బాగా చదివితే ఉజ్వల భవిష్యత్
ఇబ్రహీంపట్నం రూరల్: బతుకులు మారాలంటే చదువే ఆయుధమని, ప్రతి ఒక్కరూ బాగా చదువుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి ఆకాంక్షించారు. ఆదిబట్ల మున్సిపల్ పరిధి బొంగ్లూర్‌లోని ఆదర్శ పాఠశాల హాస్టల్‌ను శనివారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. వంటగదిలోకి వెళ్లి పరిసరాలను పరిశీలించారు. వంట గదిని పరిశుభ్రంగా ఉంచాలని, నాసిరకమైన భోజనం వడ్డిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. హాస్టల్ గదిలోకి వెళ్లి విద్యార్థులతో మాట్లాడి సమస్యలు ఏమైనా ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. మరుగుదొడ్లు, మూత్రశాలలను పరిశీలించారు. మూత్రశాలలు పరిశుభ్రంగా లేవని వార్డెన్‌ను ప్రశ్నించారు. నీటి కొరతతో ఇబ్బందులు ఉన్నాయని వార్డెన్ సమాధానం ఇవ్వగా సోమవారంలోపు బోరు వేయించేలా చూడాలని తహసీల్దార్‌ను ఆదేశించారు. సొంత నిధులతో బోరు, దోమ తెరలు ఇప్పిస్తానని కలెక్టర్ హామీ ఇచ్చారు. విద్యార్థులకు ఇంటర్ దశ ఎంతో కీలకమన్నారు. ఈ దశలో చెడు దారుల్లోకి వెళ్లి జీవితాలను నాశనం చేసుకోవద్దని, బాగా చదువుకుంటే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందన్నారు. ఎలాంటి సమస్యలున్నా తన దృష్టికి తసుకువస్తే పరిష్కరిస్తానని తెలిపారు. అనంతరం విద్యార్థులతో కలిసి రాత్రి భోజనం చేశారు. కలెక్టర్ వెంట ఆర్డీఓ అమరేందర్‌రెడ్డి, తహసీల్దార్ సునీత, ఆర్‌ఐ కృష్ణ, వార్డెన్ రజిత తదితరులు ఉన్నారు.
కలెక్టర్ నారాయణరెడ్డి
బొంగ్లూర్ ఆదర్శ పాఠశాల హాస్టల్‌లో తనిఖీ
Comments
Please login to add a commentAdd a comment