ఇదేం కెప్టెన్సీ రోహిత్‌?.. మాజీ హెడ్‌కోచ్‌ ఘాటు విమర్శలు | Ind vs NZ Ravi Shastri Fuming At Rohit Sharma Captaincy Blunder In Pune Test | Sakshi
Sakshi News home page

ఇదేం కెప్టెన్సీ రోహిత్‌?.. మాజీ హెడ్‌కోచ్‌ ఘాటు విమర్శలు

Published Fri, Oct 25 2024 4:33 PM | Last Updated on Fri, Oct 25 2024 4:47 PM

Ind vs NZ Ravi Shastri Fuming At Rohit Sharma Captaincy Blunder In Pune Test

టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మపై మాజీ హెడ్‌కోచ్‌ రవిశాస్త్రి విమర్శలు గుప్పించాడు. న్యూజిలాండ్‌తో రెండో టెస్టులో ఈ ముంబైకర్‌ కెప్టెన్సీ అస్సలు బాగాలేదంటూ పెదవి విరిచాడు. ప్రత్యర్థి జట్టు బ్యాటర్లు స్వేచ్ఛగా బ్యాట్‌ ఝులిపిస్తున్నా ఫీల్డింగ్‌ సెట్‌ చేయడంలో రోహిత్‌ విఫలమయ్యాడని విమర్శించాడు.

ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ 2023-25లో భాగంగా భారత్‌ స్వదేశంలో న్యూజిలాండ్‌తో మూడు మ్యాచ్‌లు ఆడుతోంది. ఈ క్రమంలో బెంగళూరులో జరిగిన తొలి టెస్టులో కివీస్‌ గెలిచి 1-0తో ఆధిక్యంలో నిలిచింది. ఈ నేపథ్యంలో పుణె వేదికగా గురువారం మొదలైన రెండో టెస్టులోనూ రోహిత్‌ సేన తడబడుతోంది.

బ్యాటింగ్‌లో మాత్రం మరోసారి విఫలం
టాస్‌ ఓడి తొలుత బౌలింగ్‌ చేసిన టీమిండియా కివీస్‌ను 259 పరుగులకు కట్టడి చేయగలిగింది. అయితే, బ్యాటింగ్‌లో మాత్రం మరోసారి విఫలమైంది. శుక్రవారం నాటి రెండో రోజు ఆటలో భాగంగా తొలి ఇన్నింగ్స్‌లో 156 పరుగులకే ఆలౌట్‌ అయింది. దీంతో న్యూజిలాండ్‌కు 103 పరుగుల ఆధిక్యం లభించింది.

ఈ క్రమంలో రెండో ఇన్నింగ్స్‌ మొదలుపెట్టిన కివీస్‌కు ఓపెనర్‌, కెప్టెన్‌ టామ్‌ లాథమ్‌ హాఫ్‌ సెంచరీ(86)తో శుభారంభం అందించాడు. ఇతర బ్యాటర్లు కూడా తమ వంతు సహకారం అందించడంతో మూడు వందలకు పైగా ఆధిక్యంతో న్యూజిలాండ్‌ పటిష్ట స్థితిలోకి వెళ్లింది.

ఈ నేపథ్యంలో రవిశాస్త్రి తోటి  కామెంటేటర్‌ మురళీ కార్తిక్‌తో మాట్లాడుతూ.. ‘‘కాస్త వ్యూహాత్మకంగా ముందుడుగు వేయాలి కదా! న్యూజిలాండ్‌ను 120 పరుగులకే ఆలౌట్‌ చేయాలని భావిస్తున్నట్లయితే.. అందుకు తగ్గట్లుగానే ఆడాలి. వికెట్లు కావాలనుకుంటే అటాకింగ్‌ పొజిషన్లలో ఫీల్డింగ్‌ సెట్‌ చేయాలి.

మూస పద్ధతిలో వెళ్తే ఎలా? 
ఒకవేళ ప్రత్యర్థి వికెట్‌ నష్టపోకుండానే 60 పరుగులు చేసినపుడు కూడా భిన్నంగా గాకుండా మూస పద్ధతిలో వెళ్తే ఎలా? ఫీల్డింగ్‌ ఇలా సెట్‌ చేయడం వల్ల మాత్రం మీకు ఎంతమాత్రం వికెట్లు లభించవు’’ అంటూ రోహిత్‌ శర్మ కెప్టెన్సీని విమర్శించాడు. 

కాగా ఈ మ్యాచ్‌లో బ్యాటర్‌గానూ రోహిత్‌ విఫలమయ్యాడు. తొమ్మిది బంతులు ఎదుర్కొని టిమ్‌ సౌతీ బౌలింగ్‌లో డకౌట్‌గా వెనుదిరిగాడు. ఇదిలా ఉంటే.. రెండో రోజు ఆట ముగిసే సరికి కివీస్‌ 53 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసింది. టీమిండియా కంటే 301 పరుగుల ఆధిక్యంలో నిలిచింది.

చదవండి: ఒక్క పరుగు.. 8 వికెట్లు.. 53 పరుగులకే కుప్పకూలిన డిఫెండింగ్‌ చాంపియన్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement