పటాన్‌చెరు: పారిశ్రామికవాడ పటాన్‌చెరులో కాంగ్రెస్ మార్కు రాజకీయాలు మొదలయ్యాయి. కాంగ్రెస్ కుంపటి రాజకీయాలు పటాన్‌చెరులో సెగలు పుట్టిస్తోంది. గూడెం మహిపాల్‌రెడ్డి కాంగ్రెస్‌లోనే ఉన్నారా? అంటూ ఆ పార్టీ నేతలే ప్రశ్నిస్తున్నారు. తన అన్న వారికే పోస్టింగులు ఇవ్వాలని ఎమ్మెల్యే గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా పోలీస్ శాఖలో ఇటీవల జరిగిన జరగబోతున్న బదిలీలు కాటా శ్రీనివాస్‌గౌడ్...గూడెం మహిపాల్‌రెడ్డి మధ్య సఖ్యత లేదన్నది బహిర్గతమైంది. గాంధీభవన్ వేదికగా కాటా శ్రీనివాస్‌గౌడ్ ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డిపై తీవ్రస్థాయిలో ఆరోపణలే చేశారు. ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరినా ఆ పార్టీ కార్యక్రమాల్లో మాత్రం పాల్గొనడం లేదు. కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఆయన పార్టీకి దూరంగా ఉంటున్నారనే వాదన కూడా ఉంది. మరోవైపు కాటా శ్రీనివాస్‌గౌడ్ కూడా పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడం లేదు. పార్టీపై అలక వహించారని కాటాను పార్టీ పెద్దలు గాంధీభవన్‌కు పిలిపించారని చెప్తున్నారు. గురువారం ఆయన గాంధీ భవన్‌వెళ్లారు. అక్కడ ఆయన కార్యకర్తలతో హంగామా చేశారు. మొత్తం మీద తన అలకకు కారణాలను ఆయన అక్కడ వెలువరించారు. మంత్రి దామోదర రాజనర్సింహతో కూడా కాటా శ్రీనివాస్‌గౌడ్ ముభావంగానే ఉంటున్నారని గతంలో మాదిరిగా తరుచూ కలుసుకోవడం లేదనే ప్రచారం కూడా ఉంది. నీలం మధు ముదిరాజ్ కాంగ్రెస్‌లో చేరి ఎంపీ టికెట్‌పై పోటీ చేసిన తర్వాత ఆయన కాంగ్రెస్ పార్టీ అగ్రశ్రేణి నాయకులతో మంచి సంబంధాలు పెట్టుకున్నారు. ఆయన ఇంటికి టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్ వచ్చి వెళ్లారు. మొత్తం మీద గత పదేళ్ల కాలంలో కాంగ్రెస్ అధికారంలో లేని సమయంలో కాటా శ్రీనివాస్‌గౌడ్ కాంగ్రెస్ పేరుకు పర్యాయ పదంగా ఉండేది. కానీ ఇప్పుడు ఆయన ఊసే లేకుండా అధినాయకత్వం వ్యవహరిస్తోందని కాటా వర్గీయులు కినుకు వహించారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే కాటా శ్రీనివాస్‌గౌడ్ తన అనుకున్న అధికారులకు పటాన్‌చెరులో పోస్టింగులు ఇప్పించుకోవడం సఫలీకృతులయ్యారు. గత రెండు రోజులుగా రాత్రికి రాత్రి పోలీస్‌శాఖలో కొన్ని బదిలీలు జరిగాయి. మరి కొన్ని మారే అవకాశం కూడా ఉంది. దానికి కారణం ఎమ్మెల్యేనని ప్రచారం ఉంది. ఎమ్మెల్యే పోలీస్ శాఖలో తన అనుకున్న వారిని నియమించుకోవాలనే ఎత్తు వేశారు. అందులోభాగంగా కొందరు ఇప్పటికే బదిలీపై వచ్చారు. మరో పెద్ద అధికారి బదిలీ కూడా ఉంది. అది భరించలేక కాటా శ్రీనివాస్‌గౌడ్ గాంధీ భవన్‌వేదికగా గురువారం ఎమ్మెల్యే తీరుపై చిందులేశారు. ఆయనకు సహకరిస్తున్న పార్టీ పెద్దలపై పరోక్షంగా సీఎంపై చిరుబుర్రులాడారు. మిగతా శాఖల సంగతి పక్కన పెడితే పోలీస్ శాఖలో ఎమ్మెల్యేకు కొంత పట్టు తగ్గిందనే ప్రచారం సాగుతుంది. ఎమ్మెల్యేగా క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సమస్యలకు బదిలీలే పరిష్కారం అనే ధోరణితో ఎమ్మెల్యే ఎత్తులు వేశారు. దేవాదాయ శాఖలో ఆలయాల చైర్మన్‌లు, ఇతర పదవుల్లోనూ ఎమ్మెల్యే వ్యతిరేక వర్గాలకు చెందిన వారే నియమితులయ్యారు. ఇలా జరుగుతున్నా ఎమ్మెల్యే ఇప్పటివరకు కిమ్మనలేదు. కానీ తాజాగా ఆయన సీఎంను కలసి తన సమస్యలను చెప్పుకున్నారని దాంతో తాజా పోలీస్ శాఖ బదిలీలే నిదర్శనమని చెప్తున్నారు. ఇది ఆరంభం మాత్రమేనని పరిస్థితి ని గమనించిన కాటా శ్రీనివాస్‌గౌడ్ గాంధీ భవన్ వేదికగా ఎమ్మెల్యేపై తన అక్కసును వెళ్లగక్కారు. కాంగ్రెస్ వినాశనానికే ఎమ్మెల్యే ప్రయత్నిస్తున్నారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
అక్రమ కేసులు పెట్టించలేదు
దశాబ్దంపైగా తాను ఎమ్మెల్యేగా కొనసాగుతున్నాను. తాను ఎవరిపైనా ఏనాడు తప్పుడు కేసులు పెట్టించింది లేదు. ప్రజాస్వామ్యంలో నిబంధనలకు లోబడి వ్యవహారాలుంటాయి. ఎమ్మెల్యే ప్రమేయంతోనే బదిలీలు ఉంటాయి. రాజకీయ కక్ష సాధింపు ధోరణితో ఏనాడు ఇక్కడ రాజకీయాలు చేయలేదు.
– గూడెం మహిపాల్‌రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment