
రోహిత్ శర్మ
రోహిత్ శర్మతో పాటు అతడు కూడా అవుట్.. బంగ్లాతో రెండో టెస్టుకు భారత జట్టు ఇదే
Bangladesh vs India, 2nd Test: బంగ్లాదేశ్‌తో రెండో టెస్టుకు కూడా టీమిండియా రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ దూరమయ్యాడు. అతడితో పాటు పేసర్ నవదీప్ సైనీ కూడా ఈ మ్యాచ్‌కు అందుబాటులో ఉండటం లేదు. ఈ విషయాన్ని భారత క్రికెట్ నియంత్రణ మండలి మంగళవారం ధ్రువీకరించింది.
రోహిత్ శర్మ గాయం నుంచి ఇంకా కోలుకోలేదని, ప్రస్తుతం అతడు బీసీసీఐ వైద్య బృందం పర్యవేక్షణలో ఉన్నట్లు తెలిపింది. ఈ నేపథ్యంలో రెండో టెస్టుకు కూడా కేఎల్ రాహుల్ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడని పేర్కొంది. ఇక నవదీప్ సైనీ పొట్ట కండరాల నొప్పితో బాధపడుతున్నట్లు పేర్కొన్న బీసీసీఐ.. అతడు జాతీయ క్రికెట్ అకాడమీకి వెళ్లనున్నట్లు తెలిపింది.
నవదీప్ సైనీ
రాహుల్ సారథ్యంలో..
కాగా బంగ్లాదేశ్‌తో వన్డే సిరీస్‌లో భాగంగా రెండో మ్యాచ్ సందర్భంగా రోహిత్ శర్మ గాయపడ్డ విషయం తెలిసిందే. ఎడమచేతి బొటనవేలికి గాయమైనప్పటికీ బ్యాటింగ్ చేసిన హిట్‌మ్యాన్.. నొప్పి తీవ్రతరం కావడంతో స్వదేశానికి తిరిగివచ్చాడు.
ఈ క్రమంలో మొదటి టెస్టుకు దూరమైన రోహిత్.. రెండో మ్యాచ్ నాటికి అందుబాటులోకి వస్తాడనుకున్నా అలా జరుగలేదు. ఇక కేఎల్ రాహుల్ సారథ్యంలో తొలి టెస్టులో బంగ్లాను చిత్తు చేసిన టీమిండియా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్లో చోటు దక్కించుకునే దిశగా అడుగులు వేస్తోంది. ఇదిలా ఉంటే ఫాస్ట్‌బౌలర్ నవదీప్ సైనీకి టెస్టు జట్టులో చోటు దక్కినా మొదటి మ్యాచ్‌లో ఆడే అవకాశం రాలేదు.
బంగ్లాదేశ్‌తో రెండో టెస్టుకు భారత జట్టు:
కేఎల్ రాహుల్ (కెప్టెన్), శుబ్‌మన్ గిల్, ఛతేశ్వర్ పుజారా (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), కెఎస్ భరత్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్, ఉమేష్ యాదవ్, అభిమన్యు ఈశ్వరన్, సౌరభ్ కుమార్, జయదేవ్ ఉనద్కత్.
చదవండి: Kylian Mbappe: నిండా పాతికేళ్లు లేవు.. ప్రపంచమే సలాం కొట్టింది; ఎవరీ ఎంబాపె
Babar Azam: ఇంగ్లండ్ చేతిలో ఘోర ఓటమి.. బాబర్ ఆజం చెత్త రికార్డు! మొదటి పాక్ కెప్టెన్‌గా..