Paras Mhambrey Lauds Arshdeep Singh: విండీస్‌తో జరిగిన రెండో టీ20లో కీలక సమయంలో (ఆఖరి 4 ఓవర్లలో 31 పరుగులు చేయాల్సిన దశలో) పొదుపుగా (17, 19 ఓవర్లలో 4, 6 పరుగులు) బౌలింగ్ చేసి టీమిండియాను గెలిపించేందుకు విఫలయత్నం చేసిన యువ పేసర్ అర్షదీప్ సింగ్‌పై బౌలింగ్ కోచ్ పరాస్ మాంబ్రే ప్రశంసల వర్షం కురిపించాడు.
అర్షదీప్‌కు ఒత్తిడిలో ప్రశాంతంగా బౌలింగ్ చేయగల ప్రత్యేక సామర్థ్యం ఉందని కొనియాడాడు. పవర్ ప్లేతో పాటు డెత్ ఓవర్లలో ఒత్తిడిని అధిగమించి సత్ఫలితాలు రాబట్టగల సత్తా అర్షదీప్‌కు ఉందంటూ ఆకాశానికకెత్తాడు. అర్షదీప్‌లో ఈ సామర్థ్యాన్ని చాలాకాలంగా గమనిస్తున్నానని, రెండో టీ20లో అతను స్థాయి మేరకు రాణించడం సంతోషాన్ని కలిగించిందని అన్నాడు. భవిష్యత్తులో అర్షదీప్ టీమిండియాలో కీలక బౌలర్‌గా ఎదుగుతాడని ఆశాభావం వ్యక్తం చేశాడు.
టీమిండియా తరఫున మూడు టీ20లు ఆడిన అర్షదీప్ 5.91 సగటున ఐదు వికెట్లు పడగొట్టాడు. ఈ పంజాబ్ బౌలర్ స్వల్ప వ్యవధిలోనే తన అత్యుత్తమ ప్రదర్శనతో జట్టులో కీలక బౌలర్‌గా మారాడు. వెస్టిండీస్‌తో ప్రస్తుత టీ20 సిరీస్‌లో ఇప్పటివరకు జరిగిన రెండు మ్యాచ్‌ల్లో 6.25 సగటున మూడు వికెట్లు తీసి సత్తా చాటాడు. రెండో మ్యాచ్‌లో పొదుపుగా (4 ఓవర్లలో 1/26) బౌలింగ్ చేయడంతో పాటు ఓ వికెట్ (రోవ్‌మన్ పావెల్) పడగొట్టిన అర్షదీప్.. అంతకుముందు జరిగిన తొలి టీ20లోనూ డెత్ ఓవర్లలో అద్భుతంగా బౌలింగ్ (4 ఓవర్లలో 2/24) చేసి రెండు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు.
ఇదిలా ఉంటే, రెండో టీ20లో అర్షదీప్ టీమిండియాను గెలిపించేందుకు తన వంతు ప్రయత్నం చేసినప్పటికీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఈ మ్యాచ్‌లో భారత్ ఐదు వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. ఒబెడ్ మెక్‌కాయ్ ఆరు వికెట్లతో చెలరేగడంతో 19.4 ఓవర్లలో 138 పరుగులకు ఆలౌటైంది. ఛేదనలో విండీస్ 19.2 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది.
చదవండి: ఐర్లాండ్‌తో టీ20 సిరీస్.. దక్షిణాఫ్రికాకు బిగ్ షాక్..!
Comments
Please login to add a commentAdd a comment