
Courtesy: IPL
Gautam Gambhir And Graeme Swann Rage At 3rd umpire Decision: ఐపీఎల్‌లో 2021లో నిష్క్రమణ చేరువగా వచ్చిన దశలో పంజాబ్ కింగ్స్‌కు కీలక విజయం దక్కింది. శుక్రవారం దుబాయ్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ 5 వికెట్ల తేడాతో కోల్‌కతాపై విజయం సాధించింది. దీంతో పంజాబ్ కింగ్స్ ప్లే ఆఫ్స్ రేసులో నిలిచింది. కాగా, పంజాబ్ ఇన్నింగ్స్ 19వ ఓవర్‌లో కేఎల్ రాహుల్ భారీ షాట్‌కు ప్రయత్నించగా అది మిస్ టైమ్ అయ్యింది. దీంతో రాహుల్ త్రిపాఠి పరిగెత్తుతూ అద్భుతంగా క్యాచ్ పట్టాడు. అయితే ఫీల్ఢ్ అంపైర్ సాఫ్ట్ సిగ్నల్ నాటౌట్‌గా ప్రకటించి థర్డ్ అంపైర్‌కు రిఫర్ చేశాడు.
ఈ క్రమంలో ఒకే కోణంలో పరిశీలించిన థర్డ్ అంపైర్ ఫీల్ఢ్ అంపైర్ సాఫ్ట్ సిగ్నల్ ఆధారంగా నాటౌట్ ప్రకటించాడు. అయితే రీప్లేలో బాల్ కింద త్రిపాఠి చేతివేళ్లు ఉన్నట్టు క్లియర్‌గా కనిపించింది. దీంతో థర్డ్ అంపైర్ తీసుకున్న నిర్ణయం ప్రస్తుతం వివాదాస్పదంగా మారింది. అది క్లియర్గా ఔట్ అని తెలిసినా.. ఇవ్వలేదని సీనియర్ క్రికెటర్ల దగ్గర నుంచి నెటిజెన్ల వరకు అందరూ మండిపడుతున్నారు. ఈ విషయంపై భారత మాజీ ఆటగాడు గౌతం గంభీర్, ఇంగ్గండ్ మాజీ స్పిన్నర్ గ్రేమ్ స్వాన్ ఘాటుగా స్పందించారు. థర్డ్ అంపైర్ నిర్ణయం షాక్‌కు గురి చేసిందిని గంభీర్ తెలిపాడు.
"అది నిజంగా ఒక షాకింగ్ నిర్ణయం. అది క్లియర్గా ఔట్. అతడు ఒకటి కంటే ఎక్కువసార్లు రీప్లేని కూడా చూడాల్సిన అవసరం లేదు. స్లో-మోషన్ కూడా అవసరం లేదు. ఎందుకంటే.. అది క్లియర్‌గా కనిపిస్తుంది. చివరి ఓవర్లలో పంజాబ్ కాస్త ఒత్తిడికి గురి అవుతున్నట్లు కనిపించింది. ముఖ్యంగా ఐపీఎల్ లాంటి మేజర్ లీగ్‌లో ఇలా జరగకూడదు. ఇది ఆటగాడికి మాత్రమే కాకుండా మొత్తం ఫ్రాంచైజీకి నష్టం కలిగించవచ్చు " అని గంభీర్ స్టార్ స్పోర్ట్స్ షోలో చెప్పాడు.
అదే విధంగా గ్రేమ్ స్వాన్ మాట్లడూతూ.. ఇప్పటి వరకు తను చూసిన థర్డ్ అంపైరింగ్ చెత్త నిర్ణయాల్లో ఇది ఒకటి అని అతడు విమర్శించాడు. "నేను నా జీవితంలో చూసిన అత్యంత దారుణమైన థర్డ్ అంపైరింగ్ నిర్ణయాల్లో ఇది ఒకటి. అది క్లియర్గా ఔట్ అని తెలుస్తోంది. త్రిపాఠి అద్భుతమైన రన్నింగ్ క్యాచ్ తీసుకున్నాడు." అని స్వాన్ పేర్కొన్నాడు. కాగా కెప్టెన్ కేఎల్ రాహుల్ (67), మయాంక్ అగర్వాల్ (40) రాణించడంతో కోల్‌కతా నిర్దేశించిన 166 పరుగుల లక్ష్యాన్ని పంజాబ్ 19.3 ఓవర్‌లలోనే 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది.
చదవండి: Virender Sehwag: ‘ఇక చాలు... ఈసారి ముంబై అస్సలు పైకి రావొద్దు’