సంగారెడ్డి: ఆర్థిక ఇబ్బందులు, కూతుళ్లకు ఏ ఆస్తులు ఇవ్వలేకపోయాననే బాధతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండల కేంద్రంలో శనివారం చోటు చేసుకుంది. గ్రామస్తులు, తొగుట ఎస్‌ఐ లింగం తెలిపిన వివరాలు. గ్రామానికి చెందిన కొమ్మెర పద్మాకర్‌రెడ్డి కుటుంబం కొంత కాలంగా హైదరాబాద్‌లోని రామంతపూర్‌లో నివాసం ఉంటుంది. ఈ క్రమంలో కుటుంబ అవసరాల కోసం అప్పులు చేశాడు. వాటిని తీర్చేందుకు గ్రామంలోని వ్యవసాయ భూమిని విక్రయించాడు.
అదికాస్త వివాదాస్పదం కావడంతో సకాలంలో చేతికి డబ్బులు అందలేదు. చేసిన అప్పులు ఎలా తీర్చాలో తెలియక తీవ్ర మనోవేదనకు గురైన పద్మాకర్‌రెడ్డి రెండు రోజుల క్రితం హైదరాబాద్ నుంచి గ్రామానికి వచ్చాడు. శుక్రవారం రాత్రి భార్యతో ఫోన్‌లో మాట్లాడాడు. ఇద్దరు కూతుళ్లకు ఎలాంటి ఆస్తులు ఇవ్వలేకపోయానంటూ ఆవేదన వ్యక్తం చేస్తూ ఉత్తరాలు రాసి పెట్టి శుక్రవారం అర్ధరాత్రి ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
శనివారం ఉదయం ఆయన అన్న కుమారుడు విష్ణువర్ధన్‌రెడ్డి గమనించి తొగుట పోలీసులకు సమాచారం అందించాడు. ఎస్‌ఐ లింగం ఘటనా స్థలానికి చేరుకుని శవాన్ని కిందకు దించారు. ఉత్తరాలను స్వాధీనం చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. భార్య లత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ వివరించారు.
ముఖ్య గమనిక:
ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com
Comments
Please login to add a commentAdd a comment