గృహజ్యోతి కొందరికే..
దాదాపు సగం మందికే అమలు..
● 3.16లక్షల సర్వీసులున్నా..
1.95లక్షల మందికే..
● ఆన్‌లైన్‌లో కొందరివి తప్పుగా నమోదు
● కార్యాలయాల చుట్టూ
వినియోగదారుల ప్రదక్షిణలు
● అర్హులందరికీ అమలు చేయాలని
కోరుతున్న లబ్ధిదారులు
రేషన్ కార్డు లేక..
రేషన్ కార్డులున్న వారికే గృహజ్యోతి పథకం అమలు చేస్తున్నారు. ఒక రేషన్ కార్డుకు ఒక సర్వీస్‌కు మాత్రమే గృహజ్యోతిని వర్తింపజేస్తున్నారు. నాలుగేళ్లుగా కొత్త రేషన్ కార్డులకు మోక్షం లేకపోవడంతో పలువురు ఈ పథకానికి దూరమవుతున్నారు. కొత్తగా వివాహమైన వారు వేరు కాపురాలు పెట్టారు. కొత్త రేషన్ కార్డుల కోసం ఎంతో ఆశగా లబ్ధిదారులు ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికై న అధికారులు స్పందించి అర్హులందరికీ గృహజ్యోతి వర్తింపజేయాలని కోరుతున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న గృహజ్యోతి పథకం కొందరికే వర్తిస్తోంది. ప్రభుత్వం ఆరు గ్యారంటీల్లో భాగంగా రేషన్ కార్డు ఉన్న వారికి 200 యూనిట్ల లోపు ఉచిత విద్యుత్‌ను అందిస్తోంది. దాదాపు సగం మందికి అర్హత ఉన్నా ఈ పథకం వర్తించడం లేదు. దీంతో వినియోగదారులు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు.
సాక్షి, సిద్దిపేట: జిల్లా వ్యాప్తంగా కేటగిరి–1లో 3,16,656 సర్వీసులున్నాయి. అందులో 1,95,680 (61శాతం) మందికే ఉచిత విద్యుత్ పొందుతున్నారు. ప్రజాపాలనలో ఉచిత విద్యుత్ కోసం 2,67,734 మంది ఆప్షన్ ఇచ్చారు. దరఖాస్తు ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేసే సమయంలో రేషన్ కార్డు లేదని చాలా మందికి నమోదు అయ్యాయి. మరికొందరికి విద్యుత్ సర్వీస్ నంబర్ తప్పుగా నమోదు కావడంతో అర్హులు కాలేకపోతున్నారు.
కార్యాలయాల చుట్టూ ..
కొందరు వినియోగదారులు 200 యూనిట్ల లోపు విద్యుత్‌ను వినియోగిస్తున్నప్పటికీ గృహజ్యోతి పథకం లబ్ధి పొందలేకపోతున్నారు. ఉచిత విద్యుత్ అమలు కోసం కార్యాలయాల చుట్టూ ప్రజలు తిరుగుతున్నారు. కలెక్టరేట్‌లో, మున్సిపల్, మండల పరిషత్ , విద్యుత్ కార్యాలయాలకు తిరుగుతున్నప్పటికీ వారి అమలు కావడం లేదు. ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేసేందుకు ప్రైవేట్ అపరేటర్‌లకు అప్పగించారు. పలువురు ఆపరేటర్లు తొందరలో తప్పుగా నమోదు చేయడంతో గృహజ్యోతికి దూరమవుతున్నారు.
ఆరు నెలలుగా తిరుగుతున్నా..
రేషన్ కార్డు ఉంది కానీ ఫ్రీ కరెంట్ బిల్లు వర్తించడం లేదు. ఆరు నెలలుగా ఆఫీస్‌ల చుట్టూ తిరుగుతున్నా... అమలు కావడం లేదు. ఇప్పటికై నా అధికారులు స్పందించి నాకు ఉచిత కరెంట్ అమలు చేయాలి.
– సుశీల, సిద్దిపేట
రేషన్ కార్డులున్న వారికే..
రేషన్ కార్డులున్న వారు 200 యూనిట్ల లోపు విద్యుత్ వినియోగించిన వారికి గృహజ్యోతి అమలు అవుతుంది. ప్రతి నెలా కొన్ని సర్వీస్‌లు పెరుగుతున్నాయి. ఒక రేషన్ కార్డుకు ఒక్క సర్వీస్‌కు అమలు అవుతుంది.
– చంద్రమోహన్, టీజీఎస్పీడీసీఎల్, ఎస్‌ఈ
జిల్లాలో నెల వారీగా మాఫీ ఇలా..
నెల సర్వీసులు మాఫీ (రూ.కోట్లలో)
మార్చి 1,71,266 4,24,22,313
ఏప్రిల్ 1,71,266 5,33,55,966
మే 1,71,266 5,19,73,934
జూన్ 1,82,232 6,14,22,145
జూలై 1,84,461 6.03,17,550
ఆగస్టు 1,90,554 6,07,23,915
సెప్టెంబర్ 1,93,361 6,77,11,508
అక్టోబర్ 1,94,818 6,38,89,121
నవంబర్ 1,95,680 7,09,08,684
Comments
Please login to add a commentAdd a comment