Ind Vs SL: రాహుల్‌ ఇన్నింగ్స్‌ అంత గొప్పగా ఏమీలేదు.. కానీ! | Kaif Lauds Rahul Come Through Extremely Difficult Time Not Explosive Knock | Sakshi
Sakshi News home page

గడ్డు పరిస్థితులు.. రాహుల్‌ విధ్వంసకర ఇన్నింగ్స్‌ ఏమీ ఆడలేదు! కానీ: భారత మాజీ బ్యాటర్‌

Published Fri, Jan 13 2023 1:03 PM | Last Updated on Fri, Jan 13 2023 1:48 PM

Kaif Lauds Rahul Come Through Extremely Difficult Time Not Explosive Knock - Sakshi

కేఎల్‌ రాహుల్‌

India vs Sri Lanka, 2nd ODI: ‘‘గత కొంతకాలంగా అతడు గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నాడు. ముఖ్యంగా బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌లో పేలవ ప్రదర్శనతో విమర్శలపాలయ్యాడు. అంతేకాదు.. వైస్‌ కెప్టెన్‌గా తనకిప్పుడు హోదా లేదు. గత మూడు, నాలుగు నెలల కాలంగా పరిస్థితి మరీ ఘోరంగా తయారైంది. 

అయితే, ఇప్పుడు మాత్రం ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగి తన సత్తా చాటాడు. సరైన సమయంలో తనను తాను నిరూపించుకున్నాడు’’ అంటూ టీమిండియా మాజీ క్రికెటర్‌ మహ్మద్‌ కైఫ్‌.. కేఎల్‌ రాహుల్‌ను ప్రశంసించాడు. శ్రీలంకతో రెండో వన్డేలో భారత్‌ విజయంలో రాహుల్‌ కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే.

కీలక సమయంలో సత్తా చాటి..
కోల్‌కతాలో జరిగిన గురువారం నాటి మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ ఎంచుకున్న లంకను భారత బౌలర్లు దెబ్బకొట్టారు. కుల్దీప్‌ యాదవ్‌, మహ్మద్‌ సిరాజ్‌ మూడేసి వికెట్లు తీయడంతో.. 215 పరుగులకే పర్యాటక జట్టు కథ ముగిసింది.

అయితే, లక్ష్యం చిన్నదే అయినా.. టీమిండియా టాపార్డర్‌ విఫలం కావడం తీవ్ర ప్రభావం చూపింది. ఈ క్రమంలో ఐదో స్థానంలో బ్యాటింగ్‌ చేసిన వికెట్‌ కీపర్‌ కేఎల్‌ రాహుల్‌ 103 బంతులు ఎదుర్కొని 64 పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు. జట్టును గెలుపు తీరాలకు చేర్చాడు. 

కాగా గత కొన్నాళ్లుగా నిలకడలేమి ఫామ్‌తో సతమతమవుతున్న రాహుల్‌ కీలక సమయంలో రాణించి తన విలువేమిటో చాటుకున్నాడు. ఈ నేపథ్యంలో స్టార్‌ స్పోర్ట్స్ షోలో మాట్లాడుతూ మాజీ బ్యాటర్‌ మహ్మద్‌ కైఫ్‌ ఈ కర్ణాటక ప్లేయర్‌ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

గొప్పగా ఏమీ లేకపోవచ్చు!
‘‘జట్టు కష్టాల్లో ఉన్న వేళ ఆచితూచి ఆడాడు. పరిస్థితులకు తగ్గట్లుగా బ్యాటింగ్‌ చేశాడు. గత మ్యాచ్‌లో తన స్ట్రైక్‌ రేటు(134.48) బాగానే ఉంది. అప్పటికి ఇంకా వికెట్లు చేతిలో ఉన్నాయి. కానీ రెండో వన్డేలో పరిస్థితి వేరు.

ఇక్కడ తన బ్యాటింగ్‌ తన అనుభవానికి అద్దం పట్టింది. తన ఇన్నింగ్స్‌ గొప్పగా ఏమీ లేకపోవచ్చు. అయితే, కేఎల్‌ రాహుల్‌ ఇప్పుడు పరిణతి చెందిన బ్యాటర్‌ అంటే ఎలా ఉండాలో చూపించాడు’’ అని కైఫ్‌ కొనియాడాడు.

చేజారిన వైస్‌ కెప్టెన్సీ 
మొదటి వన్డేలో రోహిత్‌ శర్మ, శుబ్‌మన్‌ గిల్‌, విరాట్‌ కోహ్లి విశ్వరూపం ప్రదర్శించిన వేళ.. రాహుల్‌ 29 బంతుల్లో 39 పరుగులు చేసి అవుటయ్యాడు. ఇక బంగ్లా పర్యటన తర్వాత స్వదేశంలో లంకతో టీమిండియా టీ20 సిరీస్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన హార్దిక్‌ పాండ్యా.. వన్డే సిరీస్‌లో రోహిత్‌ శర్మ డిప్యూటీగా ఉన్నాడు.

రాహుల్‌ను వైస్‌ కెప్టెన్‌గా తప్పించి ఆల్‌రౌండర్‌ పాండ్యాకు ఈ బాధ్యతలు అప్పజెప్పింది యాజమాన్యం. ఈ నేపథ్యంలో కైఫ్‌ ఈ మేరకు వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఇదిలా ఉంటే.. రెండో వన్డేలో విజయంతో ఓ మ్యాచ్‌ మిగిలి ఉండగానే టీమిండియా సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుంది.

చదవండి: Ind Vs NZ 2023: టీమిండియాతో టీ20 సిరీస్‌.. జట్టును ప్రకటించిన కివీస్‌.. తొలిసారి ఆ ఇద్దరికి చోటు..
దంచికొట్టిన సాల్ట్‌! సన్‌రైజర్స్‌కు తొలి మ్యాచ్‌లోనే చేదు అనుభవం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement