జలుబు దగ్గుకూ | - | Sakshi
Sakshi News home page

జలుబు దగ్గుకూ

Published Tue, Nov 26 2024 7:42 AM | Last Updated on Tue, Nov 26 2024 7:42 AM

-

ఆరోగ్య కేంద్రాల్లో తీవ్ర కొరత
● నొప్పి నివారణ, కడుపు ఉబ్బరం మందులు సైతం ● ఇండెంట్‌ పంపినా..సరఫరా కాని వైనం ● సగంతో సరిపెడుతున్న వైద్య సిబ్బంది

సాక్షి, రంగారెడ్డి జిల్లా : ప్రభుత్వ వైద్య కేంద్రాల్లో మందుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. ఖరీదైన మందులే కాదు..దగ్గు, జలుబు, నొప్పి నివారణ, కడుపు ఉబ్బరం నుంచి ఉపశమనం పొందే సాధారణ మందులు సైతం వీటిల్లో దొరకడం లేదు. వనస్థలిపురం, కొండాపూర్‌ ఏరియా ఆస్పత్రులు మొదలు కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్లు, పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, బస్తీ, పల్లె దవాఖానాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. క్షేత్రస్థాయి అధికారులు మందుల కోసం ఇండెంట్‌ పంపినా..సరఫరా కాకపోవడంతో అత్యవసర పరిస్థితుల్లో ఫార్మసిస్టులు చేతులెత్తేస్తున్నారు. ఎప్పటికప్పుడు ఆయా ఆరోగ్య కేంద్రాల్లో తనిఖీలు నిర్వహించి, మందుల సరఫరాపై ఆరా తీయాల్సిన అధికారులు.. పట్టించుకోక పోవడం, వైద్యులు కూడా ఈ అంశాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లకపోవడం కొరతకు ప్రధాన కారణం.

రాంటాక్‌, పాంటాక్‌ టాబ్లెట్లు కరువే..

ప్రస్తుతం వాతావరణంలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. చలిగాలులు వీస్తుండటంతో అనేక మంది వివిధ రకాల ఫ్లూ బారినపడుతున్నారు. దగ్గు, జలుబుతో పాటు జ్వరం, తలనొప్పి, కడుపు ఉబ్బరం, వాంతులు, విరేచనాల బారిన పడుతున్నారు. పైసా ఖర్చు లేకుండా మెరుగైన వైద్యసేవలు పొందొచ్చనే భావనతో మెజార్టీ పేదలు సమీపంలోని ఆరోగ్య కేంద్రాలకు చేరుకుంటారు. జిల్లాలో 39 ఆరోగ్య కేంద్రాలు ఉండగా, ఒక్కో ఆస్పత్రి అవుట్‌ పేషంట్‌ విభాగానికి రోజుకు సగటున 20 నుంచి 30 మంది వస్తుంటారు. వీరిలో సాధారణ జ్వరాలు, ఫ్లూతో బాధపడే చిన్నారులతో పాటు మధుమేహం, రక్తపోటు, థైరాయిడ్‌ వంటి బాధితులు ఉంటారు. వైద్యులు రోగులను పరీక్షించి, మందులు రాస్తున్నారు. డాక్టర్‌ రాసిన మందుల చీటీ తీసుకుని ఫార్మసిస్ట్‌ వద్దకు చేరుకుంటే తీరా అక్కడ వారికి చేదు అనుభవమే ఎదురవుతోంది. ఖరీదైన మందులే కాదు సాధారణ జలుబు నివారణకు వాడే సీసీఎం, నొప్పుల నివారణకు వాడే రాంటాక్‌, పాంటాక్‌ వంటి మందులు దొరకడం లేదు. విధిలేని పరిస్థితుల్లో రోగులే వీటిని ప్రైవేటుగా కొనుగోలు చేయాల్సి వస్తోంది.

అనవసర మందులే అధికం

ప్రభుత్వం తెలంగాణ వైద్య మౌలిక సదుపాయాల సంస్థ ద్వారా జిల్లాకు 432 రకాల మందులను సరఫరా చేస్తుంది. అయితే మందుల కొనుగోలు, సరఫరాపై సరైనా నిఘా లేకపోవడంతో అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. రోగుల అవసరాలకు భిన్నంగా అనవసర మందులు కొనుగోలు చేస్తూ.. గిడ్డంగుల్లో నిల్వ చేస్తున్నారు. ఇందుకు ఏటా రూ.కోట్లు ఖర్చు చేస్తున్నారు. తీరా గడువు ముగిసిన తర్వాత వాటిని గుట్టుగా బయటికి తరలిస్తున్నారు. కొన్ని ఆస్పత్రుల్లో పారిశుద్ధ్య వ్యర్థాల్లో ఈ మందులను కలిపి పారబోస్తుండగా, మరికొన్ని చోట్ల గుట్టుగా నిర్మానుష్య ప్రాంతాలకు తరలించి, దగ్ధం చేస్తున్నట్లు ఆరోపణలు లేకపోలేదు. డిసెంబర్‌ 2023 నుంచి ఇప్పటి వరకు సుమారు రూ.కోటి విలువ చేసే 170 రకాల మందులు కాలం చెల్లినవిగా గుర్తించినట్లు తెలిసింది. ఆయా సరఫరా కంపెనీలకు తిప్పి పంపినట్లు స్టోర్స్‌ అధికారులు చెప్పుతున్నా.. క్షేత్రస్థాయిలో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement