IPL 2024: కేకేఆర్‌ బృందానికి చేదు అనుభవం | Sakshi
Sakshi News home page

IPL 2024: కేకేఆర్‌ బృందానికి చేదు అనుభవం

Published Tue, May 7 2024 1:22 PM

IPL 2024: KKR Diverted To Guwahati First And Then Varanasi After Failing To Land In Rainy Kolkata

కేకేఆర్‌ బృందానికి చేదు అనుభవం ఎదురైంది. ఎల్‌ఎస్‌జీతో మ్యాచ్‌ ముగించుకుని కోల్‌కతాకు బయల్దేరిన వీరికి ప్రతికూల వాతావరణ పరిస్థితులు తీవ్ర ఇబ్బందులు కలిగించాయి.

రెండు సార్లు వీరు ప్రయాణిస్తున్న చార్టర్‌ విమానం దారి మళ్లింపునకు గురైంది. నిన్న సాయంత్రం నుంచి కేకేఆర్‌ బృందం గాల్లో అటూ ఇటూ చక్కర్లు కొడుతుంది. పలు ట్విస్ట్‌ల అనంతరం ఇవాళ (మే 7) తెల్లవారుజామున కేకేఆర్‌ టీమ్‌ వారణాసిలో ల్యాండైంది.

పూర్తి వివరాల్లోకి వెళితే.. కేకేఆర్‌ టీమ్‌ మే 5న ఎల్‌ఎస్‌జీతో మ్యాచ్‌ ముగించుకుని నిన్న (మే 6) సాయంత్రం 5:45కు లక్నో నుంచి కోల్‌కతాకు బయల్దేరింది. వీరు రాత్రి 7:25 గంటలకంతా కోల్‌కతాలో ల్యాండ్‌ కావాల్సి ఉండింది.

అయితే నిన్న సాయంత్రం నుంచి కోల్‌కతాలో భారీ వర్షాలు కురుస్తుండటంతో కేకేఆర్‌ బృందం సేఫ్‌గా ల్యాండింగ్‌ కావడానికి కుదర్లేదు. రాత్రి 8:45 వరకు వీరు గాల్లోనే చక్కర్లు కొట్టారు. 8:46కు వీరి విమానం గౌహతికి డైవర్ట్‌ అయినట్లు మెసేజ్‌ వచ్చింది. 9:30 ఆ మధ్యలో వీరు గౌహతిలో ల్యాండ్‌ అయ్యారు.

ఎయిర్‌పోర్ట్‌లోనే ఉన్న కేకేఆర్‌ బృందానికి రాత్రి 9:43 గంటలకు మరో మెసేజ్‌ వచ్చింది. కోల్‌కతాలో ల్యాండ్‌ అవ్వడానికి క్లియరెన్స్‌ వచ్చింది. రాత్రి 11 గంటల్లోపు అక్కడ ల్యాండవుతామన్నది ఆ మెసేజ్‌ సారాంశం.

అయితే కేకేఆర్‌ బృందానికి ఈసారి కూడా చుక్కెదురైంది. కోల్‌కతాలో మరోసారి వాతావరణం అనుకూలించకపోవడంతో అక్కడ ల్యాండింగ్‌ కుదర్లేదు. దీంతో వీరు గాల్లోనే యూ టర్న్‌ తీసుకుని ఇవాళ తెల్లవారుజామున వారణాసికి చేరుకున్నారు. 

ఉదయం 3 గంటల ప్రాంతలో కేకేఆర్‌ టీమ్‌ వారణాసిలోని తాజ్‌ హోటల్‌లో దిగినట్లు కేకేఆర్‌ యాజమాన్యం ట్విటర్‌ వేదికగా వెల్లడించింది. ఇవాళ (మే 8) మధ్యాహ్నం 1:15 గంటలకు వీరు మరోసారి కోల్‌కతాలో ల్యాండ్‌ అయ్యేందుకు ప్రయత్నిస్తారు. మరి ఈసారైనా విజయవంతంగా ల్యాండ్‌ అవుతారో లేదో వేచి చూడాలి.

ఇదిలా ఉంటే, కేకేఆర్‌ టీమ్‌ మొన్న లక్నోతో జరిగిన మ్యాచ్‌లో 98 పరుగుల తేడాతో గెలుపొంది పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి ఎగబాకింది. ఈ సీజన్‌లో ఈ జట్టు ఇంకా మూడు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. మే 11న ముంబైతో.. 13న గుజరాత్‌.. 19న రాజస్థాన్‌ రాయల్స్‌తో తలపడాల్సి ఉంది. కేకేఆర్‌ టీమ్‌ ఇప్పటికే ప్లే ఆఫ్స్‌ బెర్త్‌పై కర్చీఫ్‌ వేసుకుని కూర్చుంది. ఈ జట్టుతో పాటు రాయల్స్‌కు కూడా ప్లే ఆఫ్స్‌కు క్లియరెన్స్‌ సాధించింది. 
 

 
Advertisement
 
Advertisement