ఫార్మాసిటీనా.. ఫోర్త్ సిటీనా..
● కాంగ్రెస్ ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి ● ఎమ్మెల్యే సబితారెడ్డి డిమాండ్
కందుకూరు: గత ప్రభుత్వం ఫార్మాసిటీ కోసం సేకరించిన భూముల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఫార్మాసిటీ కొనసాగిస్తుందా లేక ఫోర్త్ సిటీ ఏర్పాటు చేయనుందా ప్రజలకు స్పష్టత ఇవ్వాలని స్థానిక ఎమ్మెల్యే సబితారెడ్డి డిమాండ్ చేశారు. కోర్టుకు మాత్రం ఫార్మాసిటీ ఏర్పాటు చేస్తున్నామని చెబుతున్నారని, బయట మాత్రం ఫోర్త్ సిటీ అంటున్నారని.. ఏదో ఒకటి తేల్చాలన్నారు. మండల కేంద్రంలో సోమవారం ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పోలీస్ బందోబస్తు మధ్య రైతులను భయభ్రాంతులకు గురి చేస్తూ రహదారికి భూసేకరణ చేయడం ఏమిటని ప్రశ్నించారు. కేసీఆర్ హయాంలోనే ఫార్మాసిటీలోకి చేరుకునేలా నేరుగా రోడ్డు నిర్మించామని, చుట్టూ అన్ని వైపుల నుంచి అక్కడికి చేరుకునేలా కనెక్టివిటీ ఉందన్నారు. మళ్లీ 330 అడుగుల రహదారితో అవసరమేమిటని నిలదీశారు. రియల్ వ్యాపారం కోసం తప్ప మరొకటి కాదన్నారు. కేసీఆర్ పాలనలో గ్రామాలు ఎంతో అభివృద్ధి చెందాయని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేవెళ్ల, మహేశ్వరం, కందుకూరును కొత్తగా మున్సిపాలిటీలు చేయాలనుకుంటోందని, దీంతో ప్రజలకు నష్టం ఏర్పడుతుందన్నారు. ఇంటి పన్ను, నల్లా పన్నులు పెరుగుతాయని, ఉపాధి పనులు నిలిచిపోతాయన్నారు. భూముల విలువలు పెంచుకోవడానికే మున్సిపాలిటీలను తెరపైకి తెస్తున్నారని విమర్శించారు. 11 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయలేకపోయిందని. మళ్లీ ప్రజా పాలన విజయోత్సవాలు ఎందుకన్నారు. జీపీలకు నిధులు కేటాయించలేదని, సిబ్బందికి వేతనాలు ఇవ్వలేని దుస్థితిలో పంచాయతీలు ఉన్నాయన్నారు. చెత్త సేకరించే ట్రాక్టర్లకు డీజిల్ పోయించలేని పరిస్థితి ఉందన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఎస్.సురేందర్‌రెడ్డి, బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు మన్నే జయేందర్, మహిళా అధ్యక్షురాలు టి.ఇందిరదేవేందర్, వర్కింగ్ ప్రెసిడెంట్ ఎ.మేఘనాథ్‌రెడ్డి, సీనియర్ నాయకులు కాకి దశరథ, రామకృష్ణారెడ్డి, పి.ఆనంద్, సామ ప్రకాష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment