Dinesh Karthik Backs Surya Kumar Yadav: దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో వన్డేలో టీమిండియా ఆఖరి వరకు పోరాడి 4 పరుగుల తేడాతో ఓటమి పాలైన సంగతి తెలిసిందే. ఫలితంగా మూడు వన్డేల సిరీస్‌ను భారత్.. 0-3 తేడాతో చేజార్చుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 287 పరుగులకు ఆలౌట్ కాగా.. టీమిండియా మరో నాలుగు బంతులు మిగిలుండగానే 283 పరుగుల వద్ద ఆలౌటైంది. ధవన్(61), కోహ్లి(65), దీపక్ చాహర్(54) అర్ధ సెంచరీలు చేయగా.. సిరీస్‌లో తొలి మ్యాచ్ ఆడిన సూర్యకుమార్ యాదవ్(32 బంతుల్లో 39; 4 ఫోర్లు, సిక్స్) పర్వాలేదనిపించాడు.
కాగా, ఈ మ్యాచ్‌లో సూర్యకుమార్ బ్యాటింగ్ చేసిన విధానంపై టీమిండియా వెటరన్ వికెట్‌కీపర్ దినేశ్ కార్తీక్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సూర్య.. అద్భుతమైన టచ్‌లో ఉన్నట్లు కనిపించాడని, అతనాడిన షాట్లను చూస్తే అతను భూమిపై ఆడుతున్నాడా..? లేక ఇతర గ్రహంపై ఆడుతున్నాడా అన్నట్లు అనిపించిందని వ్యాఖ్యానించాడు. నాలుగు వికెట్లు పడిపోయిన కీలక తరుణంలో వచ్చి 120కి పైగా స్ట్రయిక్ రేట్‌తో అద్భుతమైన షాట్లు ఆడుతూ.. జట్టును గెలిపించేలా కనిపించాడని కితాబునిచ్చాడు. అయితే దురదృష్టవశాత్తు అతను ఔట్ కావడం, ఆఖర్లో దీపక్ చాహర్‌కు సరైన సహకారం లభించకపోవడం, టీమిండియా స్వల్ప తేడాతో ఓడిపోవడం జరిగిందన్నాడు.
అయితే ఈ మ్యాచ్‌లో కూడా సూర్య గతంలో మాదిరే ఎంతో కాన్ఫిడెంట్‌గా కనిపించాడని, అద్భుతమైన భంగిమల్లో పర్ఫెక్ట్ షాట్లు ఆడాడని, ఒత్తిడి ఛాయలు కనబడకుండా కూల్‌గా ఆడాడని కొనియాడాడు. ఈ విషయాన్ని జట్టు యాజమాన్యం గమనించాలని, అకారణంగా అతన్ని జట్టు నుంచి తప్పించకుండా తగినన్ని అవకాశాలు కల్పిస్తే ఊహకందని అద్భుతాలు చేస్తాడని ఆశాభావం వ్యక్తం చేశాడు.
కాగా, టీమిండియా తరఫున 4 వన్డేలు, 11 టీ20లు ఆడిన సూర్యకుమార్.. జట్టులో స్థిరమైన స్థానం కోసం గత కొంతకాలంగా తీవ్రమైన పోటీని ఎదుర్కొంటున్నాడు. అతని స్థానానికి యువ ఆటగాళ్ల నుంచి తీవ్ర పోటీ నెలకొంది. దక్షిణాఫ్రికాతో సిరీస్‌లో ఆల్‌రౌండర్ కోటాలో వెంకటేశ్ అయ్యర్ జట్టులోకి రావడంతో సూర్యకుమార్‌కు తొలి రెండు వన్డేల్లో అవకాశం రాలేదు.
చదవండి: దక్షిణాఫ్రికా చేతిలో ఓటమిపై టీమిండియా హెడ్ కోచ్ కీలక వ్యాఖ్యలు
Comments
Please login to add a commentAdd a comment