కరాచీ: ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో టీమిండియా ఓటమికి జట్టు సారధి విరాట్ కోహ్లీని బాధ్యున్ని చేస్తూ జరుగుతున్న రాద్దాంతంపై పాక్ మాజీ క్రికెటర్ కమ్రాన్ అక్మల్ స్పందించాడు. కెప్టెన్‌గా, ఆటగాడిగా ఘన చరిత్ర కలిగిన కోహ్లీని కేవలం ఒక్క మ్యాచ్ ఓటమి వల్ల ఈ స్థాయిలో నిందించడాన్ని ఆయన తప్పుపట్టాడు. కోహ్లీ సాధించిన విజయాలపై అవగాహన లేని వాళ్లే ఆయనపై ముప్పేట దాడి చేస్తున్నారని దుయ్యబట్టాడు. కెప్టెన్‌గా కోహ్లీని తప్పిస్తే టీమిండియా ఐసీసీ టోఫ్రీ గెలుస్తుందా అని ప్రశ్నించాడు. ఈ విషయంలో ఒక్క కోహ్లీని మాత్రమే తప్పుపట్టడం ఏమాత్రం సరికాదని, కోహ్లీ స్థానంలో మరెవరినైనా కెప్టెన్‌గా నియమిస్తే ఐసీసీ ట్రోఫీ గెలుస్తాడని గ్యారంటీ ఇవ్వగలరా అని నిలదీశాడు. కీలక టోర్నీల్లో ఎందుకు విఫలమవుతున్నారో జట్టుగా విశ్లేషించుకోవాలని, ఫైనల్ ఫోబియా వీడేందుకు తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించాడు.
టీమిండియా కెప్టెన్‌గా కోహ్లీనే సరైన వ్యక్తి అని, భవిష్యత్తులో అతని సారధ్యంలోనే టీమిండియా ప్రపంచ క్రికెట్‌ను శాసిస్తుందని కోహ్లీకి బాసటగా నిలిచాడు. డబ్ల్యూటీసీ ఫైనల్లో టీమిండియా ఓటమికి కోహ్లీ కెప్టెన్సీనే కారణమని, అందుకు జట్టు సారధ్య బాధ్యతల నుంచి అతన్ని తప్పించాలని వస్తున్న డిమాండ్ల నేపథ్యంలో ఈ దాయాది దేశ ఆటగాడు కోహ్లీకి మద్దతుగా నిలవడం చర్చనీయాంశంగా మారింది. 'మై మాస్టర్ క్రికెట్ కోచ్' అనే యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ఆధునిక క్రికెట్‌లో కోహ్లీ గొప్ప ఆటగాడని, అంత కంటే అద్భుతమైన కెప్టెన్ అని కొనియాడాడు. మైదానంలో కోహ్లీ దూకుడుగా కనిపిస్తాడని, ఎంతో భావోద్వేగంతో ఉంటాడని, ఆ లక్షణాలే అతన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించేలా చేశాయని అభిప్రాయపడ్డాడు.
భారత క్రికెట్‌లో మార్పు సౌరవ్ గంగూలీతో మొదలైందని, ఆతర్వాత ధోనీ, కోహ్లీలు దాన్ని కంటిన్యూ చేశారని పేర్కొన్నాడు. ఇక, ఐసీసీ ట్రోఫీ గెలవలేదన్న కారణంగా కోహ్లీని సారధ్య బాధ్యతల నుంచి తప్పుకోవాలంటున్న వారికి ఈ పాక్ వికెట్ కీపర్ తారాస్థాయిలో చురకలంటించాడు. ఒక్క ఐసీసీ టోఫ్రీ మినహాయించి కోహ్లీ సారధ్యంలో టీమిండియా ఎన్నో చారిత్రక విజయాలు సాధించిందన్న విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశాడు. ఇదిలా ఉంటే, ఎన్నో అంచనాల నడుమ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో అడుగుపెట్టిన భారత్.. న్యూజిలాండ్ చేతిలో 8 వికెట్ల తేడాతో ఓటమి పాలైన విషయం తెలిసిందే. గత రెండేళ్లుగా జరిగిన ఈ మెగా టోర్నీలో అద్భుత ప్రదర్శన కనబర్చిన టీమిండియా.. కీలక ఫైనల్లో తడబడడంతో భారత మాజీలు, అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. కోహ్లీ.. కనీసం డ్రా కోసం కూడా ప్రయత్నించలేదని మండిపడుతున్నారు.
చదవండి: మ్యాచ్ రిఫరికి కరోనా.. ఆందోళనలో క్రికెటర్లు
Comments
Please login to add a commentAdd a comment