
Photo Courtesy: IPL/BCCI
KKR Beats RR... MI "Chances" To Enter Play Offs Explained: గత రెండు సీజన్లలో రన్‌రేట్‌లో వెనుకబడి ఐదో స్థానానికే పరిమితమైన కోల్‌కతా నైట్‌రైడర్స్ (కేకేఆర్) ఈసారి తప్పు దిద్దుకుంది. విజయాలతో పాటు రన్‌రేట్‌ను కూడా కాపాడుకుంటూ వచ్చి ఇప్పుడు నాలుగో జట్టుగా దాదాపుగా ‘ప్లే ఆఫ్స్’కు అర్హత సాధించింది. రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 86 పరుగులతో భారీ విజయం సాధించడం ఆ జట్టుకు మరింతగా కలిసొచ్చింది. షార్జాలో జరిగిన ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది.
శుబ్‌మన్ గిల్ (44 బంతుల్లో 56; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), వెంకటేశ్ అయ్యర్ (35 బంతుల్లో 38; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) కీలక ఇన్నింగ్స్ ఆడారు. అనంతరం రాజస్తాన్ 16.1 ఓవర్లలో 85 పరుగులకే కుప్పకూలింది. రాహుల్ తెవాటియా (36 బంతుల్లో 44; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) టాప్ స్కోరర్‌గా నిలవగా... ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ శివమ్ మావి (4/21), ఫెర్గూసన్ (3/18) ప్రత్యర్థిని దెబ్బ తీశారు.
చివర్లో జోరు...
తొలి 10 ఓవర్లలో 69 పరుగులు... తర్వాతి 10 ఓవర్లలో 101 పరుగులు... కోల్‌కతా ఇన్నింగ్స్ ఇలా రెండు భిన్న పార్శ్వాలుగా సాగింది. నెమ్మదిగా ఆట ప్రారంభించిన గిల్, వెంకటేశ్... పవర్‌ప్లేలో కూడా మరీ దూకుడుగా వెళ్లకుండా వికెట్‌ను కాపాడుకునేందుకు ప్రాధాన్యతనిచ్చారు. ఫలితంగా 6 ఓవర్లలో జట్టు 34 పరుగులే చేయగలిగింది. ఎట్టకేలకు ఉనాద్కట్ వేసిన పదో ఓవర్లో వెంకటేశ్ రెండు భారీ సిక్సర్లు కొట్టి జోరు పెంచాడు. తర్వాతి ఓవర్లోనే అతను వెనుదిరగడంతో 79 పరుగుల (65 బంతుల్లో) భాగస్వామ్యానికి తెర పడింది.
అయితే అక్కడి నుంచి కేకేఆర్ స్కోరు వేగంగా దూసుకుపోయింది. తర్వాతి బ్యాట్స్‌మెన్ నితీశ్ రాణా (12), రాహుల్ త్రిపాఠి (21), దినేశ్ కార్తీక్ (14 నాటౌట్), మోర్గాన్ (13 నాటౌట్) తలా ఓ చేయి వేయడంతో భారీ స్కోరు సాధ్యమైంది. సకారియా బౌలింగ్‌లో ఫోర్‌తో గిల్ 40 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మోరిస్ వేసిన చివరి ఓవర్లో 16 పరుగులు వచ్చాయి. రాజస్తాన్ 9 వైడ్లు సహా ఏకంగా 17 అదనపు పరుగులు ఇచ్చింది.
టపటపా...
సీజన్‌లో పేలవ ప్రదర్శన కొనసాగిస్తూ వచ్చిన రాజస్తాన్ తమ చివరి లీగ్ మ్యాచ్‌లోనూ దానిని కొనసాగించింది. ఒక్క తెవాటియా పోరాటం మినహా...మిగతా ఆటగాళ్లంతా చేతులెత్తేయడంతో జట్టుకు భారీ పరాజయం ఎదురైంది. అవుటయ్యేందుకు ఒకరితో మరొకరు పోటీ పడటంతో తొలి ఓవర్ నుంచే జట్టు పతనం వేగంగా సాగింది. పవర్‌ప్లే ముగిసేసరికే జట్టు 4 వికెట్లు కోల్పోయి 17 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఆ తర్వాతా అందరూ విఫలం కావడంతో కనీసం పోరాడేందుకు కూడా అవకాశం లేకపోయింది.
ముంబై 171 పరుగులతో గెలిస్తేనే...
ఇక కేకేఆర్ అనధికారికంగా ప్లే ఆఫ్స్ బెర్తు ఖరారు చేసుకున్నప్పటికీ... సాంకేతికంగా ముంబైకి ఇంకా అవకాశం ఉంది. అయితే, వాస్తవికంగా చూస్తే అది అసాధ్యమే. నేడు(శుక్రవారం) సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగే మ్యాచ్‌లో ముంబై ముందుగా బ్యాటింగ్ చేస్తే కనీసం 171 పరుగుల తేడాతో విజయం సాధించాలి. ఇక ఛేదన అయితే మాత్రం టాస్‌తోనే వారి ఆట ముగిసిపోతుంది. అంటే రెండోసారి బ్యాటింగ్ చేస్తే అంకెలకు అందని విధంగా ముంబై జట్టుకు ఏమాత్రం అవకాశం లేదు.
స్కోరు వివరాలు
కోల్‌కతా నైట్‌రైడర్స్ ఇన్నింగ్స్: గిల్ (సి) యశస్వి (బి) మోరిస్ 56; వెంకటేశ్ (బి) తెవాటియా 38; రాణా (సి) లివింగ్‌స్టోన్ (బి) ఫిలిప్స్ 12; త్రిపాఠి (బి) సకారియా 21; దినేశ్ కార్తీక్ (నాటౌట్) 14; మోర్గాన్ (నాటౌట్) 13; ఎక్స్‌ట్రాలు 17, మొత్తం (20 ఓవర్లలో 4 వికెట్లకు) 171. వికెట్ల పతనం: 1–79, 2–92, 3–133, 4–145. బౌలింగ్: ఉనాద్కట్ 4–0–35–0, మోరిస్ 4–0–28–1, సకారియా 4–0–23–1, ముస్తఫిజుర్ 4–0–31–0, దూబే 2–0–18–0, తెవాటియా 1–0–11–1, ఫిలిప్స్ 1–0–17–1.
రాజస్తాన్ రాయల్స్ ఇన్నింగ్స్: యశస్వి (బి) షకీబ్ 0; లివింగ్‌స్టోన్ (సి) త్రిపాఠి (బి) ఫెర్గూసన్ 6; సామ్సన్ (సి) మోర్గాన్ (బి) మావి 1; దూబే (బి) మావి 18; రావత్ (ఎల్బీ) (బి) ఫెర్గూసన్ 0; ఫిలిప్స్ (బి) మావి 8; తెవాటియా (బి) మావి 44; మోరిస్ (ఎల్బీ) (బి) వరుణ్ 0; ఉనాద్కట్ (సి) షకీబ్ (బి) ఫెర్గూసన్ 6; సకారియా (రనౌట్) 1; ముస్తఫిజుర్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 1, మొత్తం (16.1 ఓవర్లలో ఆలౌట్) 85. వికెట్ల పతనం: 1–0, 2–1, 3–12, 4–13, 5–33, 6–34, 7–35, 8–62, 9–85, 10–85. బౌలింగ్: షకీబ్ 1–0–1–1, శివమ్ మావి 3.1–0–21–4, నరైన్ 4–0–30–0, ఫెర్గూసన్ 4–0–18–3, వరుణ్ 4–0–14–1.
చదవండి: Anshu Malik: భారత తొలి మహిళా రెజ్లర్‌గా సరికొత్త చరిత్ర!
THAT. WINNING. FEELING! 👏 👏
— IndianPremierLeague (@IPL) October 7, 2021
The @Eoin16-led @KKRiders put up a clinical performance & seal a 86-run win over #RR. 💪 💪 #VIVOIPL #KKRvRR
Scorecard 👉 https://t.co/oqG5Yj3afs pic.twitter.com/p5gz03uMbJ
Comments
Please login to add a commentAdd a comment