మరీ చెత్తగా.. అందుకే ఓడిపోయాం.. వాళ్లిద్దరు అద్భుతం: బాబర్‌ ఆజం | Asia Cup 2023, Pak Vs SL: Not Up To Mark With Bowling, Fielding Thats Why We Lost, Says Babar | Sakshi
Sakshi News home page

Babar Azam: అందుకే బంతిని అతడి చేతికి ఇచ్చాను.. కానీ ఓడిపోయాం! అవే మా కొంప ముంచాయి..

Published Fri, Sep 15 2023 8:45 AM | Last Updated on Fri, Sep 15 2023 9:17 AM

Asia Cup Pak Vs SL Babar: Not Up To Mark With Bowling Fielding Thats Why We Lost - Sakshi

లంక చేతిలో ఓడి ఇంటిబాట పట్టిన పాకిస్తాన్‌ (PC: PCB)

Asia Cup, 2023- Pakistan vs Sri Lanka- Babar Azam Comments On Loss: ఆసియా కప్‌-2023 టోర్నీలో పాకిస్తాన్‌ ప్రయాణం ముగిసింది. చివరి ఓవర్‌ వరకు నువ్వా- నేనా అన్నట్లు సాగిన గురువారం నాటి మ్యాచ్‌లో శ్రీలంక చేతిలో బాబర్‌ ఆజం బృందం ఓడిపోయింది. కొలంబోలో లంక చేతిలో 2 వికెట్ల తేడాతో పరాజయం పాలై ఈ వన్డే ఈవెంట్‌ నుంచి నిష్క్రమించింది.

ఈ నేపథ్యంలో ఓటమిపై స్పందించిన పాకిస్తాన్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజం.. శ్రీలంక జట్టు తమ కంటే మెరుగ్గా ఆడిందని.. అందుకే గెలుపు వారినే వరించిందని పేర్కొన్నాడు. చావోరేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్‌లో తమ బౌలింగ్‌, ఫీల్డింగ్‌ పేలవంగా సాగిందని అందుకే ఓడిపోయామని తెలిపాడు.

వాళ్లిద్దరు అద్భుతంగా ఆడి
లంక బ్యాటర్లు కుశాల్‌ మెండిస్‌, సమరవిక్రమ అద్భుతమైన భాగస్వామ్యం నమోదు చేసి మ్యాచ్‌ను తమ నుంచి లాగేసుకున్నారని బాబర్‌ ఆజం చెప్పుకొచ్చాడు. ‘‘మేము ఆరంభంలో.. మ్యాచ్‌ చివర్లో మెరుగ్గా రాణించగలుగుతున్నాం. కానీ మిడిల్‌ ఓవర్లలో సరిగ్గా ఆడలేకపోతున్నాం.

ఈ రెండే కొంప ముంచాయి
ఈరోజు కూడా అదే జరిగింది. మిడిల్‌ ఓవర్లలో మా బౌలింగ్‌ అస్సలు బాలేదు. ఫీల్డింగ్‌ కూడా స్థాయికి తగ్గట్లు లేదు. ఈ రెండు కారణాల వల్ల మేము భారీ మూల్యం చెల్లించాల్సి వచ్చింది’’ అని బాబర్‌ ఆజం లంక చేతిలో తాము ఓడిపోవడానికి గల కారణాలు విశ్లేషించాడు.

అందుకే బంతిని అతడి చేతికి ఇచ్చాను
ఇక ఆఖరి ఓవర్లో బాల్‌ను వన్డే అరంగేట్ర బౌలర్‌కు ఇవ్వడంపై స్పందిస్తూ.. ‘‘ చివరి ఓవర్‌ వరకు పోరాటం కొనసాగించే క్రమంలో.. ఆఖర్లో అత్యుత్తమ బౌలర్లనే బరిలోకి దించాలని భావించాను.

అందుకే సెకండ్‌ లాస్ట్‌ ఓవర్లో బంతిని షాహిన్‌ ఆఫ్రిది చేతికి ఇచ్చాను. ఫైనల్‌ ఓవర్లో జమాన్‌ ఖాన్‌పై నమ్మకం ఉంచాను. అయితే, శ్రీలంక మా కంటే మెరుగ్గా ఆడి విజయం సాధించింది’’ అని బాబర్‌ ఆజం ఓటమిని అంగీకరించాడు.

శ్రీలంక అసాధారణ పోరాటం.. ఫైనల్లో టీమిండియాతో
కాగా ఆసియా కప్‌-2023 సూపర్‌-4 దశలో తమ ఆఖరి మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన పాకిస్తాన్‌ తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. వర్షం కారణంగా 42 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో 7 వికెట్లు కోల్పోయి 252 పరుగులు చేసింది. వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ మహ్మద్‌ రి​జ్వాన్‌ 86 పరుగులు(నాటౌట్‌) పాక్‌ ఇన్నింగ్స్‌లో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు.

ఇక లక్ష్య ఛేదనకు దిగిన శ్రీలంక ఆదిలోనే వికెట్లు కోల్పోయినా.. వన్‌డౌన్‌ బ్యాటర్‌, వికెట్‌ కీపర్‌ కుశాల్‌ మెండిస్‌ 91 పరుగులతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. సమరవిక్రమ 48, ఆఖరి వరకు క్రీజులో ఉన్న చరిత్‌ అసలంక 49 పరుగులతో రాణించారు.

42వ ఓవర్‌ చివరి బంతికి జమాన్‌ ఖాన్‌ వేసిన బాల్‌కు రెండు పరుగులు తీసిన లంక ఆటగాళ్లు జట్టు ఫైనల్‌ బెర్తును ఖరారు చేశారు. సెప్టెంబరు 17న టీమిండియా- శ్రీలంక మధ్య ఫైనల్‌ మ్యాచ్‌ జరుగనుంది.

చదవండి: Ind Vs Ban: జోరు కొనసాగించేందుకు... అయ్యర్‌ బరిలోకి... 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement