నిప్పులు చెరిగిన మార్క్‌ వుడ్‌.. ఇంగ్లండ్ క్రికెట్‌ చరిత్రలో ఫాస్టెస్ట్‌ ఓవర్‌ | ENG VS WI: Mark Wood Bowls Fastest Test Over By England bowler At Home | Sakshi
Sakshi News home page

ENG VS WI 2nd Test: నిప్పులు చెరిగిన మార్క్‌ వుడ్‌.. ఇంగ్లండ్ క్రికెట్‌ చరిత్రలో ఫాస్టెస్ట్‌ ఓవర్‌

Published Fri, Jul 19 2024 7:46 PM | Last Updated on Fri, Jul 19 2024 8:12 PM

ENG VS WI: Mark Wood Bowls Fastest Test Over By England bowler At Home

ఇంగ్లండ్‌ స్పీడ్‌ గన్‌ మార్క్‌ వుడ్‌ వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌ మ్యాచ్‌లో విశ్వరూపం ప్రదర్శించాడు. ఈ మ్యాచ్‌ తొలి ఓవర్‌లో వుడ్‌ బుల్లెట్‌ లాంటి బంతులతో నిప్పులు వర్షం కురిపించాడు. ఇంగ్లండ్‌ క్రికెట్‌ చరిత్రలోనే ఇది ఫాస్టెస్ట్‌ ఓవర్‌గా (సగటున గంటకు 94.40 మైళ్ల వేగం) రికార్డైంది. ఈ ఓవర్‌లో (93.9, 96.1, 95.2, 92.2, 96.5, 95.2) వుడ్‌ ప్రతి బంతిని 90 మైళ్లకు పైగా వేగంతో సంధించాడు.

వుడ్‌ తన మరుసటి ఓవర్‌లో మరింత చెలరేగిపోయాడు. ఈ ఓవర్‌లో ఓ బంతిని ఏకంగా 97.1 మైళ్ల వేగంతో సంధించాడు. వుడ్‌ ఈ ఓవర్‌లోనూ (95, 93, 95, 96, 97.1, 94) ప్రతి బంతిని 90 మైళ్లకు పైగా వేగంతో విసిరాడు. వుడ్‌ సరిగ్గా ఏడాది క్రితం ఇదే రోజున ఇంచుమించు ఇలాంటి వేగంతో ఓ ఓవర్‌ వేశాడు. 2023 జులై 19న ఆస్ట్రేలియాతో జరిగిన హెడింగ్లే టెస్ట్‌లో వుడ్‌ 92.8, 90.2, 92.5, 92.5, -, 91.6 మైళ్ల వేగంతో బంతులను సంధించాడు.

ప్రస్తుతం తరం బౌలర్లలో ఫాస్టెస్ట్‌ బౌలర్‌గా గుర్తింపు ఉన్న వుడ్‌.. తన కెరీర్‌లో ఫాస్టెస్ట్‌ బాల్‌ను 2022లో పాకిస్తాన్‌పై విసిరాడు. నాడు ముల్తాన్‌ టెస్ట్‌లో వుడ్‌ గంటకు 98 మైళ్ల వేగంతో బంతిని సంధించాడు. ఇదే అతని కెరీర్‌లో ఫాస్టెస్ట్‌ డెలివరీ. ఓవరాల్‌గా క్రికెట్‌ చరిత్రలో ఫాస్టెస్ట్‌ డెలివరీ రికార్డు పాక్‌ మాజీ స్పీడ్‌స్టర్‌ షోయబ్‌ అక్తర్‌ పేరిట ఉంది. 2003 వరల్డ్‌కప్‌లో అక్తర్‌.. సౌతాఫ్రికాపై ఓ బంతిని 100.23 మైళ్ల వేగంతో సంధించాడు.

మ్యాచ్‌ విషయానికొస్తే.. ట్రెంట్‌బ్రిడ్జ్‌ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 416 పరుగులకు ఆలౌటైంది. ఓలీ పోప్‌ (121) సెంచరీ.. బెన్‌ డకెట్‌ (71), బెన్‌ స్టోక్స్‌ (69) అర్ద సెంచరీలతో సత్తా చాటారు. విండీస్‌ బౌలర్లలో అల్జరీ జోసఫ్‌ 3, జేడన్‌ సీల్స్‌, కెవిన్‌ సింక్లెయిర్‌, కవెమ్‌ హాడ్జ్‌ తలో 2, షమార్‌ జోసఫ్‌ ఓ వికెట్‌ పడగొట్టారు.

రెండో రోజు తొలి ఇన్నింగ్స్‌ ప్రారంభించిన వెస్టిండీస్‌.. 46 ఓవర్ల అనంతరం 3 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. క్రెయిగ్‌ బ్రాత్‌వైట్‌ 48, మికైల్‌ లూయిస్‌ 21, కిర్క్‌ మెక్‌కెంజీ 11 పరుగులు చేసి ఔట్‌ కాగా..అలిక్‌ అథనాజ్‌ 48, కవెమ్‌ హాడ్జ్‌ 37 పరుగుతో క్రీజ్‌లో ఉన్నారు. ఇంగ్లండ్‌ బౌలర్లలో షోయబ్‌ బషీర్‌ 2, అట్కిన్సన్‌ ఓ వికెట్‌ పడగొట్టారు. వెస్టిండీస్‌.. ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌ స్కోర్‌కు ఇంకా 246 పరుగులు వెనుకపడి ఉంది. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement