
సన్నబియ్యం సర్దుబాటు
● నిజామాబాద్, కామారెడ్డి, మెదక్ నుంచి తెప్పిస్తున్న అధికారులు ● జిల్లాలో అందుబాటులో లేని సన్నరకం నిల్వలు ● ఏప్రిల్ 1 నుంచి రేషన్‌షాపుల్లో పంపిణీకి ఏర్పాట్లు
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: సన్న బియ్యం కోసం పౌరసరఫరాల సంస్థ పక్క జిల్లాలపై ఆధార పడాల్సిన పరిస్థితి నెలకొంది. తెల్ల రేషన్‌కార్డుదారులకు ఏప్రిల్ నుంచి సన్నబియ్యం పంపిణీ చేయాలని ప్రభుత్వ నిర్ణయించిన నేపథ్యంలో సంగారెడ్డి జిల్లా అవసరాల కోసం ఈ సన్న బియ్యాన్ని కామారెడ్డి, నిజామాబాద్, మెదక్ జిల్లాల నుంచి తెప్పిస్తున్నారు. సన్నరకం ధాన్యం సాగు జిల్లాలో నామమాత్రమే. జిన్నారం, గుమ్మడిదల, హత్నూర వంటి మండలాల్లో అతికొద్ది మంది రైతులు మాత్రమే ఈ సన్నరకం ధాన్యాన్ని సాగు చేస్తారు. ఇలా సాగైన ధాన్యాన్ని రైతులు తమ సొంత అవసరాల కోసమే ఎక్కువగా వినియోగిస్తారు. మిగిలిన సన్నధాన్యం ప్రైవేటు వ్యాపారులే కొనుగోలు చేస్తారు. దీనికితోడు జిల్లాలో బాయిల్డ్ రైసుమిల్లులు కూడా తక్కువే. ఈ బాయిల్డ్ మిల్లులుంటే మిల్లర్లు ఇతర జిల్లాల నుంచి సన్నరకం ధాన్యాన్ని తెచ్చి సన్నబియ్యంగా మార్చేవారు. కానీ, ఈ పరిస్థితి కూడా జిల్లాలో తక్కువే. దీంతో ఈ సన్నబియ్యం కోసం పక్క జిల్లాలపై ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొంది. ఇలా ఇప్పటివరకు నిజామాబాద్ జిల్లా నుంచి 1,600 మెట్రిక్ టన్నులు, కామారెడ్డి జిల్లా నుంచి 2,000 మెట్రిక్ టన్నులు, మెదక్ జిల్లా నుంచి 2,318 మెట్రిక్ టన్నుల సన్న బియ్యం జిల్లాకు చేరాయి.
కార్డుల సంఖ్య పెరిగే అవకాశం
ప్రస్తుతం జిల్లాలో 3.79 లక్షల రేషన్‌కార్డులున్నాయి. ఇటీవల కొత్త రేషన్‌కార్డులను సైతం ప్రభుత్వం జారీ చేసింది. ఈ కొత్త కార్డులపై ఏప్రిల్ నుంచి నిత్యావసరాలు పంపిణీ చేసే అవకాశాలున్నాయి. దీంతో జిల్లాలోని కార్డుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉందని ఈ శాఖ అధికారులు పేర్కొంటున్నారు.
7,500 మెట్రిక్ టన్నులు..
జిల్లాలో 3.79 లక్షల రేషన్‌కార్డులున్నాయి. ఈ కార్డులపై గత నెలలో 7,899 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని కేటాయించారు. రేషన్ పోర్టబిలిటీ విధానం అందుబాటులోకి వచ్చాక ఇతర ప్రాంతాల నుంచి జిల్లాకు వలస వచ్చిన వారు కూడా ఈ బియ్యాన్ని జిల్లాలో తీసుకునేందుకు వీలు కలుగుతోంది. ప్రధానంగా పరిశ్రమల్లో పనిచేస్తున్న ఇతర రాష్ట్రాల కార్మికులు ప్రతినెలా బియ్యాన్ని స్థానిక రేషన్‌షాపుల్లో తీసుకుంటున్నారు. యూపీ, బిహార్, రాజస్థాన్, ఒడిశా, మధ్యప్రదేశ్, మహరాష్ట్ర వంటి రాష్ట్రాలకు చెంది న కార్మికులు వేలల్లో జిల్లాలోని పరిశ్రమల్లో పనిచేస్తున్నారు. రేషన్ పోర్టబిలిటీ విధానం అందుబాటులోకి వచ్చాక ఈ నిరుపేద కార్మికులు తమ నిత్యవసరాలను ఇక్కడే తీసుకునేందుకు వీలు కలుగుతోంది. దీంతో జిల్లాలో ఉన్న రేషన్‌కార్డుల కంటే ఇతర జిల్లాలు, రాష్ట్రాల రేషన్‌కార్డుదారుల కోసం అదనంగా బియ్యాన్ని కేటాయించాల్సి ఉంటుంది. దీంతో జిల్లా కార్డులకు సరిపడే బియ్యంతోపాటు, పోర్టబిలిటీకి సరిపడా సన్నబియ్యాన్ని అందుబాటులో ఉంచేందుకు పౌరసరఫరాల సంస్థ చర్యలు చేపట్టింది.
ఎలాంటి ఆదేశాలు రాలేదు
ఈ సన్నబియ్యం పంపిణీ విషయంలో ప్రభుత్వం నుంచి తమకు మౌఖిక ఆదేశాలు తప్ప..రాతపూర్వకంగా ఎలాంటి ఆదేశాలు రాలేదు.
– శ్రీనివాస్‌రెడ్డి
జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి