అగ్నిప్రమాదాల నివారణపై అప్రమత్తం | Sakshi
Sakshi News home page

అగ్నిప్రమాదాల నివారణపై అప్రమత్తం

Published Thu, Apr 18 2024 2:00 PM

ప్రైవేటు ఆస్పత్రిలో ప్రజలకు
అవగాహన కల్పిస్తున్న ఫైర్‌ సిబ్బంది  - Sakshi

సిద్దిపేట ఫైర్‌ ఇన్‌చార్జి అధికారి నరేష్‌

సిద్దిపేటకమాన్‌: వేసవిలో అగ్ని ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశం ఎక్కువగా ఉన్నందునా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సిద్దిపేట అగ్నిమాపక శాఖ ఇన్‌చార్జి అధికారి నరేష్‌ సూచించారు. పట్టణంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలోని సిబ్బంది, ప్రజలకు అగ్నిప్రమాదాల నివారణపై బుధవారం ఫైర్‌ సిబ్బందితో కలిసి ఆయన అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. అగ్నిమాపక సేవల శాఖ ఆధ్వర్యంలో వారం రోజులుగా అగ్నిప్రమాదాల నివారణ, ప్రమాద సమయంలో తీసుకునే జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. పట్టణంలోని పలు ఆస్పత్రులు, ఆర్టీసీ బస్టాండ్లు, జనసమూహం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో అగ్నిప్రమాదాలపై అవగాహన కల్పించామని వెల్లడించారు. వేసవిలో అగ్ని ప్రమాదాలు చోటుచేసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎల్లప్పుడూ అగ్నిమాపక సాధనాలను అందుబాటులో ఉంచుకోవాలన్నారు. వాటిని ఎలా ఉపయోగించాలో తెలుసుకోవాలన్నారు. పట్టణంలో ఎక్కువగా విద్యుత్‌, ఎలక్ట్రికల్‌ ఉపకరణాల వల్ల అగ్ని ప్రమాదాలు జరుగుతున్నందున ఐఎస్‌ఐ మార్క్‌ కలిగిన వైర్లు, ఉపకరణాలను ఉపయోగించాలన్నారు. ముఖ్యంగా రాత్రి సమయంలో షాపుల్లో విద్యుత్‌ సరఫరా నిలిపి వేయాలన్నారు. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా ఈ నెల 20వ తేదీ వరకు ప్రజలకు అవగాహన కల్పిస్తామని స్పష్టం చేశారు.కార్యక్రమంలో లీడింగ్‌ ఫైర్‌మెన్‌ నరేష్‌, సిబ్బంది సంపత్‌, శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

Advertisement
Advertisement