చివరి బంతి వరకు పోరాడినా ఫలితం లేదు.. ఏడ్చేసిన బాబర్‌!? వైరల్‌ | Asia Cup 2023, Pak vs SL: Babar Almost In Tears Pics Goes Viral After Heartbreaking Loss | Sakshi
Sakshi News home page

Asia Cup: ఆఖరి బంతి వరకు పోరాడినా ఫలితం లేదు.. ఏడ్చేసిన బాబర్‌ ఆజం!? వైరల్‌

Published Fri, Sep 15 2023 1:24 PM | Last Updated on Fri, Sep 15 2023 2:23 PM

Asia Cup Pak vs SL: Babar Almost In Tears Pics Go Viral After Heartbreaking Loss - Sakshi

కన్నీళ్లు పెట్టుకున్న బాబర్‌ ఆజం!(PC: Twitter)

Asia Cup 2023- Sri Lanka Eliminate Pakistan: వరుసగా రెండోసారి ఆసియా కప్‌ ఫైనల్‌ చేరాలన్న పాకిస్తాన్‌ ఆశలపై  శ్రీలంక నీళ్లు చల్లింది. గతేడాది టీ20 ఫార్మాట్లో నిర్వహించిన టోర్నీలో పాక్‌ను ఓడించి చాంపియన్‌గా నిలిచిన దసున్‌ షనక సేన.. ఈసారి ఆ జట్టును కనీసం ఫైనల్‌ కూడా చేరవనివ్వలేదు. సొంతగడ్డపై ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగి.. కొలంబోలో బాబర్‌ ఆజం బృందంపై పైచేయి సాధించింది. టీమిండియాతో పాటు తుదిపోరుకు అర్హత సాధించింది.

అఫ్గన్‌ను క్లీన్‌స్వీప్‌ చేసిన జోష్‌లో
మొత్తంగా 12 సార్లు(11 వన్డే, ఒక టీ20) ఫైనల్‌ చేరి చరిత్ర సృష్టించింది. కాగా ఈ వన్డే టోర్నీ ఆరంభానికి ముందు శ్రీలంక వేదికగా పాకిస్తాన్‌ అఫ్గనిస్తాన్‌తో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ ఆడిన విషయం తెలిసిందే. ఆసియా కప్‌ సన్నాహకాల్లో భాగంగా జరిగిన ఈ సిరీస్‌లో అఫ్గన్‌ను 3-0తో క్లీన్‌స్వీప్‌ చేసింది పాకిస్తాన్‌.

నేపాల్‌పై ఘన విజయం.. భారత్‌ చేతిలో ఘోర పరాభవం
ఇక ముల్తాన్‌ వేదికగా ఈవెంట్‌ ఆరంభ మ్యాచ్‌లో నేపాల్‌పై ఏకంగా 238 పరుగులతో గెలుపొంది అన్ని శుభసూచకాలే అని మురిసిపోయింది. అయితే, లీగ్‌ దశలో టీమిండియాతో మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దు కావడం.. సూపర్‌-4లో బంగ్లాదేశ్‌పై గెలిచినా.. భారత జట్టులో చేతిలో భారీ ఓటమి పాక్‌ అవకాశాలను సంక్లిష్టం చేసింది.

కీలక ఆటగాళ్లు దూరమైనా ఆఖరి వరకు
ఈ క్రమంలో ఫైనల్‌ చేరాలంటే శ్రీలంకతో తాడోపేడో తేల్చుకోవాల్సిన మ్యాచ్‌లో శక్తిమేర ప్రయత్నించింది. కీలక పేసర్లు హ్యారిస్‌ రవూఫ్‌, నసీం షా జట్టుకు దూరమైనా.. ఆఖరి ఓవర్‌ వరకు మ్యాచ్‌ను తీసుకురాగలిగింది. 

ప్చ్‌.. ఎంతగా పోరాడినా ఫలితం లేదు
అయితే, వరణుడి కారణంగా 42 ఓవర్లకు కుదించిన మ్యాచ్‌లో.. 252 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో.. లంక ఆల్‌రౌండర్‌ చరిత్‌ అసలంక ఏమాత్రం తడ‘బ్యా’టుకు లోనుకాలేదు. గెలవాలంటే ఆఖరి బంతికి రెండు పరుగులు రాబట్టాల్సిన తరుణంలో సరిగ్గా 2 రన్స్‌ తీసి లంకను ఫైనల్‌కు తీసుకెళ్లాడు.

దీంతో పాకిస్తాన్‌ ఆటగాళ్ల హృదయాలు ముక్కలయ్యాయి. ఐసీసీ వన్డే నంబర్‌ 1 బ్యాటర్‌, పాక్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజం ఈ ఓటమిని జీర్ణించుకోలేకపోయాడు. ఆఖరి వరకు పోరాడినా ఫలితం లేకపోవడంతో తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. ఈ నేపథ్యంలో అతడు కన్నీటి పర్యంతమైనట్లుగా ఉన్న ఫొటో, వీడియోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.

బాబర్‌కు ఇది అలవాటే!
బాబర్‌ ఆజం సారథ్యంలో పాకిస్తాన్‌ టీ20 వరల్డ్‌కప్‌-2021లో సెమీస్‌లోనే ఇంటిబాట పట్టింది. గతేడాది ఆసియా కప్‌లో రన్నరప్‌గా నిలిచింది. అదే విధంగా టీ20 ప్రపంచకప్‌లో ఫైనల్లో ఇంగ్లండ్‌ చేతిలో ఓడిపోయింది. ఈసారి సూపర్‌-4 దశలోనే ఆసియా కప్‌ ప్రయాణాన్ని ముగించింది. దీంతో కీలక టోర్నీల్లో బాబర్‌ జట్టును గెలిపించలేడనే అపవాదు మూటగట్టుకుంటున్నాడు.

చదవండి: మరీ చెత్తగా.. అందుకే ఓడిపోయాం.. వాళ్లిద్దరు అద్భుతం: బాబర్‌ ఆజం    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement