
టీమిండియాతో ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌కు ముందు ఇంగ్లండ్ జట్టుకు భారీ షాక్ తగిలింది. వ్యక్తిగత కారణాల చేత ఆ జట్టు స్టార్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ సిరీస్ మొత్తం నుంచి తప్పుకున్నాడు. ఈ విషయాన్ని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు అధికారికంగా ప్రకటించింది. రూక్‌కు ప్రత్యామ్నాయంగా సర్రే ఆటగాడు డాన్ లారెన్స్‌ను ఎంపిక చేశారు ఇంగ్లండ్ సెలెక్టర్లు. బ్రూక్ కుటుంబసభ్యుల విజ్ఞప్తి మేరకు అతన్ని రిలీవ్ చేసినట్లు ఈసీబీ పేర్కొంది.
ప్రస్తుతం ఇంగ్లండ్ జట్టు భారత్‌తో సిరీస్ కోసం అబుదాబీలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సన్నాహక శిబిరంలో ఉంది. బ్రూక్ కూడా జట్టుతో పాటు అబుదాబీలోనే ఉన్నాడు. బ్రూక్‌ను తక్షణమే జట్టు నుంచి రిలీవ్ చేస్తున్నట్లు కెప్టెన్ బెన్ స్టోక్స్ తెలిపాడు. బ్రూక్ జట్టును వీడటం వల్ల ఇంగ్లండ్‌కు భారీ నష్టం వాటిల్లే అవకాశం ఉంది. బ్రూక్ మిడిలార్డర్‌లో కీలక ఆటగాడు కావడం వల్ల ఇంగ్లండ్ విజయావకాశాలకు తప్పక గండి పడుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
బ్రూక్ తన అరంగేట్రం నుంచి ఇంగ్లండ్ జట్టులో కీలక సభ్యుడిగా ఉన్నాడు. 24 ఏళ్ల బ్రూక్ 2022లో టెస్ట్ అరంగేట్రం చేసి 12 మ్యాచ్‌లు ఆడాడు. ఇందులో 4 సెంచరీలు, 7 అర్ధసెంచరీలు ఉన్నాయి. బ్రూక్ 62.1 సగటున 1181 పరుగులు చేశాడు. మూడు ఫార్మాట్లలో ఇంగ్లండ్‌కు ప్రాతినిథ్యం వహించే అతి కొద్ది మంది ఆటగాళ్లలో బ్రూక్ ఒకడు.
ఇదిలా ఉంటే, భారత్-ఇంగ్లండ్‌ల మధ్య టెస్ట్ సిరీస్ జనవరి 25 నుంచి ప్రారంభం కానుంది. హైదరాబాద్ వేదికగా తొలి టెస్ట్ జరుగనుంది. ఈ సిరీస్ కోసం ఇంగ్లండ్ జట్టును చాలా రోజుల కిందటే ప్రకటించారు. భారత్ సైతం తొలి రెండు మ్యాచ్‌లకు జట్టును ప్రకటించింది.
భారత్‌తో సిరీస్‌కు ఇంగ్లండ్ జట్టు: జాక్ క్రాలే (కెప్టెన్), బెన్ డకెట్, జో రూట్, బెన్ స్టోక్స్ (కెప్టెన్), రెహాన్ అహ్మద్, జానీ బెయిర్‌స్టో, బెన్ ఫోక్స్, ఓలీ పోప్, జేమ్స్ ఆండర్సన్, గస్ అట్కిన్సన్, షోయబ్ బషీర్, టామ్ హార్ట్లీ, జాక్ లీచ్, ఓలీ రాబిన్సన్, మార్క్ వుడ్
ఇంగ్లండ్‌తో తొలి రెండు టెస్ట్‌లకు భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్, కేఎస్ భరత్, దృవ్ జురెల్, కుల్దీప్ యాదవ్, ముకేశ్ కుమార్, మొహమ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా, ఆవేశ్ ఖాన్
Comments
Please login to add a commentAdd a comment