వన్డే వరల్డ్‌కప్-2019 ఫైనల్లో తమ తప్పిదం వల్లే న్యూజిలాండ్ మూల్యం చెల్లించిందన్న విషయాన్ని దిగ్గజ అంపైర్ మరైస్ ఎరాస్మస్ అంగీకరించాడు. ఆరోజు ఇంగ్లండ్‌కు ఆరు పరుగులకు బదులు ఐదు పరుగులు ఇచ్చి ఉండాల్సిందని అభిప్రాయపడ్డాడు.
సహచర అంపైర్ కుమార్ ధర్మసేన చెప్పే వరకు తమ తప్పిదాన్ని గుర్తించలేకపోయానని ఎరాస్మస్ తెలిపాడు. కాగా లండన్‌లోని లార్డ్స్ వేదికగా 2019 వరల్డ్‌కప్ ఫైనల్లో న్యూజిలాండ్- ఇంగ్లండ్ పోటీపడిన విషయం తెలిసిందే.
ఆద్యంతం ఉత్కంఠ రేపిన ఈ మ్యాచ్ టై కాగా.. సూపర్ ఓవర్ ద్వారా ఫలితాన్ని తేల్చారు. ఈ మెగా టోర్నీలో ఇంగ్లండ్ చాంపియన్‌గా అవతరించి తొలిసారి ప్రపంచకప్‌ను ముద్దాడింది. అయితే, ఫైనల్‌కు సంబంధించి నాటి అంపైర్లు ఎరాస్మస్, ధర్మసేన తీసుకున్న ఓ నిర్ణయం వివాదస్పదమైన సంగతి తెలిసిందే.
న్యూజిలాండ్ విధించిన 242 పరుగుల లక్ష్య ఛేదనలో ఆతిథ్య ఇంగ్లండ్ ఆఖరిదాకా అద్బుతంగా పోరాడింది. తొలి టైటిల్ అందుకోవాలన్న పట్టుదలతో న్యూజిలాండ్ కూడా తీవ్రంగా శ్రమించింది. ఈ క్రమంలో ఆఖరి ఓవర్ వేసిన ట్రెంట్ బౌల్ట్ బౌలింగ్‌లో నాలుగో బంతిని బెన్ స్టోక్స్ షాట్ ఆడాడు.
మరో ఎండ్‌లో ఉన్న ఆదిల్ రషీద్ పరుగుకు వచ్చాడు. ఒక రన్ పూర్తి చేసి రెండో రన్ కోసం పరుగు తీశారు. అప్పటికే బంతిని అందుకున్న ఫీల్డర్ మార్టిన్ గఫ్టిల్ దానిని స్ట్రైకర్ ఎండ్‌కు త్రో చేశాడు. అయితే, అది స్టోక్స్ బ్యాట్‌ను తాకుతూ బౌండరీకి వెళ్లింది. దీంతో ఇంగ్లండ్‌కు ఆరు పరుగులు(2+4) వచ్చినట్లు అంపైర్లు ప్రకటించారు.
నిజానికి పరుగు పూర్తి చేసే క్రమంలో స్టోక్స్ పూర్తిగా క్రీజులోకి రాకముందే బంతి ఓవర్ త్రో అయింది. కాబట్టి ఐసీసీ నిబంధనల ప్రకారం ఐదు పరుగులే(1+4) ఇవ్వాలి. కానీ ఈ విషయాన్ని సరిగ్గా గమనించలేకపోయిన అంపైర్లు ఆరు పరుగులు ఇవ్వడం.. ఆ తర్వాత ఇంగ్లండ్ మరో రెండు పరుగులు సాధించడంతో మ్యాచ్ టై(241 రన్స్) అయింది.
అనంతరం సూపర్ ఓవర్‌లో గెలిచిన ఇంగ్లండ్ టైటిల్ గెలిచింది. ఈ విషయం గురించి తాజాగా స్పందించిన ఎరాస్మస్.. ‘‘ఫైనల్ జరిగిన మరుసటి రోజు.. నా హోటల్ గది తలుపు తెరిచి బ్రేక్‌ఫాస్ట్‌కు వెళ్తున్నా.
అంతలోనే కుమార్ కూడా తన రూం నుంచి బయటకు వచ్చాడు. ‘మనం ఒక పెద్ద పొరపాటు చేశాం చూశావా?’ అని ప్రశ్నించాడు. అప్పుడు గానీ మా నిర్ణయం వల్ల ఏం జరిగిందో తెలుసుకోలేకపోయాను.
ఇద్దరం అప్పుడు సిక్స్.. సిక్స్.. సిక్స్ అనే అనుకున్నాం. కానీ వాళ్లు లైన్ క్రాస్ చేయని విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించలేకపోయాం’’ అని టెలిగ్రాఫ్ క్రికెట్‌తో వ్యాఖ్యానించాడు. కాగా గతంలో కుమార్ ధర్మసేన కూడా ఈవిషయం గురించి మాట్లాడుతూ తమ పొరపాటును అంగీకరించాడు. అయితే, అప్పట్లో సాంకేతికత ఇంతగా అభివృద్ధి చెందలేని పేర్కొన్నాడు. కానీ.. తన నిర్ణయం వల్ల పశ్చాత్తాపపడటం లేదని తెలిపాడు.
Comments
Please login to add a commentAdd a comment