ఇక ఫుడ్‌ సేఫ్టీ కమిటీలు! | - | Sakshi
Sakshi News home page

ఇక ఫుడ్‌ సేఫ్టీ కమిటీలు!

Published Tue, Nov 26 2024 7:42 AM | Last Updated on Tue, Nov 26 2024 7:42 AM

ఇక ఫు

ఇక ఫుడ్‌ సేఫ్టీ కమిటీలు!

● జిల్లా, మండల స్థాయిల్లోప్రత్యేక కమిటీలు ఏర్పాటు ● ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనార్టీ సహా కేజీబీవీ వసతి గృహాల్లో అమలు ● కమిటీల్లో జిల్లాస్థాయి, మండలస్థాయి అధికారులు సహా విద్యార్థులకు స్థానం ● మధ్యాహ్న భోజనంపై మరింత నిఘా ● నిర్లక్ష్యంగా వ్యవహరించే వార్డెన్లపై చర్యలు

సాక్షి, రంగారెడ్డిజిల్లా: ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లు, కేజీబీవీ స్కూళ్లపై జిల్లా యంత్రాంగం దృష్టి సారించింది. ఆయా వసతి గృహాల్లో ఉంటూ చదువుకుంటున్న నిరుపేద విద్యార్థులకు మూడు పూటలా నాణ్యమైన ఆహారం అందేలా చూడాలని నిర్ణయించింది. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం.. వార్డెన్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. విద్యార్థులకు నాసిరకం భోజనం అందజేస్తున్న విషయం తెలిసిందే. రుచి పచిలేని ఈ ఆహారాన్ని తినలేక విద్యార్థులు ఖాళీకడుపుతో పస్తులుంటున్న విషయం తెలిసిందే. ఇకపై ఏ ఒక్క విద్యార్థి కూడా ఆకలితో అలమటించొద్దని కలెక్టర్‌ నారాయణరెడ్డి భావించారు. ఈ మేరకు వసతి గృహాల్లో విద్యార్థులకు అందిస్తున్న ఆహారాన్ని పరిశీలించేందుకు జిల్లా, మండల, మున్సిపల్‌ స్థాయిల్లో ప్రత్యేక డైట్‌ కమిటీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ప్రభుత్వ పాఠశాలలకు సరఫరా చేస్తున్న మధ్యాహ్న భోజనం సహా వసతి గృహాల్లో కాంట్రాక్ట్రర్లు సరఫరా చేస్తున్న కాయగూరలు, పండ్లు, పాలు, కోడిగుడ్లు ఇతర ఆహార పదార్థాల నాణ్యతను పరిశీలించనున్నారు. జిల్లాస్థాయి కమిటీలో డీఈఓ, జిల్లా పౌరసరఫరాల అధికారి, డీఎంసీఎస్‌లు సభ్యు లుగా కొనసాగుతారు. మండల స్థాయి కమిటీలో ఎంపీడీఓ చైర్మన్‌గా, ఇద్దరు సభ్యులు ఉంటారు. మున్సిపాలిటీ స్థాయిల్లోనూ ఈ కమిటీలు ఏర్పాటు చేయనున్నారు. ఆయా కమిటీల్లో అధికారులతో పాటు విద్యార్థులను కూడా భాగస్వాములను చేయనున్నారు. తద్వారా విద్యార్థులకు నాణ్యమైన, రుచికరమైన పౌష్టికాహారం అందజేసి, ఉత్తీర్ణత శాతాన్ని పెంచవచ్చని ప్రభుత్వం యోచిస్తోంది.

హాస్టళ్లపై నిరంతర నిఘా

జిల్లాలో 1309 ప్రభుత్వ పాఠశాలలు, 20 కేజీబీవీలు, 9 ఆదర్శ పాఠశాలలు ఉన్నాయి. కేజీబీవీల్లో ఆరు నుంచి 12వ తరగతి వరకు 6,027 మంది విద్యార్థులు ఉన్నారు. మరో 11 ఇంటర్మీడియట్‌ కేజీబీవీల్లో 1,176 మంది చదువుతున్నారు. గిరిజన సంక్షేమశాఖ ఆధ్వర్యంలోని 14 వసతి గృహాల్లో 2,212 మంది, ఎస్సీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో 34 ప్రీమెట్రిక్‌ వసతి గృహాల్లో 3000 మంది వసతి పొందుతున్నారు. మరో 16 కళాశాల వసతి గృహాల్లో 1,805 మంది వసతి పొందుతు న్నారు. ఇక మైనార్టీ సంక్షేమశాఖ అధ్వర్యంలో తొమ్మిది గురుకులాలు, తొమ్మిది జూనియర్‌ కాలేజీలు కొనసాగుతుండగా వాటిలో 8,900 మంది చదువుతున్నారు. వీరికి మూడు పూటలా ఉదయం టిఫిన్‌ (రోజుకో వైరెటీ), మధ్యాహ్నం భోజనం, సాయంత్రం స్నాక్స్‌, రాత్రి భోజనం వడ్డించాలి. సరుకులు సరఫరా చేసే కాంట్రాక్ట ర్లతో వార్డెన్లు కుమ్మకై ్క..నాసిరకం ఆహారాన్ని వడ్డిస్తున్నారు. సన్న బియ్యానికి బదులు దొడ్డు బియాన్ని వాడుతున్నారు. అది కూడా ముద్దకట్టి, ముక్క వాసన వస్తుండంతో విద్యార్థులు తినలేక పోతున్నారు. పప్పు నీళ్లను తలపిస్తుంది. చీడపీడలు పట్టి పుచ్చిపోయి, వాడిపోయిన కాయగూరలను వడ్డిస్తున్నారు. రోజుకో గుడ్డు చొప్పున వారానికి ఏడు గుడ్లు ఇవ్వాల్సి ఉండగా, మెజార్టీ హాస్టళ్లలో మూడే ఇస్తున్నారు. ప్రతి ఆదివారం చికెన్‌/మటన్‌ వడ్డించాల్సి ఉన్నా..చేయడం లేదు. ప్రతి రోజు ఒక్కో విద్యార్థికి గ్లాసు పాలు ఇవ్వాల్సి ఉండగా, వాటిని వార్డెన్లు, వంట సిబ్బందే కాజేస్తున్నారు. డైట్‌ కమిటీల నిరంతర తనిఖీల ద్వారా పరిస్థితి మెరుగుపరచవచ్చునని భావిస్తుంది. అంతేకాదు కాయగూరలు, ఇతర ఆహార పదార్థాల నిల్వ కోసం దాతల సహకారం తీసుకోవాలని నిర్ణయించింది. ప్లాస్టిక్‌ డబ్బాలు, టేబుళ్లు కొనుగోలు చేయించడం ద్వారా సమస్యను పరిష్కరించవచ్చునని యోచిస్తోంది.

సీరియస్‌గా తీసుకున్న కలెక్టర్‌

మూడు నుంచి ఏడో తరగతి విద్యార్థులకు ప్రభుత్వం మెస్‌ చార్జీలను రూ.950 నుంచి రూ. 1,350కి పెంచింది. అదే విధంగా ఎనిమిది నుంచి పది వరకు రూ.1,100 నుంచి రూ.1,540కి పెంచింది. కాస్మొటిక్‌ ఛార్జీల్లో భాగంగా సబ్బులు, నూనెలకు (బాలుర)కు రూ.150 చెల్లిస్తుంది. బాలికలకు 3 నుంచి 7 తరగతి వరకు రూ.150, ఎనిమిది నుంచి పది వరకు రూ.200 వరకు చెల్లిస్తుంది. వీటితో పాటు ఒక్కో విద్యార్థికి నాలుగు జతల యూనిఫాం, నోట్‌ పుస్తకాలు, బెడ్డింగ్‌ మెటీరియల్‌, బెడ్‌షీట్‌, కా ర్పెట్‌, ఉలన్‌ రగ్గులు, ప్లేట్లు అందజేస్తుంది. మంచాలు, డైనింగ్‌ టేబుల్‌, లైబ్రరీ వంటి మౌ లిక సదుపాయాలు కల్పిస్తుంది. అయితే ఆయా వసతి గృహాలపై ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. 24 గంటలు విద్యార్థులకు అందుబాటులో ఉండాల్సిన వార్డెన్లు..వంట సిబ్బంది, అటెండర్‌కు ఆ బాధ్యతలను అప్పగించి వెళ్తున్నట్లు ఆరోపణలు లేకపోలేదు. డైట్‌ ఛార్జీ లు పెంచినా.. విద్యార్థుల మెనూలో మార్పు రాకపోవడం ఇటీవల హాస్టళ్ల తనిఖీలకు వెళ్లిన కలెక్టర్‌ నారాయణరెడ్డి దృష్టికి వచ్చింది. ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకున్న కలెక్టర్‌ డైట్‌ కమిటీల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. నిరంతర నిఘాతో మెనూలో మార్పులు తీసుకురావొచ్చు నని ఆయన భావిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
ఇక ఫుడ్‌ సేఫ్టీ కమిటీలు! 1
1/1

ఇక ఫుడ్‌ సేఫ్టీ కమిటీలు!

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement