జెండర్ క్యాంపెయిన్ లాంచింగ్ పోస్టర్ ఆవిష్కరణ
ఒంగోలు అర్బన్: యూనిసెఫ్ భాగస్వామ్యంతో నాయి చేతన్ జండర్ క్యాంపెయిన్ లాంచింగ్ కార్యక్రమంలో భాగంగా జెండర్ పోస్టర్స్‌ను కలెక్టర్ తమీమ్ అన్సారియా సోమవారం గ్రీవెన్స్ హాలులో జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణతో కలిసి ఆవిష్కరించారు. సోమవారం నుంచి డిసెంబర్ 23వ తేదీ వరకు నాలుగు వారాల పాటు నాలుగు అంశాలపై వారానికి ఒక అంశం చొప్పున కార్యక్రమాలు నిర్వహిస్తారని తెలిపారు. జెండర్ ఆధారిత హింస, ఆడపిల్లలకు విద్య, బాల్య వివాహాలు, గృహ హింస తదితర అంశాలపై లైన్ డిపార్టుమెంట్ అనుసంధానంతో చేసుకుని విజయవంతంగా కార్యక్రమాలు నిర్వహించాలని కలెక్టర్ సూచించారు. దీనిలో జెడ్పీ సీఈఓ చిరంజీవి, డీఆర్‌డీఏ, డ్వామా, ఐసీడీఎస్, మెప్మా పీడీలు వసుంధర, జోసఫ్ కుమార్, మాధురి, రవికుమార్, డీపీఓ వెంకటనాయుడు, పశుసంవర్ధక శాఖ జేడీ బేబిరాణి, జిల్లా రిజిస్ట్రార్ బాలాంజనేయులు, మైన్స్ డీడీ రాజశేఖర్, సోషల్ వెల్ఫేర్ డీడీ లక్ష్మానాయక్ ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు.
పోలీసులు గిరిజనులను వేధించడం సరికాదు
ఒంగోలు టౌన్: చేయని తప్పును ఒప్పుకోమంటూ సీఎస్‌పురం పోలీసులు గరిసెకుంటకు చెందిన గిరిజనులను పోలీసు స్టేషన్‌కు పిలిపించి కొట్టడం, కేసులు పెట్టి వేధించడం మానుకోవాలని ఆంధ్రప్రదేశ్ గిరిజన సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీరాం శ్రీనివాసరావు చెప్పారు. సోమవారం కలెక్టర్ కార్యాలయం వద్ద ఆయన విలేకరులతో మాట్లాడుతూ సీఎస్‌పురం మండలంలోని డీజీపేట సమీపంలోని పొలాల్లో ఒక యాదవ మహిళ మరణించిందని, అందుకు గరిసెకుంట్లకు చెందిన గిరిజనులైన ఇండ్ల సాలమ్మ, నరేష్, మలి దేవయ్యలే కారణమంటూ ప్రతి రోజూ పోలీసు స్టేషన్‌కు పిలిపించి కానిస్టేబుల్ శ్రీనివాస్ కొట్టి వేధిస్తున్నాడని తెలిపారు. నేరం చేసినట్లు అంగీకరించాలంటూ చిత్ర హింసలకు గురి చేస్తున్నాడని, ఇది ఎంతమాత్రం సరికాదని చెప్పారు. కేసును తప్పుదారి పట్టించేందుకు గిరిజనులపై తప్పుడు కేసులు పెడుతున్న కానిస్టేబుల్ మీద చర్యలు తీసుకోవాలంటూ కలెక్టర్ తమీమ్ అన్సారియా, ఎస్పీ ఏఆర్ దామోదర్‌కు విజ్ఞప్తి చేశారు.
జియోట్యాగ్ లక్ష్యాన్ని పూర్తి చేయాలి
● సచివాలయ సిబ్బందికి బయోమెట్రిక్ హాజరు తప్పనిసరి
ఒంగోలు అర్బన్: ప్రభుత్వ నిర్దేశాల మేరకు ప్రతి ఇంటినీ ఫొటో తీసి జియోట్యాగ్ చేసే లక్ష్యాన్ని, నిర్దేశించిన మ్యాపింగ్‌ను ఈ నెలాఖరు లోపు నూరుశాతం పూర్తి చేయాలని కలెక్టర్ తమీమ్ అన్సారియా స్పష్టం చేశారు. సోమవారం ప్రకాశం భవనం నుంచి జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణతో కలిసి మండల స్థాయి అధికారులతో వీడియో సమావేశం నిర్వహించారు. దీనిలో కలెక్టర్ మాట్లాడుతూ ఈ విధులకే పరిమితం చేస్తూ సచివాలయ సిబ్బందిని వినియోగించి పూర్తి చేయాలని మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలను ఆదేశించారు. అందరి బ్యాంకు ఖాతాలను ఎన్‌పీసీఐతో మ్యాపింగ్ చేయాలన్నారు. హౌస్‌హోల్డ్ క్లస్టర్లను ఆయా హాబిటేషన్లు, గ్రామ పంచాయతీలు, రెవెన్యూ గ్రామాలతో మ్యాపింగ్ చేయాలని, హౌస్‌హోల్డ్ డేటాబేస్‌లో లేని వారి వివరాలను పొందుపరచాలని సూచించారు. దీనికి సంబంధించి జిల్లా వెనుకబడితే సహించేది లేదని హెచ్చరించారు. సచివాలయ సిబ్బందికి నూరుశాతం బయోమెట్రిక్ హాజరు తప్పనిసరిగా ఉండేలా చూడాలన్నారు. బ్యాంకు ఖాతాల ఎన్‌పీసీఐ అనుసంధానం గ్రామాల్లోని పోస్టాఫీసుల్లో కూడా చేసుకోవచ్చనే విషయంపై అవగాహన కల్పించాలన్నారు. గ్రీవెన్స్ అర్జీలను నిర్ణీత గడువులో పరిష్కరించాలని ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించద్దని హెచ్చరించారు. అంగన్‌వాడీల్లో మరుగుదొడ్లు, తాగునీరు, విద్యుత్ సౌకర్యాలను డిసెంబర్ 10వ తేదీ నాటికి పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండాలన్నారు. సమావేశంలో డీఆర్‌ఓ ఓబులేసు, సీపీవో వెంకటేశ్వర్లు, జెడ్పీ సీఈఓ చిరంజీవి, డీపీఓ వెంకటనాయుడు, హౌసింగ్ పీడీ శ్రీనివాసప్రసాద్, ఐసీడీఎస్ పీడీ మాధురి, గిరిజన సంక్షేమ అధికారి జగన్నాథరావు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment