ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా ఇవాళ (నవంబర్ 2) శ్రీలంక.. టీమిండియాతో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో భారత్ శ్రీలంకను ఓడించి, అధికారికంగా సెమీస్ బెర్త్ ఖరారు చేసుకోవాలని భావిస్తుంది. ఆసియా కప్-2023 ఫైనల్లో ఫలితాన్నే (సిరాజ్ (7-1-21-6) చెలరేగడంతో భారత్ 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది) ఈ మ్యాచ్‌లోనూ పునరావృతం చేయాలని భారత ఆటగాళ్లు భావిస్తున్నారు.
మరోవైపు లంక సైతం ఈ మ్యాచ్‌లో భారత్‌ను ఓడించాలని పట్టుదలగా ఉంది. గత మ్యాచ్‌లో పసికూన ఆఫ్ఘనిస్తాన్ చేతిలో ఓడిన లంకేయులు ఈ మ్యాచ్‌లో ఎలాగైనా భారత్‌ను ఓడించి పరువు నిలుపుకోవాలని అనుకుంటున్నారు. హ్యాట్రిక్ ఓటముల అనంతరం రెండు విజయాలు, ఆతర్వాత ఆఫ్ఘనిస్తాన్ చేతిలో పరాభవం.. ప్రస్తుత వరల్డ్‌కప్‌లో శ్రీలంక ప్రస్తానం ఇలా సాగింది. శ్రీలంక ఇవాల్టి మ్యాచ్‌లో భారత్‌ను ఓడించినప్పటికీ ఆ జట్టుకు ఒరిగేదేమీ ఉండదు. ఆ జట్టు ఆరు మ్యాచ్‌ల్లో కేవలం రెండే విజయాలతో నిష్క్రమణకు (సెమీస్‌కు చేరకుండా) దగ్గరగా ఉంది.
సమంగా ఇరు జట్లు..
ప్రపంచకప్‌లో ఇరు జట్లు 9 సార్లు ఎదురెదురుపడగా.. భారత్ 4, శ్రీలంక 4 విజయాలతో సమంగా ఉన్నాయి. ఓ మ్యాచ్‌లో ఫలితం రాలేదు.
బ్యాటింగ్‌కు అనుకూలం..
వాంఖడే పిచ్ బ్యాటింగ్‌కు స్వర్గధామమని చెప్పవచ్చు. ఇక్కడ తొలుత బ్యాటింగ్ చేసే జట్లు 350కు పైగా పరుగులు చేసే అవకాశం ఉంది. కాబట్టి టాస్ గెలిచిన జట్టు ఏమాత్రం అలోచించకుండా బ్యాటింగ్ ఎంచుకుంటుంది.
జట్టులోకి ఇషాన్..?
శ్రీలంకతో మ్యాచ్ కోసం టీమిండియా ఓ మార్పు చేసే అవకాశం ఉంది. గతకొన్ని మ్యాచ్‌లుగా విఫలమవుతున్న శ్రేయస్ అయ్యర్ స్థానంలో ఇషాన్ కిషన్‌ను ఆడించే ఛాన్స్ ఉంది.
కాగా, ప్రస్తుత ప్రపంచకప్‌లో టీమిండియా డబుల్ హ్యాట్రిక్ విజయాలతో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. భారత్ వరుసగా ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్, ఇంగ్లండ్‌లపై విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతుంది.
Comments
Please login to add a commentAdd a comment