● సంగారెడ్డిలో జిల్లా వాసులు మృతి ● 17న ఇంటి నుంచి వెళ్లి అదృశ్యం
సంగారెడ్డి క్రైమ్: మహబూబ్ సాగర్ చెరువులో తల్లీకూతుళ్ల మృతదేహాలు లభ్యమైన ఘటన పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం వెలుగు చూసింది. పట్టణ సీఐ రమేశ్.. మెదక్ జిల్లాలోని బ్రాహ్మణవీధికి చెందిన ముద్దుల సత్యనారాయణ ప్రభుత్వ టీచర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. ఇతడికి భార్య విజయలక్ష్మి (54), కూతురు మణిదీపిక (27), కుమారుడు మణి దీప్ ఉన్నారు. 17న సోమవారం విజయలక్ష్మి, మణిదీపిక ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు. అదే రోజు సాయంత్రం మెదక్ టౌన్ పోలీస్‌స్టేషన్‌లో భర్త ఫిర్యాదు చేయగా మిస్సింగ్ కేసు నమోదు చేశారు. బుధవారం ఉదయం సంగా రెడ్డిలోని మహబూబ్‌సాగర్ చెరువులో తల్లీకూతురు మృతదేహాలై కనిపించారు. చెరువులో గుర్రపుడెక్క తొలగించే ఇన్‌చార్జి సురేందర్ గమనించి పట్టణ పోలీసులకు సమాచారం అందించాడు. చెరువులో నుంచి మృతదేహాలను బయటకు తీసి వారి వద్ద ఉన్న ఆధార్ కార్డు, బస్సు టిక్కెట్ల ఆధారంగా మృతులు మెదక్ జిల్లా వాసులుగా గుర్తించారు. మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
బియ్యం పట్టివేత
నారాయణఖేడ్: అక్రమంగా రవాణా చేస్తున్న పీడీఎస్ బియ్యాన్ని కల్హేర్ పోలీసులు పట్టుకొ ని ఖేడ్ సివిల్ సప్లయ్ అధికారులకు అప్పగించారు. వివరాల్లోకి వెళ్తే.. ఏపీలోని పోరుబందర్‌కు చెందిన లారీ డ్రైవర్ కిషోర్ కాంత్ విజయవాడలో నరేశ్ అనే వ్యక్తి వద్ద పీడీఎస్ బియ్యం కొనుగోలు చేశాడు. 300 క్వింటాళ్లు గుజరాత్‌కు లారీలో తరలిస్తుండగా మాసాన్‌పల్లి వద్ద పట్టుకున్నాం. మంగళవారం మూడు లారీలు పట్టుకోగా రెండు లారీలపై కేసు నమోదు చేశారు. మరో లారీపై బుధవారం కేసు నమోదు చేశారు. లారీ డ్రైవర్, బియ్యం అమ్మిన వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు కల్హేర్ పోలీసులు వివరించారు.