కేసీఆర్ ఫాంహౌస్‌ను వీడాలి
గజ్వేల్: మాజీ సీఎం కేసీఆర్ ఇకనైనా ఫాంహౌస్‌ను వీడి, ప్రజా సమస్యలపై గొంతెత్తాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. శుక్రవారం గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని ఆర్‌అండ్‌ఆర్ కాలనీని సందర్శించి నిర్వాసితుల సమస్యలు తెలుసుకున్నారు. అనంతర నిర్వహించిన కార్యక్రమంలో కూనంనేని మాట్లాడుతూ మల్లన్నసాగర్ రిజర్వాయర్ నిర్మాణం వల్ల 14గ్రామాలకు చెందిన 12వేల మంది నిర్వాసితులయ్యారని చెప్పారు. వారికి సరైన ప్యాకేజీలు, పరిహారాలు ఇవ్వకుండా, ఆర్‌అండ్‌ఆర్ కాలనీలో అవసరమైన సౌకర్యాలను కల్పించకుండా గాలికి వదిలేశారని ఆందోళన వ్యక్తం చేశారు. కాళేశ్వరం పేరుతో ప్రజల జీవితాలను ఆడుకున్నారని మండిపడ్డారు. నిర్వాసితుల త్యాగాలు కొందరికీ భోగాలుగా మారాయని మండిపడ్డారు. ముంపుబాధితుల సమస్యలపై కేసీఆర్ తక్షణమే స్పందించాలన్నారు. వారి సమస్యలపై అసెంబ్లీలో మాట్లాడాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యంలో గెలుపోటములు సహజమని, ప్రభుత్వంలో లేనంత మాత్రాన ప్రజల సమస్యలను పట్టించుకోకపోవడం తగదన్నారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఇలా జరిగిందని నిందించకుండా మల్లన్నసాగర్ నిర్వాసితుల సమస్యలపై సీఎం రేవంత్‌రెడ్డి స్పందించాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్ చొరవ చూపాలన్నారు. తమ పార్టీ తరఫున సైతం నిర్వాసితుల సమస్యలపై అసెంబ్లీలో గొంతెత్తుతామని చెప్పారు. సీపీఐ జిల్లా ఇన్‌చార్జి శివలింగు కృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి మంద పవన్, మాజీ కార్యదర్శి భట్టు దయానందరెడ్డి, నాయకులు రాజేశం, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
బీఆర్‌ఎస్, బీజేపీలది సీక్రెట్ ఎజెండా
ప్రజాసమస్యలపై గొంతెత్తాలి కాళేశ్వరం పేరుతో పేదలజీవితాలను ఛిద్రం చేశారు.. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు
సిద్దిపేటఅర్బన్: రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్యలు రేకెత్తించేలా, అభద్రతా భావం కల్పించేలా బీఆర్‌ఎస్, బీజేపీలు సీక్రెట్ ఎజెండాతో పనిచేస్తూ రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. శుక్రవారం సిద్దిపేటలోని ఎడ్ల గురువారెడ్డి భవన్‌లో పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్‌రెడ్డితో కలిసి విలేకరులతో మాట్లాడారు. బీజేపీ హిందూ, ముస్లిం గొడవలు సృష్టించే ప్రయత్నం చేస్తోందని, పాతబస్తీలో అల్లర్లు చేసేందుకు ప్రయత్నించిందన్నారు. ఫార్మా సిటీ నిర్మించే ప్రాంతాన్ని ఫోర్త్ సిటీగా చేస్తామని చెప్పారని, అక్కడి వ్యవసాయ భూములు, ప్రజలకు నష్టం కలగకుండా ఫార్మా సిటీని జనావాసాలకు దూరంగా నిర్మించాలని అన్నారు. బీఆర్‌ఎస్ నాయకులు ఆర్‌అండ్‌ఆర్ కాలనీ వాసులకు అన్యాయం చేసి ఇప్పుడు నీతి వాఖ్యాలు వల్లిస్తున్నారని మండిపడ్డారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిన తప్పులనే కాంగ్రెస్ ప్రభుత్వం చేయొద్దని, బీఆర్‌ఎస్ రాష్ట్రాన్ని దివాలా తీయించి కాంగ్రెస్‌కి అప్పగించిందన్నారు. రూ. 2 లక్షల పైన ఉన్న రైతుల రుణమాఫీపై కాంగ్రెస్ ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలని అన్నారు. ఉద్యోగులకు ప్రతి నెలా జీతాలు చెల్లించాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment