‘జనరల్’కు ప్రాధాన్యం!
● రైల్వే ప్రయాణికులకు భారీ ఊరట ● అన్ని ప్రధాన రైళ్లలో నాలుగు జనరల్ బోగీలు ● గోదావరి, గౌతమి, దానాపూర్, దక్షిణ్, నిజాముద్దీన్ తదితర రైళ్లలో పెంపు ● తీరనున్న ప్రయాణికుల కష్టాలు
సాక్షి, సిటీబ్యూరో: సాధారణ బోగీల పెంపుతో ప్రయాణికుల కష్టాలు తీరనున్నాయి. హైదరాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగించే అన్ని ప్రధాన రైళ్లలో ఇప్పుడు ఉన్న రెండు సాధారణ(జనరల్) బోగీలకు అదనంగా మరో రెండింటిని ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు రైల్వేబోర్డు తాజాగా నిర్ణయించింది. డిసెంబర్‌లోనే దశలవారీగా బోగీల విస్తరణ కొనసాగనుందని దక్షిణమధ్య రైల్వే అధికారి ఒకరు తెలిపారు. దీంతో ప్రయాణికులకు పెద్ద ఎత్తున ఊరట లభించనుంది. సికింద్రాబాద్ నుంచి ప్రతి రోజు దానాపూర్‌కు రాకపోకలు సాగించే దానాపూర్ ఎక్స్‌ప్రెస్‌కు రద్దీ ఎక్కువగా ఉంటుంది. మరోవైపు వారణాసి తదితర ప్రాంతాలకు వెళ్లే భక్తులు, పర్యాటకులు కూడా ఈ ట్రైన్‌పైనే ఆధారపడి బయలుదేరుతారు. రిజర్వేషన్ బోగీల్లో బెర్తులు లభించని ప్రయాణికుల నుంచి కూడా సాధారణ బోగీలకు డిమాండ్ ఉంటుంది. 75 మంది కూర్చొని ప్రయాణం చేసేందుకు అవకాశం ఉన్న ఒక సాధారణ బోగీలో కనీసం 150 మంది వరకు కిక్కిరిసి ప్రయాణం చేయాల్సి వస్తోంది. ప్రస్తుతం మరో 2 బోగీలు అదనంగా ఏర్పాటు చేయడం వల్ల దానాపూర్ ఎక్స్‌ప్రెస్ ప్రయాణికులకు ఊరట లభించనుంది. త్వరలోనే అదనపు బోగీలు అందుబాటులోకి రానున్నట్లు అధికారులు చెప్పారు. నాంపల్లి, సికింద్రా బాద్, కాచిగూడ స్టేషన్‌ల నుంచి వివిధ ప్రాంతాలకు బయలుదేరే సుమారు 60 రైళ్లకు కూడా అదనపు బోగీ లను ఏర్పాటు చేసే అవకాశం ఉంది.
లక్షన్నర మంది సాధారణ ప్రయాణికులే..
నగరంలోని మూడు ప్రధాన స్టేషన్‌లనుంచి ప్రతి రోజు సుమారు 2.8 లక్షల మంది వివిధ ప్రాంతా లకు రాకపోకలు సాగిస్తారు. రిజర్వేషన్ బోగీల్లో ప్రయాణం చేసేవారు మినహాయిస్తే కనీసం లక్షన్నర మంది సాధారణ ప్రయాణికులే. లక్ష మందికే సదుపాయం ఉన్న బోగీల్లో మరో 50 వేల మందికి పైగా ప్రయాణం చేస్తున్నారు. ఏ సమయంలో చూసినా జనరల్ బోగీలు కిక్కిరిసి కనిపిస్తాయి. ప్రయాణం నరకప్రాయంగా ఉంటోంది. నించునేందుకు కూడా చోటులేక చాలామంది మరుగుదొడ్ల పక్కన ఉన్న స్థలాన్ని ఆక్రమిస్తారు. ఫుట్‌బోర్డులపై కూర్చుంటారు. ఇలా రకరకాలుగా ఇబ్బందులను ఎదుర్కొంటూ ప్రయాణం చేయాల్సి వస్తోంది. అదనపు బోగీలను ఏర్పాటు చేయడం వల్ల ఇప్పుడు ఉన్న డిమాండ్‌లో కనీసం 75 శాతం వరకు భర్తీ అయ్యే అవకాశం ఉంటుంది. ‘సాధారణ బోగీల పెంపు కోసం చేపట్టిన ప్రయాణికుల ఉద్యమం ఫలించింది. ట్విట్టర్, ఫేస్ బుక్ వంటి సామాజిక మాద్యమాల ద్వారా సమస్య తీవ్రతను కేంద్రం దృష్టికి తీసుకెళ్లడంలో ప్రయాణికుల సంఘాలు విజయవంతమయ్యా’యని ఉత్తర తెలంగాణ రైల్వే ప్రయాణికుల సంఘం ప్రతినిధి ఫణి తెలిపారు. పూర్తిగా సాధారణ బోగీలు లేని ఎక్స్‌ప్రెస్, సూపర్ ఫాస్ట్ రైళ్లకు 2 సాధారణ బోగీలు ప్రవేశ పెడతారు. మరో 2 అదనంగా ఏర్పాటు చేస్తారు.
ఈ రైళ్లకు బోగీల పెంపు...
నాంపల్లి నుంచి న్యూఢిల్లీకి నడిచే తెలంగాణ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్, నాంపల్లి నుంచి నిజాముద్దీన్ ఢిల్లీకి రాకపోకలు సాగించే దక్షిణ్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్ ప్రెస్, సికింద్రాబాద్ నుంచి దానాపూర్ ( పాట్నా ) వరకు నడిచే సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైళ్లకు అదనపు బోగీలు ఏర్పాటు కానున్నాయి.
సికింద్రాబాద్– రాయ్‌పూర్ బైవీక్లీ, సికింద్రాబాద్– హిస్సార్ ట్రై వీక్లీ, నాంపల్లి– రక్సల్ వీక్లీ ఎక్స్‌ప్రెస్ , నాంపల్లి– విశాఖపట్నం గోదావరి సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్, నాంపల్లి – తాంబరం చైన్నె చార్మినార్ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైళ్లలో ఏర్పాటు చేయనున్నారు.
సాధారణ ప్రయాణికుల రద్దీ అత్యధికంగా ఉండే లింగంపల్లి –కాకినాడపోర్ట్ గౌతమి సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ , సికింద్రాబాద్ –గూడూరు సింహపురి సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైళ్లకు సైతం బోగీలు పెరగనున్నాయి.
హుస్సేన్ సాగర్, ఫలక్ నుమా, దేవగిరి, నారాయణాద్రి, విజయవాడ ఇంటర్ సిటీ, సికింద్రాబాద్–సాయినగర్ షిర్డీ అజంతా ఎక్స్‌ప్రెస్, రాయలసీమ సూపర్ ఫాస్ట్, కాచిగూడ–మంగళూరు , కాచిగూడ–మధురై హరిప్రియ ఎక్స్‌ప్రెస్ రైళ్లకు అదనపు బోగీలు జత చేస్తారు.
నాగ్‌పూర్ –సికింద్రాబాద్ 8 చైర్‌కార్ మరోవైపు నాగ్‌పూర్ నుంచి సికింద్రాబాద్‌కు రాకపోకలు సాగించే వందేభారత్ ఎక్స్‌ప్రెస్ బోగీలను తగ్గించే అవకాశం ఉన్నట్లు తెలిసింది. ప్రస్తుతం 20 చైర్ కార్‌లు ఉన్నాయి. ఆక్యుపెన్సీ చాలా తక్కువగా ఉంది. దీపావళి సెలవుల్లో మాత్రం 110 శాతం ఆక్యుపెన్సీతో ఈ ట్రైన్ నడిచింది. సాధారణంగా నిత్యం 25 నుంచి 30 శాతం ఆక్యుపెన్సీ కంటే పెరగడం లేదు. ఈ రూట్‌లో 8 చైర్‌కార్ ట్రైన్ నడిపాలని భావిస్తున్నట్లు అధికారులు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment