్కచేయడం లేదన్నారు. అనంతరం కార్మికులు కమిషనర్‌కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో యూనియన్ జిల్లా నాయకులు కే సామ్రాజ్యం, రత్న కుమారి, కే శ్రీనివాసరావు, యు.బాబు, దివ్య, రవి, వంశీ భారతి, జేమ్స్, మనోహర్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment