దంచికొట్టిన జైస్వాల్‌.. సొంతగడ్డపై అరుదైన రికార్డు | Ind vs NZ 2nd Test Day 3: Jaiswal Shines 65 Ball 77 Creates History | Sakshi
Sakshi News home page

దంచికొట్టిన యశస్వి జైస్వాల్‌.. సొంతగడ్డపై అరుదైన రికార్డు

Published Sat, Oct 26 2024 1:21 PM | Last Updated on Sat, Oct 26 2024 3:45 PM

Ind vs NZ 2nd Test Day 3: Jaiswal Shines 65 Ball 77 Creates History

న్యూజిలాండ్‌తో రెండో టెస్టులో టీమిండియా యువ ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌ అద్భుత అర్ధ శతకంతో మెరిశాడు. అవసరమైనపుడు దూకుడుగా ఆడుతూనే నిలకడ ప్రదర్శించాడు. మరో ఓపెనర్‌, కెప్టెన్‌ రోహిత్‌ శర్మ(8) తక్కువ స్కోరుకే అవుటైనా.. తాను మాత్రం పట్టుదలగా నిలబడ్డాడు.

41 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీ
కివీస్‌ జట్టు విధించిన 359 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో.. యశస్వి జైస్వాల్‌ 41 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. న్యూజిలాండ్‌ బౌలర్లు ఇబ్బంది పెడుతున్నా.. ఏమాత్రం తొణక్కుండా ధనాధన్‌ ఇన్నింగ్స్‌తో సమాధానమిచ్చాడు. ఈ క్రమంలో మూడుసార్లు లైఫ్‌ పొందిన యశస్వి 65 బంతుల్లోనే 9 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 77 పరుగులు సాధించాడు.

సెంచరీ చేయకుండానే..
అయితే, టీమిండియా రెండో ఇన్నింగ్స్‌లో 22వ ఓవర్‌ వేసిన కివీస్‌ స్పిన్నర్‌ మిచెల్‌ సాంట్నర్‌ యశస్విని అద్భుత బంతితో అవుట్‌ చేశాడు. సాంట్నర్‌ వేసిన టాప్‌క్లాస్‌ బాల్‌ను బాగానే టాకిల్‌ చేసినా.. దురదృష్టవశాత్తూ పూర్తిస్థాయిలో షాట్‌ కనెక్ట్‌ చేయలేకపోయాడు. దీంతో బంతి వెళ్లి ఫీల్డర్‌ డారిల్‌ మిచెల్‌ చేతుల్లో పడింది. ఫలితంగా సెంచరీ చేయకుండానే యశస్వి జైస్వాల్‌(77) నిష్క్రమించాడు.

ఇదిలా ఉంటే.. 25 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా నాలుగు వికెట్లు నష్టపోయి 134 పరుగులు చేసింది. రోహిత్‌ శర్మ(8), శుబ్‌మన్‌ గిల్‌(23), రిషభ్‌ పంత్‌(0- రనౌట్‌), యశస్వి జైస్వాల్‌ రూపంలో కివీస్‌ నాలుగు కీలక వికెట్లు పడగొట్టింది. లక్ష్య ఛేదనలో శనివారం నాటి మూడోరోజు ఆటలో 25 ఓవర్లు పూర్తయ్యే సరికి టీమిండియా విజయానికి 225 పరుగుల దూరంలో ఉంది.

క్యాలెండర్‌ ఇయర్‌లో సొంతగడ్డపై ఇలా
కాగా శనివారం నాటి ఆటలో యశస్వి జైస్వాల్‌ 22 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఉన్న సమయంలో అరుదైన మైలురాయిని చేరుకున్నాడు. క్యాలెండర్‌ ఇయర్‌లో సొంతగడ్డపై వెయ్యికి పైగా పరుగులు చేసిన ఏడో బ్యాటర్‌(మూడో భారత క్రికెటర్‌)గా నిలిచాడు.

అంతకు ముందు ఈ ఘనత సాధించిన క్రికెటర్లు
గుండప్ప విశ్వనాథ్‌(1979)- 1047 పరుగులు
సునిల్‌ గావస్కర్‌(1979)- 1013 పరుగులు
గ్రాహం గూచ్‌(1990)- 1058 పరుగులు
జస్టిన్‌ లాంగర్‌(2004)-1012 పరుగులు
మహ్మద్‌ యూసఫ్‌(2006)- 1126 పరుగులు
మైఖేల్‌ క్లార్క్‌(2012)- 1407 పరుగులు
యశస్వి జైస్వాల్‌(2024)- 1055* పరుగులు.

చదవండి: Ind vs Aus: నాలుగు వరుస శతకాలు.. టీమిండియాలో చోటు! ఓపెనర్‌గా ఫిక్స్‌!

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement