
10 ఏళ్ల తర్వాత ఐసీసీ ట్రోఫీని సొంతం చేసుకోవాలనే టీమిండియా కల నెరవేరలేదు. ఓవల్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్‌లో 209 పరుగుల భారీ తేడాతో భారత్ ఓటమి పాలైంది. 444 పరుగులు భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు కేవలం 234 పరుగులకే ఆలౌటై ఘోర పరభావాన్ని చవిచూసింది.
ఈ మ్యాచ్‌లో బౌలింగ్ పరంగా కాస్త పర్వాలేదనిపించినప్పటికీ.. బ్యాటింగ్‌లో మాత్రం తీవ్ర నిరశాపరిచింది. అజింక్య రహానే, శార్ధూల్, జడేజా మినహా మిగితా ఎవరూ పెద్దగా రాణించలేక పోయారు. ఇక భారత జట్టు ఓటమి నేపథ్యంలో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ నాజర్ హుస్సేన్ ఆసక్తికర వాఖ్యలు చేశాడు. టీమిండియా టాప్-ఆర్డర్ బ్యాటర్లు పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజాం, న్యూజిలాండ్ ఆటగాడు కేన్ విలియమ్సన్‌ల నుంచి కొన్ని సూచనలు తీసుకోవాలని హుస్సేన్ అభిప్రాయపడ్డాడు.
"ఈ మ్యాచ్‌లో భారత బ్యాటర్ల ఆటతీరు నన్ను తీవ్ర నిరాశపరిచింది. భారత టాప్-ఆర్డర్ బ్యాటర్లు పేసర్లను ఎలా ఎదుర్కోవాలో పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజాం, న్యూజిలాండ్ ఆటగాడు కేన్ విలియమ్సన్‌ల చూసి నేర్చుకోవాలి. వాళ్లు ఇటువంటి పిచ్‌ల్‌పై బంతి మూవ్ అవుతున్నప్పుడు చాలా లేట్‌గా ఆడుతారు. ఈ సలహా నేను ఇచ్చినందుకు భారత అభిమానులు నన్ను ట్రోలు చేస్తారు అని నాకు తెలుసు" అంటూ నాజర్ స్కై స్పోర్ట్స్‌తో పేర్కొన్నాడు.
చదవండి: WTC Final: టాస్ ఓడిపోవడమే మంచిదైంది.. అతడు నా ఫేవరేట్ ప్లేయర్: కమ్మిన్స్