ఐసీసీ తాజాగా విడుదల చేసిన టెస్ట్ బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో ఇంగ్లండ్ స్టార్ ఆటగాడు హ్యారీ బ్రూక్ రెండో స్థానానికి ఎగబాకాడు. బ్రూక్.. టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్‌ను వెనక్కు నెట్టి ఈ స్థానానికి చేరుకున్నాడు. గడిచిన వారంలో బ్రూక్, జైస్వాల్ ఇద్దరూ మంచి ప్రదర్శనలే చేసినప్పటికీ.. ర్యాంకింగ్స్‌లో మాత్రం బ్రూక్ ముందుకెళ్లాడు.
ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్ట్‌లో యశస్వి 161 పరుగుల ఇన్నింగ్స్ ఆడగా.. న్యూజిలాండ్‌తో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో బ్రూక్ 171 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. తాజా ర్యాంకింగ్స్‌లో యశస్వి ర్యాంక్ దిగజారినప్పటికీ అతని రేటింగ్ పాయింట్లు మాత్రం మెరుగుపడ్డాయి.
మరోవైపు ఆస్ట్రేలియాతోనే జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్‌లో విరాట్ కోహ్లి సైతం సెంచరీ చేసినప్పటికీ ఓ ర్యాంక్ కోల్పోయి 14వ స్థానానికి పడిపోయాడు. శ్రీలంకతో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్‌లో సెంచరీ, ఓ హాఫ్ సెంచరీ చేసిన సౌతాఫ్రికా ఆటగాడు టెంబా బవుమా ఏకంగా 14 స్థానాలు మెరుగపర్చుకుని 10వ స్థానానికి చేరుకున్నాడు.
ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ జో రూట్ అగ్రస్థానాన్ని నిలబెట్టుకోగా.. న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్ మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. లంక ఆటగాడు కమిందు మెండిస్ రెండు స్థానాలు మెరుగుపర్చుకుని ఏడో స్థానానికి చేరుకోగా.. భారత్ తరఫున రిషబ్ పంత్ ఆరో నంబర్ ఆటగాడిగా కొనసాగుతున్నాడు.
బౌలింగ్ ర్యాంకింగ్స్ విషయానికొస్తే.. టీమిండియా పేసు గుర్రం జస్ప్రీత్ బుమ్రా టాప్ ప్లేస్‌లో కొనసాగుతుండగా.. రబాడ, హాజిల్‌వుడ్, అశ్విన్ టాప్-4లో ఉన్నారు. తాజా ర్యాంకింగ్స్‌లో కమిన్స్, రవీంద్ర జడేజా, నాథన్ లయోన్ తలో స్థానం మెరుగుపర్చుకుని 5, 6, 7 స్థానాలకు చేరుకోగా.. దక్షిణాఫ్రికా పేసర్ మార్కో జన్సెన్ ఏకంగా 19 స్థానాలు మెరుగుపర్చుకుని 9వ స్థానానికి ఎగబాకాడు.
జన్సెన్ ఇటీవల శ్రీలంకతో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో 10 వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు. టెస్ట్ ఆల్‌రౌండర్ల విషయానికొస్తే.. రవీంద్ర జడేజా టాప్‌లో కొనసాగుతుండగా.. జన్సెన్ 10 స్థానాలు మెరుగుపర్చుకుని రెండో స్థానానికి ఎగబాకాడు. అశ్విన్ మూడో స్థానానికి పడిపోయాడు.
Comments
Please login to add a commentAdd a comment