చెరువుల పరిరక్షణ అందరి బాధ్యత
తెల్లాపూర్ చెరువులను సందర్శించిన హైడ్రా చైర్మన్
రామచంద్రాపురం(పటాన్‌చెరు): చెరువుల పరిరక్షణ మన అందరి బాధ్యతని హైడ్రా చైర్మన్ రంగనాథ్ పేర్కొన్నారు. తెల్లాపూర్ పరిధిలోని వనం చెరువు, మేళ్ల చెరువు, చెల్లికుంటాలను బుధవారం ఆయన సందర్శించారు. మేళ్ల చెరువు కట్టపై ఆయన నడిచి చెరువు, కాలువలను నిశితంగా పరిశీలించారు. మేళ్ల చెరువును ఆనుకుని ఉన్న రాజుయాదవ్ వ్యవసాయక్షేత్రాన్ని కూడా ఆయన సందర్శించారు. ఎఫ్‌టీఎల్ పరిధిలో ఉన్న భూమిలో మట్టిని ఎలా నింపుతారని నిలదీశారు. అక్కడే ఉన్న రాజు యాదవ్ స్పందిస్తూ...తనకు ఎన్‌వోసీ ఉందని, గత కలెక్టర్ నుంచి అనుమతులు తీసుకున్నానని వివరించారు. వెంటనే ఇరిగేషన్ డీఈ రామస్వామి కల్పించుకుంటూ ఎన్‌జీటీ ఆదేశాల మేరకు ఇదివరకే ఆ అనుమతులను రద్దు చేసినట్లు రంగనాథ్‌కు వివరించారు. దీంతో రంగనాథ్ స్పందిస్తూ...దీనిపై అధికారులనుంచి పూర్తి నివేదిక తెప్పించుకుంటానని, మీ అనుమతులు తప్పని తేలితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం చెల్లికుంటాను సందర్శించారు. చెరువు కట్ట, అలుగులను పరిశీలించారు. రంగనాథ్‌కు చెరువులు ఏవిధంగా కబ్జాకు గురయ్యాయో మాజీ నీటి సంఘం చైర్మన్ వడ్డే నర్సింహ వివరించారు. తెల్లాపూర్‌లోని చెరువులు హెచ్‌ఎండీఏ వైబ్‌సైట్‌లో కనిపించడం లేదని స్థానికులు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం రంగనాథ్ మాట్లాడుతూ...ఎఫ్‌టీఎల్ పరిధులను త్వరలోనే నిర్ణయిస్తామని, అన్ని చెరువులు ఆన్‌లైన్‌లో కనిపించే విధంగా చర్యలు తీసుకుంటామని హామీనిచ్చారు. కార్యక్రమంలో స్థానిక అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment