క్రీడలతో మనోధైర్యం..
● మానసిక ఉల్లాసం ● కలెక్టర్ మనుచౌదరి ● సందడిగా దివ్యాంగుల క్రీడలు
వాలీబాల్ అకాడమీ మంజూరు
సిద్దిపేటజోన్: క్రీడలు మనోధైర్యంతో పాటు మానసిక ఉల్లాసానికి దోహదపడతాయని కలెక్టర్ మనుచౌదరి అన్నారు. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం పురస్కరించుకుని శుక్రవారం జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో దివ్యాంగులకు క్రీడలు నిర్వహించారు. పోటీలను జెండా ఊపి ప్రారంభించిన అనంతరం కలెక్టర్ మాట్లాడారు. దివ్యాంగులమని అధైర్య పడొద్దని, ప్రభుత్వ అన్ని రకాలుగా అండగా ఉంటుందన్నారు. అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని తెలిపారు. జిల్లా స్థాయిలో ప్రతిభ చూపి త్వరలో జరగనున్న రాష్ట్ర స్థాయి పోటీల్లో రాణించి జిల్లాకు పేరు తేవాలని సూచించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మనుచౌదరి స్వయంగా దివ్యాంగులతో చెస్, క్యారం ఆడి వారిని ప్రోత్సహించారు. మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి శారద, యువజన క్రీడల శాఖ అధికారి జయదేవ్ ఆర్య, మున్సిపల్ కౌన్సిలర్ శ్రీదేవి, పీఈటీలు, దివ్యాంగులు పాల్గొన్నారు.
సిద్దిపేటజోన్: జిల్లా కేంద్రంలో వాలీబాల్ అకాడమీ మంజూరైందని, ఏర్పాటుకు అవసరమైన ఏర్పాట్లు యుద్ధప్రాతిపదికన చేపట్టాలని కలెక్టర్ మనుచౌదరి అధికారులకు సూచించారు. శుక్రవారం స్థానిక స్టేడియాన్ని ఆయన ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా క్రీడా ప్రాంగణంలో ఉన్న వసతులను పరిశీలించారు. జిల్లాలో 20మంది బాలికలు 20 మంది బాలురులతో వాలీబాల్ అకాడమీ మంజూరు అయ్యిందన్నారు. వారికి వేర్వేరుగా హాస్టల్, భోజన వసతి ఏర్పాట్లు చేసి ప్రత్యేక కోచ్ ద్వారా వాలీబాల్ లో శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. అక్కడ ఉన్న భవనాలను, గదులను పరిశీలించారు. టాయిలెట్స్ మరమ్మతులు చేసి అవసరమైన బెడ్స్, తాగునీరు, విద్యుత్ తదితర వసతులను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా క్రీడల శాఖ అధికారి జయదేవ్ ఆర్యకు సూచించారు. అనంతరం ఇండోర్ షటిల్ కోర్ట్‌ను, అదేవిధంగా ఫుట్‌బాల్, బాస్కెట్‌బాల్ కోర్ట్, స్విమ్మింగ్ పూల్, జిమ్‌లను పరిశీలించారు. క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న సీఎం రేవంత్ క్రికెట్ టోర్నీలో ఆటగాళ్లను పరిచయం చేసుకొని కొద్దిసేపు వారితో కలెక్టర్ బ్యాటింగ్ చేసి సందడి చేశారు. ఆయన వెంట జిల్లా క్రీడా సమాఖ్య కన్వీనర్ సాయిరాం, అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment