అణగారిన జీవితాల్లో వెలుగులు..
మిరుదొడ్డి(దుబ్బాక): భారత రాజ్యాంగంతోనే అణగారిన జీవితాల్లో వెలుగులు విరబూస్తున్నాయని ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు. బలహీన వర్గాల జీవితాల్లో స్వేచ్ఛా వాయువులు ప్రసాదించిన భారత రాజ్యాంగ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని దళిత బహుజన ఫ్రంట్ ఆధర్యంలో చేపట్టిన భారత రాజ్యాంగ విలువల పరిరక్షణ ప్రచారోద్యమ కార్యక్రమాన్ని మంగళవారం ప్రారంభించారు. అంతకుముందు అక్బర్‌పేట–భూంపల్లి మండల కేంద్రంలోని అమర వీరుల స్తూపం వద్ద అంబేడ్కర్ చిత్ర పటానికి పూల మాలలు వేశారు. ఆయన మాట్లాడుతూ.. భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. డీబీఎఫ్ జాతీయ కార్యదర్శి శంకర్ మాట్లాడుతూ భారత రాజ్యాంగ విలువల పరిరక్షణ ప్రచారోద్యమాన్ని చేపడుతున్నామన్నారు. కార్యక్రమంలో డీబీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి దాసరి ఏగొండ స్వామి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు దుబాషి సంజీవ్, జిల్లా ప్రధాన కార్యదర్శి బ్యాగరి వేణు, జిల్లా ఉపాధ్యక్షుడు బీమ్ శేఖర్, వివిధ దళిత సంఘాల నాయకులు యాదగిరి, లక్ష్మణ్, దుబ్బరాజం, మల్లన్న, శ్రీనివాస్, ఎల్లయ్య, సిద్ధిరాములు, కుమార్, బుచ్చయ్య తదితరులు పాల్గొన్నారు.
ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య
Comments
Please login to add a commentAdd a comment