IND Vs AUS: నితీశ్‌ రెడ్డి ధనాధన్‌.. బౌలింగ్‌లోనూ అదుర్స్‌! బ్యాటర్‌ ఫ్యూజులు ఔట్‌ | IND Vs AUS 1st Test Day 4: Debutant Nitish Reddy Maiden Test Wicket Gets Big Fish Mitchell Marsh, Video Goes Viral | Sakshi
Sakshi News home page

IND Vs AUS: ఆసీస్‌పై నితీశ్‌ రెడ్డి ధనాధన్‌ ఇన్నింగ్స్‌.. బౌలింగ్‌లోనూ అదుర్స్‌! బ్యాటర్‌ ఫ్యూజులు ఔట్‌

Published Mon, Nov 25 2024 12:24 PM | Last Updated on Mon, Nov 25 2024 1:04 PM

Ind vs Aus Debutant Nitish Reddy Maiden Test Wicket Gets Big Fish Video

టీమిండియా యువ క్రికెటర్‌, విశాఖ కుర్రాడు నితీశ్‌ కుమార్‌ రెడ్డి అంతర్జాతీయ టెస్టుల్లో తొలి వికెట్‌ తీశాడు. ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్‌ మిచెల్‌ మార్ష్‌ను అద్భుత రీతిలో బౌల్డ్‌ చేసి.. సత్తా చాటాడు. కాగా ఐపీఎల్‌-2024లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తరఫున అదరగొట్టిన నితీశ్‌.. ఎమర్జింగ్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ది ఇయర్‌గా నిలిచిన విషయం తెలిసిందే.

ఈ క్రమంలో 21 ఏళ్ల నితీశ్‌ రెడ్డి టీమిండియా సెలక్టర్ల దృష్టిని ఆకర్షించి.. ఈ ఏడాది అక్టోబరులో అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు. బంగ్లాదేశ్‌తో సొంతగడ్డపై జరిగిన టీ20 సిరీస్‌ ద్వారా ఎంట్రీ ఇచ్చి.. మూడు మ్యాచ్‌లలో కలిపి 90 పరుగులు చేయడంతో పాటు మూడు వికెట్లు పడగొట్టాడు.

అయితే, అనూహ్య రీతిలో నితీశ్‌ రెడ్డిని సెలక్టర్లు ఆస్ట్రేలియాతో బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీ ఆడే జట్టుకు ఎంపిక చేశారు. ఇందుకు ప్రధాన కారణం నితీశ్‌కు ఉన్న అరుదైన పేస్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండ్‌ నైపుణ్యాలే! హార్దిక్‌ పాండ్యా కేవలం వన్డే, టీ20లకే పరిమితం కావడంతో టెస్టుల్లో అతడి వారసుడి కోసం టీమిండియా ఎదురుచూస్తోంది.

ముంబై ప్లేయర్‌ శార్దూల్‌ ఠాకూర్‌ కూడా పేస్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండరే అయినా.. ఆసీస్‌ టూర్‌కు మాత్రం బీసీసీఐ నితీశ్‌నే ఎంపిక చేసింది. గాయం నుంచి కోలుకున్నప్పటికీ శార్దూల్‌ను పక్కనపెట్టి.. ఈ యువ ఆటగాడికి పెద్దపీట వేసింది.

అంతేకాదు... మెగా సిరీస్‌కు నితీశ్‌ను సన్నద్ధం చేసే క్రమంలో.. భారత్‌-‘ఎ’ జట్టు తరఫున ఆడేందుకు ముందే అతడిని ఆస్ట్రేలియాకు పంపించింది. అయితే, ఆస్ట్రేలియా-‘ఎ’ జట్టుతో జరిగిన రెండు మ్యాచ్‌ల అనధికారిక టెస్టు సిరీస్‌లో నితీశ్‌ ఆకట్టుకోలేకపోయాడు. బ్యాటింగ్‌, బౌలింగ్‌లోనూ విఫలమయ్యాడు.

ఆసీస్‌తో అనధికారిక సిరీస్‌లో 71 (0, 17, 16, 38) పరుగులు మాత్రమే చేయడంతో పాటు.. ఒకే ఒక్క వికెట్‌ తీశాడు నితీశ్‌. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియాతో టెస్టుల్లో అతడిని ఆడిస్తారా? లేదా? అన్న సందేహాల నడుమ.. మేనేజ్‌మెంట్‌ మాత్రం నితీశ్‌ రెడ్డిపై నమ్మకం ఉంచింది.

ఈ క్రమంలో పెర్త్‌ వేదికగా తొలి టెస్టు సందర్భంగా నితీశ్‌ రెడ్డి.. టీమిండియా తరఫున టెస్టుల్లో అడుగుపెట్టాడు. తొలి ఇన్నింగ్స్‌లో జట్టు కష్టాల్లో ఉన్న వేళ ఆదుకోవడంతో పాటు.. రెండో ఇన్నింగ్స్‌లోనూ ధనాధన్‌ బ్యాటింగ్‌తో అలరించాడు.

మొదటి ఇన్నింగ్స్‌లో 59 బంతుల్లో 41 పరుగులతో భారత టాప్‌ స్కోరర్‌గా నిలిచిన ఈ ఆల్‌రౌండర్‌.. రెండో ఇన్నింగ్స్‌లో తన ఆరాధ్య క్రికెటర్‌ విరాట్‌ కోహ్లితో కలిసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. కేవలం 27 బంతుల్లోనే 38 పరుగులతో అజేయంగా నిలిచాడు.

ఇక సోమవారం నాటి నాలుగో రోజు ఆటలో భాగంగా నితీశ్‌ రెడ్డి టెస్టుల్లో వికెట్ల ఖాతా కూడా తెరిచాడు. ఆసీస్‌ రెండో ఇన్నింగ్స్‌లో ప్రమాదకారిగా పరిణమించిన మిచెల్‌ మార్ష్‌(47)ను నితీశ్‌ తన బౌలింగ్‌ నైపుణ్యంతో బోల్తా కొట్టించాడు.

అతడి బౌలింగ్‌లో మార్ష్‌ షాట్‌ ఆడే ప్రయత్నంలో విఫలం కాగా.. బంతి తాకి స్టంప్స్‌ ఎగిరిపడ్డాయి. దీంతో మార్ష్‌ షాకింగ్‌ రియాక్షన్‌తో క్రీజును వీడాడు. ఈ క్రమంలో ఆసీస్‌ ఏడో వికెట్‌ కోల్పోయి కష్టాల్లో పడింది. 

కాగా తొలి టెస్టులో టీమిండియా ఆసీస్‌కు 534 పరుగుల భారీ లక్ష్యం విధించింది. అయితే, ఆసీస్‌ 182 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement