ఆసియా కప్-2023లో భాగంగా భారత్, పాకిస్తాన్‌ల మధ్య నిన్న (సెప్టెంబర్ 2) జరిగిన గ్రూప్ స్టేజీ మ్యాచ్ వర్షం కారణంగా రద్దైన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో భారత ఇన్నింగ్స్ అనంతరం వర్షం ఎడతెరిపి లేకుండా కురవడంతో మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. దీంతో చాలాకాలంగా ఈ మ్యాచ్ కోసం అతృతగా ఎదురుచూసిన అభిమానులు తీవ్ర నిరాశకు లోనయ్యారు.
అయితే, ఈ మ్యాచ్ సాధ్యపడలేదని ఫ్యాన్స్ బాధ పడాల్సిన అవసరం లేదు. ఇదే టోర్నీలో భారత్-పాక్‌లు మరోసారి తలపడే అవకాశం ఉంది. రేపు (సెప్టెంబర్ 4) నేపాల్‌తో జరుగబోయే మ్యాచ్‌లో భారత్ గెలిస్తే సూపర్-4కు చేరుకుని, సెప్టెంబర్ 10న పాక్‌తో మరోసారి తలపడుతుంది. రేపటి మ్యాచ్ వర్షం కారణంగా రద్దైనా భారత్-పాక్‌ల మ్యాచ్‌కు ఎలాంటి ఢోకా ఉండదు. రేపటి మ్యాచ్‌లో ఏదైనా అద్భుతం జరిగి నేపాల్ గెలిస్తే తప్ప, ఆసియా కప్‌లో మరోసారి భారత్-పాక్ క్లాష్‌ను ఎవరూ ఆపలేరు.
ఎందుకంటే, పాక్‌తో మ్యాచ్ రద్దు కావడంతో భారత్ ఖాతాలో ఓ పాయింట్ చేరింది. రేపటి మ్యాచ్ వర్షం కారణంగా రద్దైనా మరో పాయింట్ జత చేసుకని, 2 పాయింట్లతో భారత్ సూపర్-4కు చేరుకుంటుంది. ఒకవేళ నేపాల్ గెలిస్తే, ఆ జట్టు 2 పాయింట్లతో పాక్‌తో పాటు సూపర్-4 దశలో ఉంటుంది. ఇది సాధ్యపడే విషయం కాదు కాబట్టి, మరోసారి అభిమానులకు భారత్-పాక్ మ్యాచ్ కనువిందు చేయడం ఖాయం.
ఇదిలా ఉంటే, గ్రూప్-ఏ నుంచి పాకిస్తాన్ ఇదివరకే సూపర్-4కు అర్హత సాధించిన విషయం తెలిసిందే. తొలి మ్యాచ్‌లో నేపాల్‌పై నెగ్గిన ఆ జట్టు.. నిన్నటి మ్యాచ్ రద్దు కావడంతో మొత్తంగా 3 పాయింట్లు ఖాతాలో వేసుకుని తదుపరి రౌండ్‌కు అర్హత సాధించింది. తొలి మ్యాచ్‌లో పాక్ చేతిలో ఓడిన నేపాల్ ప్రస్తుతానికి 0 పాయింట్లతో భారత్ (1) తర్వాతి స్థానంలో ఉంది.
కాగా, సూపర్-4 అర్హత సాధించే జట్లు తమ గ్రూప్‌లోని జట్టుతో ఓ మ్యాచ్‌ను, మరో గ్రూప్‌లోని (గ్రూప్-బి) రెండు జట్లతో చెరో మ్యాచ్ ఆడతాయి. గ్రూప్-బిలో శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ జట్లు తొలి రెండు స్థానాల కోసం పోటీ పడుతున్నాయి. తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై నెగ్గిన శ్రీలంక గ్రూప్-బి నుంచి సూపర్-4 బెర్తును దాదాపుగా ఖరారు చేసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment