న్యూజిలాండ్‌తో తొలి టెస్టులో టీమిండియాకు వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. బెంగళూరులో జరుగుతున్న ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో రోహిత్ సేన 46 పరుగులకే కుప్పకూలింది. ఓపెనర్లు యశస్వి జైస్వాల్ 13, కెప్టెన్ రోహిత్ శర్మ 2 పరుగులే చేయగా.. వన్‌డౌన్ బ్యాటర్ విరాట్ కోహ్లి, ఆ తర్వాతి స్థానంలో వచ్చిన సర్ఫరాజ్ ఖాన్ సున్నా చుట్టారు.
పంత్ ఒక్కడే
ఈ క్రమంలో వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ 20 పరుగులు సాధించగా.. కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్ డకౌట్ కాగా.. కుల్దీప్ యాదవ్ రెండు, బుమ్రా ఒకటి, సిరాజ్ నాలుగు(నాటౌట్) పరుగులు చేశారు. దీంతో టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 31.2 ఓవర్లు మాత్రమే ఆడి కేవలం 46 పరుగులకే ఆలౌట్ అయింది. చెత్త ప్రదర్శనతో విమర్శలు మూటగట్టుకుంటోంది.
మోకాలికి బలంగా తాకిన బంతి
మరోవైపు.. బౌలింగ్‌లోనూ రోహిత్ సేన పెద్దగా ప్రభావం చూపలేకపోతోంది. ఈ క్రమంలో మూలిగే నక్కమీద తాటికాయ పడ్డట్లు టీమిండియాకు మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. స్టార్ బ్యాటర్ రిషభ్ పంత్ గాయపడ్డాడు. కివీస్ తొలి ఇన్నింగ్స్‌లో వికెట్ కీపింగ్ చేస్తున్న సమయంలో పంత్ మోకాలికి బాల్ బలంగా తాకింది.
కివీస్ ఇన్నింగ్స్ 37వ ఓవర్లో రవీంద్ర జడేజా వేసిన ఆఖరి బంతిని ఆడేందుకు డెవాన్ కాన్వే ప్రయత్నించి విఫలమయ్యాడు. ఈ క్రమంలో బాల్ ఆఫ్ స్టంప్ మీదుగా వెళ్లి పంత్ మోకాలిని తాకగా.. నొప్పితో విలవిల్లాడాడు. ఈ క్రమంలో టీమిండియా ఫిజియోలు వచ్చి పంత్‌ను పరీక్షించారు.
బరిలోకి జురెల్
అయితే, బాధ తాళలేక పంత్ గ్రౌండ్‌లోనే కుప్పకూలిపోయాడు. ఆ తర్వాత అతడు మైదానం వీడాడు. ఈ క్రమంలో పంత్ సబ్‌స్టిట్యూట్‌గా ధ్రువ్ జురెల్ వికెట్ కీపింగ్ బాధ్యతలు తీసుకున్నాడు. ఒకవేళ పంత్ గనుక కోలుకోకపోతే టీమిండియాకు మరిన్ని కష్టాలు తప్పవు.
ఇదిలా ఉంటే.. గురువారం నాటి ఆట ముగిసే సరికి న్యూజిలాండ్ 50 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. కివీస్ బ్యాటర్లలో ఓపెనర్, కెప్టెన్ టామ్ లాథమ్(15) నిరాశపరచగా.. మరో ఓపెనర్ డెవాన్ కాన్వే 91 పరుగులతో దుమ్ములేపాడు. విల్ యంగ్ 33 పరుగులు చేయగా.. రచిన్ రవీంద్ర 22, డారిల్ మిచెల్ 14 పరుగులతో క్రీజులో ఉన్నారు.
చదవండి: టీమిండియా రాకపోతే..: పీసీబీ, ఐసీసీకి ఇంగ్లండ్ బోర్డు వార్నింగ్!
Comments
Please login to add a commentAdd a comment