
ఐపీఎల్ 2024 సీజన్‌లో భాగంగా ఇవాళ (మార్చి 26) రసవత్తర సమరం జరుగనుంది. గత సీజన్ విజేత సీఎస్‌కే.. ఫైనలిస్ట్ గుజరాత్ టైటాన్స్ ఇవాళ తలపడనున్నాయి. చెన్నైలోని చెపాక్ వేదికగా ఈ మ్యాచ్ జరుగనుంది. ఈ సీజన్‌లో ఇరు జట్లు తమ తొలి మ్యాచ్‌ల్లో విజయాలు సాధించి జోష్‌లో ఉన్నాయి. సీఎస్‌కే తమ తొలి మ్యాచ్‌లో ఆర్సీబీపై.. గుజరాత్ తమ తొలి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై గెలుపొందాయి.
గుజరాత్ అంటే చాలు రుతురాజ్‌కు పూనకం వస్తుంది..
ఈ సీజన్‌లో సీఎస్‌కే పగ్గాలు చేపట్టిన రుతురాజ్ గైక్వాడ్.. గుజరాత్ టైటాన్స్‌పై ఘనమైన ట్రాక్ రికార్డు కలిగి ఉన్నాడు. రుతు గుజరాత్‌తో తలపడిన ఐదు మ్యాచ్‌ల్లో ఏకంగా నాలుగు అర్ద శతకాలు బాదాడు. 2022 సీజన్‌లో గుజరాత్‌తో ఆడిన రెండు మ్యాచ్‌ల్లో (73, 53) హాఫ్ సెంచరీలు బాదిన రుతు.. గత సీజన్‌లో ఆడిన మూడు మ్యాచ్‌ల్లో మరో రెండు హాఫ్ సెంచరీలు (92, 60) చేశాడు. రుతు గుజరాత్‌తో చివరిసారిగా గత సీజన్ ఫైనల్లో తలపడ్డాడు. ఆ మ్యాచ్‌లో అతను 16 బంతుల్లో 26 పరుగులు చేసి పర్వాలేదనిపించాడు. గుజరాత్‌పై రుతురాజ్ 5 మ్యాచ్‌ల్లో 60.80 సగటున 146.86 స్ట్రయిక్‌రేట్‌తో 304 పరుగులు చేశాడు.
గుజరాత్‌పై రుతురాజ్‌కు వ్యక్తిగతంగా మంచి ట్రాక్ రికార్డే ఉన్నప్పటికీ.. జట్టుగా గుజరాత్‌దే సీఎస్‌కేపై పైచేయిగా ఉంది. ఈ ఇరు జట్లు ఐపీఎల్‌లో ఎదురెదురుపడిన ఐదు సందర్భాల్లో మూడింట గుజరాత్.. రెండు మ్యాచ్‌ల్లో చెన్నై విజయాలు సాధించాయి. చివరిసారిగా ఈ ఇరు జట్లు గత సీజన్ ఫైనల్లో తలపడగా.. ఆ మ్యాచ్‌లో సీఎస్‌కే విజయం సాధించి, ఐదోసారి ఐపీఎల్ ఛాంపియన్‌గా నిలిచింది.