బీసీలు ఐకమత్యంగా ముందుకు సాగాలి
నందిగామ: బీసీలు ఇప్పటి నుంచి మౌనం వీడాలని, ఐకమత్యంతో సత్తా చాటాలని బీసీ సేన జాతీయ అధ్యక్షుడు బర్క కృష్ణ పిలుపునిచ్చారు. మండల కేంద్రంలో సోమవారం బీసీ సేన అసెంబ్లీ అధ్యక్షుడు మెక్కొండ నరేష్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశానికి బర్క కృష్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. బీసీలు రోజురోజుకూ వెనకబడిపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికై నా మేల్కొనాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. బీసీలకు అన్ని రంగాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 50 శాతం రిజర్వేషన్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఐకమత్యంతో ఉంటే ఏ శక్తీ ఏమీ చేయలేదని, అన్ని రాజకీయ పార్టీలు బీసీ జపం చేయాల్సిన అనివార్య పరిస్థితులు వస్తాయని పేర్కొన్నారు. అనంతరం బీసీ సేన మండల నూతన కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా ఆంజనేయులు, ఉపాధ్యక్షుడిగా రాఘవేందర్ చారి ఎన్నికయ్యారు. కార్యక్రమంలో బీసీ సేన జిల్లా ఉపాధ్యక్షుడు పసుపుల ప్రశాంత్, నాయకులు సతీష్, గిరిరామ్, చందర్, శివ కుమార్ చారి, మల్లేష్ యాదవ్, బాలకృష్ణ పాల్గొన్నారు.
లోక్‌మంథన్‌లో షాద్‌నగర్ విద్యార్థుల నాటక ప్రదర్శన
షాద్‌నగర్‌రూరల్: హైదరాబాద్‌లోని శిల్పారామంలో సాంప్రదాయ కళావేదికపై లోక్‌మంథన్ విశ్వ కళా ప్రదర్శనను నాలుగు రోజులుగా నిర్వహిస్తున్నారు. ఈ కళా ప్రదర్శనకు వివిధ దేశాల నుంచి కళాకారులు హాజరయ్యారు. సోమవారం ముగింపు సందర్భంగా జాతీయ సాంస్కృతిక సంస్థ విభాగ్ తరపున షాద్‌నగర్‌కు చెందిన విద్యార్థులు మాకూ స్వాతంత్య్రం కావాలి నాటకాన్ని ప్రదర్శించారు. ఇందులో వర్షిణి, వైష్ణవి, యోగిత, వేదశ్రీ, స్వచిత్ర, యస్విత, జ్యోషిత అత్యుత్తమ ప్రతిభ కనబర్చారు. చిన్నారుల హావభావాలు, అభినయం, కళా ప్రదర్శనకు ప్రేక్షకులు మంత్రముగ్ధుల య్యారు. కుటుంబ విలువల నేపథ్యంలో సాగిన ప్రదర్శన కట్టిపడేసింది. ప్రతి చిన్నారి తమ పాత్రను చక్కగా పోషించి పలువురి మన్ననలు అందుకున్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు నాటక రచయిత, దర్శకుడు టీవీ రంగయ్య, సంస్కారభారతి జాతీయ సాంస్కృతిక సంస్థ ముఖ్య సలహాదారు బెజుగం రమేష్, గౌరవ అధ్యక్షుడు రంగనాథ్, ప్రధాన కార్యదర్శి శివ, సింగారం శ్రీనివాస్‌ను ఘనంగా సత్కరించారు.
క్రిస్మస్ సత్కారాలకు నామినేషన్ల ఆహ్వానం
ఇబ్రహీంపట్నం రూరల్: క్రిస్మస్‌ను పురస్కరించుకొని వివిధ రంగాల్లో ప్రతిభావంతులైన క్రైస్తవులను సత్కరించడం జరుగుతుందని మైనార్టీ సంక్షేమ శాఖ జిల్లా అధికారి నవీన్‌కు మార్‌రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సామాజికరంగం, విద్య, వైద్యం, సాహిత్యం, క్రీడా రంగాల్లో ఉత్తమ సేవలందించిన వారిని ప్రభుత్వం సత్కరిస్తుందన్నారు. ఆయా రంగాల్లో కనీసం ఐదేళ్లు, అంతకంటే ఎక్కువ కాలం ఆదర్శప్రాయమైన సేవలందించిన సంస్థలు, వ్యక్తుల నుంచి నామినేషన్లు ఆహ్వానిస్తున్నట్టు తెలిపారు. డిసెంబర్ 5వ తేదీ సాయంత్రం లోపు కలెక్టర్ కాంపెక్లక్స్‌లో దరఖాస్తులు సమర్పించాలన్నారు. వివరాలకు 040–23391067 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.
ఆర్‌జీవీ షాద్‌నగర్‌లో ఉన్నట్టు పుకార్లు
షాద్‌నగర్‌రూరల్: సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మ షాద్‌నగర్‌లో ఉన్నట్టు సోమవారం పుకార్లు షికార్లు చేశాయి. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల సమయంలో సామాజిక మాధ్యమాల్లో అనుచిత పోస్టులు పెట్టారనే ఆరోపణల నేపథ్యంలో ఏపీ పోలీసులు వర్మపై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయనను అరెస్టు చేసేందుకు ఏపీ పోలీసులు హైదరాబాద్‌లోని ఆర్‌జీవీ ఇంటికి వెళ్లారు. అక్కడ ఆయన లేకపోవడంతో ఆచూకీ కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలో షాద్‌నగర్ ప్రాంతంలోని కమ్మదనంలో సినీనటుడు ప్రకాష్‌రాజ్ ఫాంహౌస్‌లో తలదాచుకున్నారనే వదంతులు వ్యాపించాయి. దీనిపై స్థానిక పోలీసులను సంప్రదించగా అలాంటిదేమీ లేదని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment