వచ్చే నెలలో శ్రీలంకతో జరగనున్న టెస్ట్ సిరీస్ కోసం 18 మంది సభ్యుల భారత జట్టును నిన్న (ఫిబ్రవరి 19) ప్రకటించిన విషయం తెలిసిందే. రోహిత్ శర్మ సారధిగా, జస్ప్రీత్ బుమ్రా వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్న ఈ జట్టుకు కీలక ఆటగాళ్లైన రహానే, పుజారా, ఇషాంత్ శర్మ, సాహా లను ఎంపిక చేయకుండా కొత్త కుర్రాళ్లకు అవకాశం కల్పించడంపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఫామ్ లేమి కారణంగా చూపి సీనియర్లను పక్కకు పెట్టిన సెలెక్షన్ కమిటీ.. దేశవాళీ టోర్నీల్లో రాణిస్తున్న యువ ఆటగాళ్లను కూడా పట్టించుకోకపోడంపై సెలెక్షన్ కమిటీ మాజీ చైర్మన్, టీమిండియా మాజీ కెప్టెన్ దిలీప్ వెంగ్‌సర్కార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. జట్టు ఎంపిక విధానంలో సెలెక్టర్లు అనుసరించిన తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డాడు.
చేతన్ శర్మ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ వివేకంగా ఆలోచించలేదని తీవ్రమైన వ్యాఖ్యలు చేశాడు. దేశవాళీ టోర్నల్లో పరుగుల వరద పారిస్తున్న రుతురాజ్ గైక్వాడ్, సర్ఫరాజ్ ఖాన్‌లను ఎలా పక్కనబెడతారని ప్రశ్నించాడు. ప్రస్తుతం ఎంపిక చేసిన జట్టులో కొందరికి టాలెంట్ ఉన్నా ఆమేరకు రాణించలేకపోతున్నారని, అలాంటి వారిని టీమిండియాకు ఎంపిక చేయడం కరెక్ట్ కాదని అభిప్రాయపడ్డాడు. రుతురాజ్, సర్ఫరాజ్ ఖాన్ లు ఇద్దరూ టీమిండియాలో ఉండాల్సిన వాళ్లని, సెలెక్టర్లు వారిని ఎంపిక చేయకుండా వారిద్దరి నైతికతను దెబ్బతీస్తున్నారని వాపోయాడు.
కాగా, రుతురాజ్.. గతేడాది ఐపీఎల్‌లో ఆరెంజ్ క్యాప్ గెలవడంతో పాటు ఆ తర్వాత జరిగిన విజయ్ హజారే ట్రోఫీలోనూ (నాలుగు సెంచరీలతో 600కు పైగా పరుగులు) పరుగుల వరద పారించిన విషయం తెలిసిందే. సర్ఫరాజ్ విషయానికొస్తే.. గతేడాది ముస్తాక్ అలీ టోర్నీతో పాటు ప్రస్తుతం జరగుతున్న రంజీల్లో అతను నిలకడగా రాణిస్తున్నాడు. తాజాగా సౌరాష్ట్రతో జరిగిన మ్యాచ్‌లో ఏకంగా 275 పరుగులు చేసినప్పటికీ సెలెక్టర్లు సర్ఫరాజ్‌ను పట్టించుకోలేదు. పై పేర్కొన్న గణాంకాలను ప్రస్తావిస్తూ వెంగ్‌సర్కార్ సెలెక్టర్ల తీరును ఎండగట్టాడు. ఇదిలా ఉంటే, శ్రీలంక జట్టు భారత పర్యటనలో 3 టీ20లతో పాటు 2 టెస్ట్ మ్యాచ్‌లు ఆడనున్న సంగతి తెలిసిందే.
శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌కు భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), జస్ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), మయాంక్ అగర్వాల్, ప్రియాంక్ పంచల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, హనుమ విహారి, శుబ్‌మన్ గిల్, రిషబ్ పంత్, కేఎస్ భరత్, ఆర్ అశ్విన్, రవీంద్ర జడేజా, జయంత్ యాదవ్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, ఉమేశ్ యాదవ్, సౌరబ్ కుమార్
చదవండి: ఐపీఎల్ ప్రారంభానికి ముహూర్తం ఖరారు.. ఎప్పటి నుంచి అంటే!
Comments
Please login to add a commentAdd a comment