
విరాట్ కోహ్లి (PC: BCCI)
Ind vs Afg 3rd T20- Virat Kohli On Cusp Of Becoming...: సమకాలీన క్రికెటర్లకు ఎవరికీ సాధ్యం కాని రీతిలో ఇప్పటికే ఎన్నెన్నో ఘనతలు సాధించాడు టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి. అఫ్గనిస్తాన్‌తో మూడో టీ20 సందర్భంగా ఈ రన్‌మెషీన్‌ను మరో అరుదైన రికార్డు ఊరిస్తోంది.
రీఎంట్రీలో దూకుడుగా
కాగా టీ20 ప్రపంచకప్-2022 తర్వాత దాదాపు పద్నాలుగు నెలల విరామం అనంతరం కోహ్లి అంతర్జాతీయ టీ20లలో పునరాగమనం చేశాడు. స్వదేశంలో అఫ్గనిస్తాన్‌తో సిరీస్‌కు అందుబాటులోకి వచ్చాడు. మొహాలీ వేదికగా తొలి టీ20తోనే బరిలోకి దిగాల్సి ఉండగా.. కూతురు వామిక పుట్టినరోజు(జనవరి 11) నేపథ్యంలో ఆ మ్యాచ్‌కు దూరంగా ఉండిపోయాడు.
ఈ క్రమంలో ఇండోర్‌లో ఆదివారం నాటి రెండో టీ20 సందర్భంగా రంగంలోకి దిగిన విరాట్ కోహ్లి.. 16 బంతుల్లో 29 పరుగులతో ఆకట్టుకున్నాడు. క్రీజులో ఉన్నది కాసేపే అయినా దూకుడుగా ఆడుతూ అఫ్గన్ బౌలర్లపై విరుచుకుపడుతూ అభిమానులకు వినోదాన్ని పంచాడు.
ఐపీఎల్ హోం గ్రౌంగ్‌లో సిక్స్‌తో ఆరంభిస్తే
ఇక ఇప్పటికే ఈ సిరీస్‌ను టీమిండియా 2-0తో గెలుచుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బెంగళూరులో బుధవారం నాటి నామమాత్రపు మూడో టీ20కి ఇరు జట్లు సన్నద్ధమవుతున్నాయి. విరాట్ కోహ్లికి ఐపీఎల్‌లో హోం గ్రౌండ్ అయిన చిన్నస్వామి స్టేడియం ఇందుకు వేదిక.
ఈ మ్యాచ్ సందర్భంగా విరాట్ కోహ్లి ఆరు పరుగులు సాధిస్తే.. టీ20 ఫార్మాట్లో 12 వేల పరుగుల మైలురాయిని అందుకుంటాడు. తద్వారా ఈ ఘనత సాధించిన మొట్టమొదటి భారత క్రికెటర్‌గా చరిత్ర సృష్టిస్తాడు. ఓవరాల్‌గా ఈ జాబితాలో క్రిస్ గేల్(14562), షోయబ్ మాలిక్(12993), కీరన్ పొలార్డ్(12430) తర్వాతి స్థానాల్లో నిలుస్తాడు.
Indore ✈️ Bengaluru#TeamIndia in town for the 3⃣rd & final T20I 👏 👏#INDvAFG | @IDFCFIRSTBank pic.twitter.com/xKKRi6yf9W
— BCCI (@BCCI) January 15, 2024
పొట్టి ఫార్మాట్లో అన్నీ కలిపి
దేశవాళీ క్రికెట్‌లో ఢిల్లీ తరఫున సయ్యద్ ముస్తాక్ అలీ(టీ20) ట్రోఫీలో భాగమైన కోహ్లి.. ఐపీఎల్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు సహా టీమిండియాకు ఆడుతూ.. అన్నీ కలిపి పొట్టి ఫార్మాట్లో పదకొండు వేలకు పైగా పరుగులు సాధించాడు.
ఇదిలా ఉంటే అంతర్జాతీయ స్థాయిలో టీ20లలో 4037 పరుగులు సాధించిన విరాట్ కోహ్లి నంబర్ వన్(అత్యధిక రన్స్) బ్యాటర్‌గా కొనసాగుతున్నాడు. అదే విధంగా.. ఐపీఎల్‌లోనూ 7263 రన్స్‌తో హయ్యస్ట్ రన్ స్కోరర్‌గా ఉన్నాడు.
చదవండి: లక్ష్యం 110.. నరాలు తెగే ఉత్కంఠ! ఏకంగా 7 వికెట్లు కూల్చి..