విధ్వంసకర శతకంతో విరుచుకుపడిన టీమిం‍డియా ట్రిపుల్‌ సెంచరీ హీరో | Mysore Warriors Captain Karun Nair Slams Blasting Hundred Vs Mangalore Dragons In KSCA T20 Tourney | Sakshi
Sakshi News home page

విధ్వంసకర శతకంతో విరుచుకుపడిన టీమిం‍డియా ట్రిపుల్‌ సెంచరీ హీరో

Published Tue, Aug 20 2024 7:06 AM | Last Updated on Tue, Aug 20 2024 8:49 AM

Mysore Warriors Captain Karun Nair Slams Blasting Hundred Vs Mangalore Dragons In KSCA T20 Tourney

మహారాజా ట్రోఫీ కేఎస్‌సీఏ టీ20 టోర్నీలో భాగంగా మంగళూరు డ్రాగన్స్‌తో నిన్న (ఆగస్ట్‌ 19) జరిగిన మ్యాచ్‌లో మైసూర్‌ వారియర్స్‌ కెప్టెన్‌, టీమిండియా ట్రిపుల్‌ సెంచరీ హీరో కరుణ్‌ నాయర్‌ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఈ మ్యాచ్‌లో కరుణ్‌ విధ్వంసకర శతకంతో విరుచుకుపడ్డాడు. కరుణ్‌ తన శతకాన్ని కేవలం 43 బంతుల్లో 10 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో పూర్తి చేశాడు. 

ఈ మ్యాచ్‌లో ఓవరాల్‌గా 48 బంతులు ఎదుర్కొన్న కరుణ్‌.. 13 ఫోర్లు, 9 సిక్సర్ల సాయంతో 124 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఫలితంగా తొలుత బ్యాటింగ్‌ చేసిన మైసూర్‌ వారియర్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 226 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. వారియర్స్‌ ఇన్నింగ్స్‌లో కరుణ్‌ మినహా ఎవరూ పెద్దగా రాణించలేదు. 

టీమిండియా మాజీ హెడ్‌ కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ తనయుడు సమిత్‌ ద్రవిడ్‌ 16, అజిత్‌ కార్తీక్‌ 11, కార్తీక్‌ 23, సుమిత్‌ కుమార్‌ 15 పరుగులు చేశారు. అఖర్లో బ్యాటింగ్‌కు దిగిన మనోజ్‌ భాంగడే 14 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 31 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. డ్రాగన్స్‌ బౌలర్లలో అభిలాష్‌ షెట్టి 2 వికెట్లు పడగొట్టగా.. నిశ్చిత్‌ రావు, డర్శన్‌ తలో వికెట్‌ దక్కించుకున్నారు. వారియర్స్‌ ఇన్నింగ్స్‌ అనంతరం వర్షం మొదలు కావడంతో వీజేడీ పద్దతిన డ్రాగన్స్‌ లక్ష్యాన్ని 14 ఓవర్లలో 166 పరుగులుగా నిర్దారించారు.

చేతులెత్తేసిన డ్రాగన్స్‌
14 ఓవర్లలో 166 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన డ్రాగన్స్‌ ఏ దశలోనూ గెలుపు దిశగా సాగలేకపోయింది. ఆ జట్టు ఆటగాళ్లలో నికిన్‌ జోస్‌ (32), కృష్ణమూర్తి సిద్ధార్థ్‌ (50), రోహన్‌ పాటిల్‌ (12), దర్శన్‌ (12) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు. ఫలితంగా ఆ జట్టు 14 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 138 పరుగులు మాత్రమే చేయగలిగింది. అజిత్‌ కార్తీక్‌, జగదీశ సుచిత్‌ తలో రెండు వికెట్లు తీసి డ్రాగన్స్‌ను దెబ్బకొట్టారు.  

 

 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement