అనంతలోకాలకు తీసుకెళ్లావా నాన్న..
సిద్దిపేటకమాన్: పానీపూరి (గప్ చుప్‌లు) తినిపిస్తానని తీసుకెళ్లిన తండ్రి.. అనంత లోకాలకు పంపిస్తాడని ఊహించలేదు ఆ చిన్నారులు. భుజాలపైన ఎత్తుకుని ఆడించిన నాన్నే నీటిలో ముంచి ప్రాణాలు తీస్తాడని అనుకోలేదు. అన్నా చెల్లెలు తండ్రితో కలిసి స్కూటీపై సరదాగా బయటకు వెళ్లి చెరువులో విగత జీవులుగా తేలడంతో పలువురు కంటతడి పెట్టారు. డబ్బుల విషయంలో తమ్ముడితో గొడవ పడి మనస్తాపానికి గురై తన ఇద్దరు పిల్లలను చున్నీతో కట్టుకుని చెరువులో దూకాడు. అభం శుభం తెలియని ఇద్దరు చిన్నారులు, తండ్రి మృతదేహాలను చెరువులో చూసిన స్థానికులు, కుటుంబ సభ్యులు బోరున విలపించారు. ఈ హృదయ విదారక ఘటన సిద్దిపేటలో ఆదివారం చోటు చేసుకుంది.
చిన్నకోడూరు మండలం కస్తూరుపల్లికి చెందిన తేలు సత్యం (48)కు గతంలో వివాహం జరగగా భార్య అనారోగ్యంతో మరణించింది. 2016లో శిరీషను రెండో వివాహం చేసుకున్నాడు. వీరికి కుమారుడు అద్వేష్‌నంద (8), కూతురు త్రివేణి హాసిని (6) ఇద్దరు సంతానం. పట్టణంలోని నెహ్రూ పార్క్ వాసవీనగర్ కాలనీలో నివాసం ఉంటున్నారు. సత్యం పట్టణంలో ఓ ప్రింటింగ్ షాప్ నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఆరోగ్యం దెబ్బతినడం.. తీసుకున్న డబ్బులు తమ్ముడు ఇవ్వకపోవడంతో దిక్కుతోచనిస్థితికి గురయ్యాడు. డబ్బులు అడిగితే తమ్ముడు చెప్పుతో కొట్టడం.. అవమానిచండంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఈ క్రమంలో శనివారం రాత్రి సత్యం తన ఇద్దరు పిల్లలను పానీపూరి తినిపిస్తానని ఇంటి నుంచి బయటకు తీసుకెళ్లాడు. రాత్రి అయినా ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు అంతా వెతికారు. ఎక్కడా కనిపించకపోవడంతో పోలీసులకు సమాచారం అందించారు. ఆదివారం ఉదయం పట్టణ శివారు చింతల చెరువు కట్టపైన సత్యం ద్విచక్ర వాహనాన్ని గుర్తించారు. తన ఇద్దరు పిల్లలను చున్నీతో నడుముకు కట్టుకుని సత్యం చింతల చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చెరువులో ముగ్గురి మృతదేహాలు తేలి ఉండడాన్ని గుర్తించిన పోలీసులు గజ ఈతగాళ్ల సాయంతో బయటకు తీయించారు. చిన్నారుల మృతదేహాలను చూసి తల్లి, కుటుంబ సభ్యులు బోరున విలపించారు. ఎంతో సరదాగా, చదువులో చురుకుగా ఉండేవారని అయ్యో పాపం మీరేమి పాపం చేశారు బిడ్డా.. అప్పుడే మీకు నిండు నూరేళ్లు నిండాయా అంటూ గుండెలు బాదుకుంటూ రోదించిన తీరు అక్కడ ఉన్న వారందరిని కంట తడి పెట్టించాయి. ఘటనా స్థలాన్ని ఏసీపీ మధు, టూటౌన్ సీఐ ఉపేందర్ పరిశీలించారు. మృతదేహాలను ప్రభుత్వ ఆసుపత్రి మార్చురికీ తరలించారు. మృతుడి భార్య శిరీష ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
మృతదేహాల వద్ద రోదిస్తున్న కుటుంబ సభ్యులు, చిత్రంలో సీఐ ఉపేందర్ తదితరులు
ఇద్దరు పిల్లలతో చెరువులో దూకిన తండ్రి శోకసంద్రమైన సిద్దిపేట పట్టణం
సందడి చేసే చిన్నారులు
సత్యం, శిరీష దంపతుల పిల్లలు అద్వేష్‌నంద ఒకటవ తరగతి, త్రివేణి ఎల్‌కేజీ చదువుతున్నారు. ఇద్దరు చిన్నారులు ఇంట్లో ఎంతో సందడి చేసేవారని, తోటి స్నేహితులతో కలిసి మెలిసి ఉండేవారని కుటుంబ సభ్యులు తెలిపారు. చదువులో ఎంతో చురుకుగా ఉండే వారని తెలిపారు. భవిష్యత్‌పై మా కలలను కల్లలు చేశారా అంటూ మృతదేహాలను చూస్తూ కుటుంబ సభ్యులు బోరున విలపించారు.
Comments
Please login to add a commentAdd a comment