
డబ్ల్యూటీఏ–1000 సిరీస్ టైటిల్ నెగ్గిన పిన్న వయస్కురాలిగా రికార్డు
దుబాయ్: మహిళల టెన్నిస్ సంఘం (డబ్ల్యూటీఏ) చరిత్రలో 1000 సిరీస్ సింగిల్స్ టైటిల్ నెగ్గిన పిన్న వయసు్కరాలిగా రష్యా టీనేజ్ స్టార్ మీరా ఆంద్రీవా రికార్డు నెలకొల్పింది. దుబాయ్ టెన్నిస్ చాంపియన్‌షిప్ డబ్ల్యూటీఏ–1000 టోర్నీలో విజేతగా నిలువడం ద్వారా 17 ఏళ్ల మీరా ఆంద్రీవా ఈ ఘనత సాధించింది. ఏకపక్షంగా జరిగిన ఫైనల్లో ప్రపంచ 14వ ర్యాంకర్ ఆంద్రీవా 7–6 (7/1), 6–1తో ప్రపంచ 38వ ర్యాంకర్ క్లారా టౌసన్ (డెన్మార్క్)పై గెలుపొందింది.
1 గంట 46 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో ఆంద్రీవా ఆరు ఏస్‌లు సంధించి, నాలుగు డబుల్ ఫాల్ట్‌లు చేసింది. తన సర్వీస్‌ను రెండు సార్లు కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్‌ను నాలుగుసార్లు బ్రేక్ చేసింది. ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ నంబర్‌వన్ సబలెంకాపై సంచలన విజయం సాధించిన క్లారా టౌసన్ తుది పోరులో తొలి సెట్‌లో గట్టిపోటీనిచ్చి ఆ తర్వాత తడబడింది.
విజేతగా నిలిచిన ఆంద్రీవాకు 5,97,000 డాలర్ల (రూ. 5 కోట్ల 17 లక్షలు) ప్రైజ్‌మనీతోపాటు 1000 ర్యాంకింగ్ పాయింట్లు... రన్నరప్ క్లారా టౌసన్‌కు 3,51,801 డాలర్ల (రూ. 3 కోట్ల 4 లక్షలు) ప్రైజ్‌మనీతోపాటు 650 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి.
దుబాయ్ ఓపెన్ టైటిల్ విజయంతో సోమవారం విడుదల చేసే డబ్ల్యూటీఏ ర్యాంకింగ్స్‌లో మీరా ఆంద్రీవా కెరీర్ బెస్ట్9వ ర్యాంక్‌కు చేరుకుంటుంది. 2007లో నికోల్ వైదిసోవా (చెక్ రిపబ్లిక్) తర్వాత టాప్–10లోకి వచ్చిన పిన్న వయసు్కరాలిగా ఆంద్రీవా గుర్తింపు పొందనుంది. దుబాయ్ ఓపెన్ టోర్నీలో ఆంద్రీవా విశేషంగా రాణించింది.
టైటిల్ గెలిచే క్రమంలో ముగ్గురు గ్రాండ్‌స్లామ్ చాంపియన్స్ మర్కెటా వొంద్రుసోవా (చెక్ రిపబ్లిక్), ఇగా స్వియాటెక్ (పోలాండ్), ఎలానీ రిబాకినా (కజకిస్తాన్)లపై గెలుపొందింది. 2004 డబ్ల్యూటీఏ ఫైనల్స్ టోర్నీలో మరియా షరపోవా (రష్యా) తర్వాత ఒకే టోర్నీలో ముగ్గురు గ్రాండ్‌స్లామ్ చాంపియన్స్‌ను ఓడించిన ప్లేయర్‌గా ఆంద్రీవా గుర్తింపు పొందింది.
Comments
Please login to add a commentAdd a comment