ఆర్‌ఎంపీలపై కొరడా
సిరిసిల్ల: జిల్లాలో ఆర్‌ఎంపీ డాక్టర్లపై రాష్ట్ర వైద్య మండలి కొరడా ఝులిపించింది. డాక్టర్లుగా ఎలాంటి అర్హతలు లేకుండా నిర్వహిస్తున్న ప్రైవేటు ఆస్పత్రుల్లో సోమవారం తనిఖీలు నిర్వహించారు. సిరిసిల్ల, వేములవాడ, ముస్తాబాద్‌లో ఆర్‌ఎంపీలు నిర్వహించే ప్రైవేటు ఆస్పత్రులపై యాంటీ క్వేకరీ బృందం డాక్టర్ బండారి రాజ్‌కుమార్ ఆధ్వర్యంలో దాడులు చేశారు. సిరిసిల్లలోని గోపాల్‌నగర్‌కు చెందిన బాబా క్లినిక్ నిర్వాహకుడు మాదాసు లక్ష్మణ్, ముస్తాబాద్‌లో ముక్తార్, వేములవాడ గాంధీనగర్‌లో అశ్విని క్లినిక్ నిర్వహించే బెజ్జంకి రవీందర్ ప్రాక్టీస్ నిర్వహించే సెంటర్లలో తనిఖీలు చేశారు. ఈ అనుమతి లేని ఆస్పత్రుల్లో విచ్చలవిడిగా యాంటీబయోటిక్ ఇంజక్షన్లు ఇస్తున్నట్లు గుర్తించారు. కొంతమంది కనీస విద్యార్హత లేకుండా ఐదు నుంచి పది బెడ్స్ వేసి ఇన్‌పేషెంట్లకు వైద్యం చేస్తున్నట్లు గుర్తించామని డాక్టర్ రాజ్‌కుమార్ వెల్లడించారు. పలువురు అల్లోపతి వైద్యం చేస్తూ పట్టుబడ్డారని వివరించారు. నేషనల్ మెడికల్ కౌన్సిల్(ఎన్‌ఎంసీ) చట్టం ప్రకారం ఆర్‌ఎంపీలపై కేసులు నమోదు చేస్తామని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి నకిలీ వైద్యులపై 300 కేసులు నమోదు చేశామని వెల్లడించారు. ఈ తనిఖీల్లో టీజీఎంసీ సభ్యులు భరత్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment